Telugu Global
Sports

నేడు నీరజ్ చోప్రా ' బంగారు' పతకం పోరు!

భారత బల్లెంవీరుడు నీరజ్ చోప్రా వరుసగా రెండో ఒలింపిక్స్ స్వర్ణానికి గురిపెట్టాడు.

నేడు నీరజ్ చోప్రా  బంగారు పతకం పోరు!
X

భారత బల్లెంవీరుడు నీరజ్ చోప్రా వరుసగా రెండో ఒలింపిక్స్ స్వర్ణానికి గురిపెట్టాడు. కొద్ది గంటల్లో జరిగే ఫైనల్లో ప్రపంచ మేటి అథ్లెట్లతో అమీతుమీ తేల్చుకోనున్నాడు..

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ బంగారు పతకం ఆశలన్నీ జావలిన్ త్రో ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా పైనే కేంద్రీకృతమయ్యాయి. మహిళల కుస్తీలో వినేశ్ పోగట్ బంగారు పతకం పోరు విషాదంగా ముగియడంతో ఇప్పుడు నీరజ్ చోప్రా మాత్రమే భారత్ కు దిక్కుగా నిలిచాడు.

వరుసగా రెండో ఒలింపిక్స్ ఫైనల్లో...

2020 టోక్యో ఒలింపిక్స్ ఫైనల్స్ కు తొలిసారిగా చేరడంతో బాటు బంగారు పతకంతో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ..ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో సైతం రికార్డుత్రోతో ఫైనల్ చేరడం ద్వారా వరుసగా రెండో స్వర్ణానికి గురిపెట్టాడు.

పారిస్ క్రీడల ప్రధాన స్టేడియంలో ఈ రోజు జరిగే మెడల్ రౌండ్లో వివిధ దేశాలకు చెందిన 16 మంది స్టార్ అథ్లెట్లతో నీరజ్ తలపడనున్నాడు. ప్రస్తుత క్రీడల క్వాలిఫైయింగ్ రౌండ్ తన తొలి ప్రయత్నంలోనే రికార్డుస్థాయిలో 89.34 మీటర్ల దూరం విసరడం ద్వారా నేరుగా ఫైనల్లో అడుగుపెట్టగలిగాడు.

రెండుసార్లు 85 మీటర్లకు పైగా రికార్డు..

గత ఒలింపిక్స్ నుంచి ప్రస్తుత ఒలింపిక్స్ వరకూ నీరజ్ చోప్రా పాల్గొన్న15 అంతర్జాతీయ టోర్నీలలో రెండుసార్లు 85 మీటర్లకు పైగా దూరం బల్లెం విసిరడం ద్వారా సత్తా చాటుకొన్నాడు. గత మూడేళ్లుగా అత్యంత నిలకడగా రాణిస్తున్న జావలిన్ త్రోయర్ గా నీరజ్ గుర్తింపు తెచ్చుకొన్నాడు.

ప్రస్తుత ఒలింపిక్స్ తొలిదశ క్వాలిఫైయింగ్ రౌండ్లలో వివిధ దేశాలకు చెందిన 32 మంది విశ్వవిఖ్యాత బల్లెం వీరులు పోటీపడగా 12 మంది మెడల్ రౌండ్ కు అర్హత సంపాదించగలిగారు.

ఈరోజు జరిగే ఫైనల్లో ఈ 12 మంది మధ్యనే పోటీ ప్రధానంగా జరుగనుంది. వీరిలోముగ్గురికి మాత్రమే స్వర్ణ, రజత, కాంస్య పతకాలు దక్కించుకొనే అవకాశం ఉంది.

మెడల్ రౌండ్ కు అర్హత లక్ష్యం 84 మీటర్లు..

మెడల్ రౌండ్ కు అర్హతగా క్వాలిఫైయింగ్ రౌండ్లలో 84 మీటర్లుగా లక్ష్యాన్ని నిర్ణయించారు. గ్రూప్- బీ నుంచి పోటీకి దిగిన నీరజ్ తొలి ప్రయత్నంలోనే అర్హతకు నిర్దేశించిన లక్ష్యం కంటే 5.34 మీటర్ల దూరం ఎక్కువగా విసరడం ద్వారా నేరుగా ఫైనల్స్ లో అడుగుపెట్టాడు. ప్రస్తుత 2024 సీజన్లో నీరజ్ సాధించిన అత్యుత్తమ రికార్డు ఇదే కావటం విశేషం.

క్వాలిఫైయింగ్ రౌండ్ ఒక్కో గ్రూపు నుంచి 16 మంది తలపడగా..మొదటి ఆరుస్థానాలలో నిలిచిన 12 మంది మెడల్ రౌండ్లో అమీతుమీ తేల్చుకోనున్నారు. నీరజ్ కు బహమాస్ కు చెందిన పీటర్స్, జర్మన్ స్టార్ జూలియన్ వెబర్, చెక్ వీరుడు యాకుబ్ వాడ్లిచ్, కెన్యాకు చెందిన జూలియస్ యోగో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు.

ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో సైతం నీరజ్ బంగారు పతకం సాధించగలిగితే అది సరికొత్త చరిత్రే అవుతుంది.

పురుషుల కుస్తీ క్వార్టర్ ఫైనల్లో అమన్..

పురుషుల కుస్తీ 57 కిలోల విభాగంలో భారత వస్తాదు అమన్ షెరావత్ క్వార్టర్ ఫైనల్స్ చేరడం ద్వారా పతకానికి గెలుపు దూరంలో నిలిచాడు. క్రీడల 13వ రోజు పోటీలలో భాగంగా జరిగిన కుస్తీ పోరు ప్రీ- క్వార్టర్ ఫైనల్స్ లో అమన్ 12-0తో అల్బేనియా వస్తాదు జలిమ్ ఖాన్ అబకరోవ్ ను చిత్తు చేశాడు.

క్వార్టర్ ఫైనల్లో సైతం అమన్ విజయం సాధించగలిగితే కనీసం కాంస్య పతకం దక్కించుకొనే అవకాశం ఉంది.

మహిళల 100 మీటర్ల హర్డిల్స్ క్వాలిఫైయింగ్ రౌండ్ దశలోనే తెలుగమ్మాయి జ్యోతీ యర్రాజీ విఫలమై పోటీల నుంచి నిష్క్ర్రమించింది.

హాకీలో కాంస్య పతకమైన చిక్కేనా?

పురుషుల హాకీలో వరుసగా రెండో కంచు పతకానికి మాజీ చాంపియన్ భారత్ గురిపెట్టింది. గత క్రీడల్లో జర్మనీని ఓడించడం ద్వారా కాంస్య పతకం సాధించిన భారత్..ప్రస్తుత క్రీడల సెమీస్ లో అదే జర్మనీ చేతిలో 2-3 గోల్స్ తో ఓటమి పొందడం ద్వారా కాంస్య పతకం రౌండ్ కు పడిపోయింది. ఈరోజు రాత్రి జరిగే బ్రాండ్ మెడల్ పోరులో స్పెయిన్ తో భారత్ పోటీపడనుంది. భారత దిగ్గజ గోల్ కీపర్ శ్రీజేశ్ కు ఇది వీడ్కోలు మ్యాచ్ కావడం విశేషం.

మీరాబాయి చానుకు 4వ స్థానం...

మహిళల వెయిట్ లిఫ్టింగ్ లో గత క్రీడల్లో భారత్ కు రజత పతకం అందించిన మీరాబాయి చాను ప్రస్తుత క్రీడల్లో మాత్రం 4వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 199 కిలోల బరువు మాత్రమే ఎత్తి నాలుగో స్థానంలో నిలిచింది.

ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో మీరాబాయి చానుతో కలుపుకొని భారత్ వివిధ క్రీడల్లో మొత్తం ఐదు కాంస్య పతకాలు కోల్పోయినట్లయ్యింది. క్రీడల 12వ రోజు పోటీలు ముగిసే సమయానికి భారత్ మూడు కాంస్యాలు మాత్రమే సాధించి..పతకాల పట్టిక 67వ స్థానంలో నిలిచింది.

First Published:  8 Aug 2024 11:30 AM GMT
Next Story