బల్లెంవీరుడి చేజారిన 90 మీటర్ల రికార్డు!
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాతో 90 మీటర్ల రికార్డు దోబూచులాడుతోంది. అందినట్లే అంది చిక్కకుండా చేజారిపోతోంది.
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాతో 90 మీటర్ల రికార్డు దోబూచులాడుతోంది. అందినట్లే అంది చిక్కకుండా చేజారిపోతోంది.
బల్లెం విసురుడులో భారత బాహుబలి నీరజ్ చోప్రాకు 90 మీటర్ల రికార్డు అందనిద్రాక్షలా తయారయ్యింది. గత రెండు ఒలింపిక్స్ లోనూ భారత్ కు స్వర్ణ, రజత పతకాలు సాధించి పెట్టిన నీరజ్ కు ప్రపంచ టైటిల్ సాధించిన ఘనత సైతం ఉంది. అయితే..90 మీటర్ల లక్ష్యాన్ని చేరకుండానే నీరజ్ ఘనతలన్నీ సాధించడం విశేషం.
డైమండ్ లీగ్ లో రజతంతో సరి...
స్విట్జర్లండ్ వేదికగా జరిగిన 2024 డైమండ్ లీగ్ టో్ర్నీలో 90 మీటర్ల రికార్డుకు నీరజ్ చేరువగా వచ్చి దూరమయ్యాడు. ప్రపంచ మేటి జావలిన్ త్రో మొనగాళ్లు తలపడిన ఈ టోర్నీలో నీరజ్ ప్రస్తుత సీజన్లో అత్యుత్తమ రికార్డు నమోదు చేసినా ప్రయోజనం లేకపోయింది.
రెండుసార్లు ప్రపంచ విజేత, గ్రెనడా స్టార్ యాండర్సన్ పీటర్ల 90 మీటర్ల రికార్డుతో బంగారు పతకం అందుకోగా..నీరజ్ మాత్రం 89.49 మీటర్ల రికార్డుతో రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
యాండర్సన్ పీటర్స్ 90.61 మీటర్ల రికార్డును తన రెండో ప్రయత్నంలో సాధించడం ద్వారా బంగారు పతకం ఖాయం చేసుకోగలిగాడు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 87.08 మీటర్ల రికార్డుతో కాంస్య పతకం సాధించాడు.
ఆఖరి ప్రయత్నంలో అత్యుత్తమ రికార్డు...
26 ఏళ్ల నీరజ్ పారిస్ ఒలింపిక్స్ తరువాత పాల్గొన్న ఈ తొలి అంతర్జాతీయ మీట్ లో నాలుగోరౌండ్ వరకూ 4వ స్థానంలోనే ఉంటూ వచ్చాడు. తన 5వ త్రోలో నీరజ్ 85.58 మీటర్లతో పుంజుకోగలిగాడు.
తన ఆఖరి, చివరి రౌండ్ త్రోలో 89.49 మీటర్లతో రెండోస్థానానికి చేరుకోడం ద్వారా రజత పతకంతో సరిపెట్టుకొన్నాడు.0.51 మీటర్ల తేడాలో 90 మీటర్ల అత్యుత్తమ రికార్డును చేజార్చుకొన్నాడు.
ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్ జావలిన్ త్రోలో పాకిస్థాన్ అథ్లెట్ నదీమ్ స్వర్ణ, నీరజ్ రజత, యాండర్సన్ పీటర్స్ కాంస్య పతకాలు నెగ్గిన సంగతి తెలిసిందే.
మూడేళ్ల క్రితం టోక్యో వేదికగా ముగిసిన 2020 ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన తరువాత నుంచి నీరజ్ అంతర్జాతీయ పోటీలలో నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు.
తుంటె ఎముక గాయంతో బాధపడుతూనే ఒలింపిక్స్ బరిలో నీరజ్ నిలిచాడు. 26 సంవత్సరాల వయసుకే రెండు వేర్వేరు ఒలింపిక్స్ల్ లో పతకాలు సాధించిన భారత తొలి, ఏకైక ట్రాక్ అండ్ ఫీల్డ్ నీరజ్ మాత్రమే కావడం ఓ రికార్డు.