Telugu Global
Sports

ముంబై వాంఖడే స్టేడియానికి 50 ఏళ్ళు!

భారత క్రికెట్ ప్రధాన వేదికల్లో ఒకటైన ముంబై వాంఖడే స్టేడియం యాభయ్యవ పడిలో పడింది. ఎన్నో చిరస్మరణీయ ఘట్టాలకు వేదికగా నిలిచింది.

ముంబై వాంఖడే స్టేడియానికి 50 ఏళ్ళు!
X

భారత క్రికెట్ ప్రధాన వేదికల్లో ఒకటైన ముంబై వాంఖడే స్టేడియం యాభయ్యవ పడిలో పడింది. ఎన్నో చిరస్మరణీయ ఘట్టాలకు వేదికగా నిలిచింది.

భారత క్రికెట్ ప్రధాన కేంద్రం ముంబై అనగానే ..అరేబియా సముద్ర తీరంలో నిర్మించిన వాంఖడే స్టేడియం మాత్రమే అభిమానులకు గుర్తుకు వస్తుంది. ఆధునిక ముంబై క్రికెట్ కు ప్రతీకగా కనిపించే ఈ అంతర్జాతీయ స్టేడియం యాభైసంవత్సరాల వేడుకలు జరుపుకొంటోంది.

1974 నుంచి 2024 వరకూ....

భారతక్రికెట్లో ముంబైకి ప్రత్యేకస్థానమే ఉంది. సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, అజిత్ వాడేకర్, జహీర్ ఖాన్,రోహిత్ శర్మ లాంటి ఎందరో గొప్పగొప్ప ఆటగాళ్లను అందించిన ఘనత ముంబై క్రికెట్ సంఘానికి మాత్రమే దక్కుతుంది.

ముంబై క్రికెట్ అనగానే పాతరోజుల్లో బ్రబోర్న్ స్టేడియం మాత్రమే గుర్తుకు వచ్చేది. అయితే..ముంబై క్రికెట్ సంఘం మాజీ కార్యదర్శి శేష్ రావ్ కృష్ణారావు వాంఖడే పేరు మీద 1974లో ఈ స్టేడియాన్ని సరికొత్తగా నిర్మించారు.

1974లో వెస్టిండీస్ తో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ వేదికగా వాంఖడే స్టేడియం వెలుగులోకి వచ్చింది.

వాంఖడే స్టేడియం నుంచే సచిన్ ప్రస్థానం...

క్రికెట్ అభినవ బ్రాడ్మన్, 200 టెస్టుల వీరుడు, రికార్డుల మొనగాడు సచిన్ టెండుల్కర్ కు వాంఖడే స్టేడియానికి విడదీయరాని అనుబంధమే ఉంది. సచిన్ క్రికెట్ జీవితంలో కీలక ఘట్టాలకు వాంఖడే స్టేడియం మాత్రమే ప్రత్యక్షిసాక్షిగా నిలిచింది.

పదేళ్ల వయసు నుంచే వాంఖడే స్టేడియంతో మాస్టర్ సచిన్ కు పరిచయం ఉంది. 15 సంవత్సరాల వయసులో తన తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ నుంచి 34 సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ టెస్టు వరకూ వాంఖడే స్టేడియం వేదికగానే సచిన్ ఆడటం విశేషం.

2011 వన్డే ప్రపంచకప్ ను వాంఖడే స్టేడియం వేదికగానే అందుకోడం, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తన తొలి సెంచరీని ఇదే వేదికగా సాధించడం తనకు కలకాలం గుర్తుండిపోతాయని, వాంఖడే స్టేడియం లేకుంటే సచిన్ లేనేలేడంటూ తన అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నాడు.

1988లో సచిన్ తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్...

ముంబై మహానగరంలోని బాంద్రా నుంచి దూసుకొచ్చిన చిచ్చర పిడుగు సచిన్ వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన 1987 ప్రపంచకప్ మ్యాచ్ కు బాల్ బాయ్ గా వ్యవహరించాడు.

ఆ మరుసటి ఏడాదే 15 సంవత్సరాల చిరుప్రాయంలో గుజరాత్ పై ముంబై తరపున తన మొట్టమొదటి రంజీమ్యాచ్ ఆడిన సచిన్ సెంచరీతో తన కెరియర్ కు శుభారంభాన్ని ఇచ్చాడు.

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో క్రికెట్ వేదికల్లో ఆడినా..హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియం పరిసరాలను చూడగానే ఏదో తెలియని ఉత్సాహం, ఉద్వేగం తనను ఆవరిస్తాయని, పదేళ్ల కుర్రాడిగా తాను తొలిసారిగా వాంఖడే స్టేడియంలో అడుగుపెట్టానని, ధోనీ నాయకత్వంలో 2011 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారతజట్టులో తాను సభ్యుడిగా ఉండటం గర్వకారణమంటూ సచిన్ మురిసిపోయాడు.

1983 ప్రపంచకప్ తరువాత భారత్ మరో ప్రపంచకప్ గెలుచుకోడానికి 28 సంవత్సరాలపాటు వేచిచూడాల్సి వచ్చిందని, ఆ నిరీక్షణకు ముంబై వాంఖడే స్టేడియం వేదికగా తెరపడిందని, ఫైనల్లో శ్రీలంకపైన ధోనీ సిక్సర్ బాదడం ద్వారా విజయం పూర్తి చేయడం మరీ అపురూపమని మాస్టర్ గుర్తు చేసుకొ్న్నాడు.

విరాట్ 50వ సెంచరీకి వేదికగా...

భారత క్రికెట్ నయామాస్టర్ విరాట్ కొహ్లీ తన 50వ వన్డే శతకాన్ని సైతం వాంఖడే వేదికగానే సాధించడం విశేషం. 2013 నవంబర్ లో మాస్టర్ సచిన్ రిటైర్మెంట్ మ్యాచ్ కు

సైతం వాంఖడే స్టేడియం ఆతిథ్యమిచ్చింది. ఈ మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ 126 పరుగుల తేడాతో వెస్టిండీస్ ను చిత్తు చేయడం ద్వారా మాస్టర్ కు ఘనమైనరీతిలో వీడ్కోలు పలికింది. సచిన్ తన 200వ టెస్టుమ్యాచ్ ను వాంఖడే వేదికగానే ఆడి అల్విదా చెప్పాడు.

అంతేకాదు...ముంబై క్రికెట్ కు అంతర్జాతీయంగా ఖ్యాతి తెచ్చిన దిగ్గజ క్రికెటర్ల పేర్లతో స్టాండ్లను వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేశారు. అభినవ బ్రాడ్మన్ గా పేరుపొందిన సచిన్ విగ్రహాన్ని ముంబై క్రికెట్ సంఘం వాంఖడే స్టిడియంలోనే ప్రతిష్టించడం ద్వారా గౌరవించింది.

సచిన్ 50వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా వాంఖడే స్టేడియంలో ఆవిష్కరించిన మాస్టర్ విగ్రహాన్ని మహారాష్ట్ర్ర విఖ్యాత శిల్పి, కళాకారుడు ప్రమోద్ కాంబ్లే తీర్చిదిద్దారు.

రంజీట్రోఫీ ఫైనల్స్ కు వేదికగా...

రంజీట్రోఫీ చరిత్రలో 48సార్లు ఫైనల్స్ చేరి, ఇప్పటికే 41సార్లు విజేతగా నిలిచిన ముంబైజట్టు ప్రస్తుత సీజన్ ఫైనల్స్ ను తన హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియం వేదికగానే ఆడుతోంది.

ఐదురోజుల ఫైనల్లో మాజీ చాంపియన్ విదర్భను ఓడించడం ద్వారా 42వసారి రంజీట్రోఫీని అందుకోడం ద్వారా ముంబై జట్టు సరికొత్త చరిత్ర సృష్టించడంతో పాటు..

వాంఖడే స్టేడియం 50 సంవత్సరాల వేడుకలను చిరస్మరణీయం చేయాలన్న పట్టుదలతో ఉంది.

First Published:  12 March 2024 3:30 PM IST
Next Story