రంజీ ఫైనల్లో విదర్భ ఎదుట కొండంత లక్ష్యం!
రంజీట్రోఫీ చరిత్రలోనే రికార్డుస్థాయిలో 41సార్లు విజేతగా నిలిచిన ముంబై 42వ టైటిల్ తో తన రికార్డును తానే బద్దలు కొట్టడానికి రంగం సిద్ధం చేసుకొంది.
దేశవాళీ రంజీట్రోఫీ ఫైనల్లో విదర్భ ఎదుట ముంబై కొండంత లక్ష్యాన్ని ఉంచింది. ఆఖరి రెండురోజులఆటలో 538 పరుగులు సాధించాల్సి ఉంది...
రంజీట్రోఫీ కోసం ముంబై వాంఖడే స్టేడియం వేదికగా విదర్భ- ముంబైజట్ల నడుమ జరుగుతున్న మరాఠాయుద్ధం ఏకపక్షంగా ముగిసే అవకాశం కనిపిస్తోంది.
రంజీట్రోఫీ చరిత్రలోనే రికార్డుస్థాయిలో 41సార్లు విజేతగా నిలిచిన ముంబై 42వ టైటిల్ తో తన రికార్డును తానే బద్దలు కొట్టడానికి రంగం సిద్ధం చేసుకొంది.
ముషీర్-శ్రేయస్ జోరుతో...
తొలిఇన్నింగ్స్ లో విదర్భను 105 పరుగులకే కుప్పకూల్చడం ద్వారా పైచేయి సాధించిన ముంబై రెండో ఇన్నింగ్స్ లో భారీస్కోరు సాధించడం ద్వారా మ్యాచ్ పై పట్టు బిగించింది.
కెప్టెన్ అజింక్యా రహానే, టెస్ట్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలకు తోడు యువఆటగాడు ముషీర్ ఖాన్ ఫైటింగ్ సెంచరీ సాధించడంతో ముంబై 418 పరుగుల భారీస్కోరు సాధించగలిగింది. తొలిఇన్నింగ్స్ ఆథిక్యతతో కలుపుకొని ప్రత్యర్థి ఎదుట 538 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచగలిగింది.
అంతకుముందు రెండోరోజు ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజుఆటను నాటౌట్ బ్యాటర్లు అజింక్యా రహానే ( 58 నాటౌట్ ), ముషీర్ ( 51 నాటౌట్ ) కొనసాగించారు.
కేవలం 23 పరుగులు జోడించిన వెంటనే రహానే 73 పరుగుల స్కోరుకు వెనుదిరిగాడు. 143 బంతుల్లో 5 బౌండ్రీలు, ఓ సిక్సర్ మాత్రమే సాధించగలిగాడు. ముషీర్- రహానే మూడో వికెట్ కు 130 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేయగలిగారు.
రహానే స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ తో కలసి 4వ వికెట్ కు యువబ్యాటర్ ముషీర్ 168 పరుగుల భాగస్వామ్యంతో తమ జట్టును పటిష్టమైన స్థితిలో నిలిపారు.
సచిన్ ను మించిన ముషీర్ ఖాన్...
వన్ డౌన్ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన అండర్ -19 ఆటగాడు ముషీర్ ఖాన్ వయసును మించిన పరిణతితో ఆడి కీలక సెంచరీ సాధించాడు. సీనియర్ బ్యాటర్ అయ్యర్ తో కలసి కీలక భాగస్వామ్యం నమోదు చేయడంలో ప్రధానపాత్ర వహించాడు.
తొలిఇన్నింగ్స్ లో విఫలమైన శ్రేయస్ అయ్యర్ రెండో ఇన్నింగ్స్ లో దూకుడుగా ఆడి కేవలం 62 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు.
ముషీర్- అయ్యర్ జోడీ కేవలం 157 బంతుల్లోనే శతకభాగస్వామ్యం పూర్తి చేయగలిగారు.
మరోవైపు ముషీర్ 255 బంతుల్లో మూడంకెల స్కోరును చేరుకోగలిగాడు. 18 సంవత్సరాల ముషీర్ కెరియర్ లో ఇది కేవలం రెండో ఫస్ట్ క్లాస్ సెంచరీ మాత్రమే.
29 ఏళ్ల సచిన్ రికార్డు తెరమరుగు...
రంజీట్రోఫీలో 29 ఏళ్ల క్రితం సచిన్ నెలకొల్పిన రికార్డును ముషీర్ ఖాన్ అధిగమించాడు. రంజీఫైనల్లో చిన్నవయసులో సెంచరీ సాధించిన క్రికెటర్ గా సచిన్ పేరుతో ఉన్న రికార్డును ముషీర్ అధిగమించగలిగాడు.
1994-95 సీజన్ రంజీ ఫైనల్లో పంజాబ్ పై సచిన్ 21 సంవత్సరాల వయసులో రెండు ఇన్నింగ్స్ లోనూ శతకాలు బాదడం ద్వారా రికార్డు నెలకొల్పాడు. అయితే..అదే రికార్డును ముషీర్ 19 సంవత్సరాల 14 రోజుల వయసులోనే సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
రంజీ క్వార్టర్ ఫైనల్లో బరోడా పై తన తొలిశతకం బాదిన ముషీర్..చివరకు ఫైనల్లో సైతం సెంచరీ సాధించడం విశేషం.
విదర్భ చరిత్ర సృష్టించేనా?
రెండుసార్లు రంజీ చాంపియన్ విదర్భ మూడోసారి టైటిల్ నెగ్గాలంటే ప్రస్తుత ఫైనల్స్ చివరి రెండురోజుల ఆటలో మరో 528 పరుగుల స్కోరు సాధించాల్సి ఉంది. అయితే..అదేమంత తేలిగ్గాజరిగే పనికాదు. ఏదైనా అద్భుతం జరిగితే మినహా విదర్భ విజేతగా నిలిచే అవకాశం కనిపించడంలేదు.
యాభైసంవత్సరాల వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ టైటిల్ పోరులో ముంబై 42వసారి రంజీట్రోఫీని అందుకోడం దాదాపు ఖాయమనే చెప్పాలి.