Telugu Global
Sports

నేటి నుంచే డబ్ల్యూపీఎల్‌ 2024.. ఓపెనింగ్ మ్యాచ్‌లో ముంబై, ఢిల్లీ ఢీ

ఈ ఈవెంట్ 23న సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుండగా.. ఈ కార్యక్రమం తరువాత డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తొలి మ్యాచ్ రాత్రి 7:30కు జరగనుంది.

నేటి నుంచే డబ్ల్యూపీఎల్‌ 2024.. ఓపెనింగ్ మ్యాచ్‌లో ముంబై, ఢిల్లీ ఢీ
X

హర్మన్‌ప్రీత్‌ మెరుపులు, స్మృతి మంధన విరుపులు, షెఫాలి వర్మ విధ్వంసానికి సమయం ఆసన్నమైంది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ నేటినుంచి మొదలు కానుంది. గతేడాది కంటే ఈ సారి కాస్త ముందుగానే రెండో సీజన్‌ మొదలవుతోంది. ఢిల్లీ, గుజరాత్‌, ముంబై, బెంగళూరు, యూపీ జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌ గ్రూప్‌ దశలో 20 మ్యాచ్‌లు జరగనున్నాయి. దాదాపుగా అన్ని జట్ల స్టార్‌ క్రికెటర్లూ ఆడబోతుండటంతో లీగ్‌ రసవత్తరంగా, హోరాహోరీగా సాగనుంది. గత డబ్ల్యూపీఎల్‌తో మెరిసిన వారిలో శ్రేయాంక పాటిల్‌, టిటాస్‌ సధు వంటి వాళ్లు ఇటీవల జాతీయ జట్టు తరఫున అవకాశం దక్కించుకోగా.. ఈ సారి తమ వంతుకోసం యంగ్‌ ప్లేయర్స్‌ ఎదురుచూస్తున్నారు.


మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో రన్నరప్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. బెంగ‌ళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ నిర్వహించ‌నున్నారు. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూర్, యూపీ వారియ‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య ఫిబ్రవ‌రి 24న‌ రెండో మ్యాచ్ జ‌రుగునుంది. ఈ సీజన్‌లో మొదటి దశ మ్యాచ్‌లు బెంగళూరులో రెండో దశ మ్యాచ్‌లు ఢిల్లీలో జరగనున్నాయి. ఎలిమినేటర్‌, ఫైనల్‌ కలిపి మొత్తం 22 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మార్చి 17న ఢిల్లీలో ఫైనల్ మ్యాచ్‌ ఉంటుంది. తొలి సీజ‌న్‌లో ముంబైకే ప‌రిమిత‌మైన డ‌బ్ల్యూపీఎల్‌.. రెండో సీజ‌న్‌లో రెండు న‌గ‌రాల్లో జ‌రుగ‌నుంది.

ఈ ఏడాది మహిళల ప్రీమియర్ లీగ్ ఓపెనింగ్ కార్యక్రమాన్నిఅద్భుతంగా నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధం అయ్యింది. ఈ సాయంత్రం జరిగే ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్‌ నటులు షారూఖ్ ఖాన్, టైగర్‌ష్రాఫ్‌, వరుణ్‌ ధావన్‌, సిద్దార్థ్‌ మల్హోత్రా, కార్తీక్‌ ఆర్యన్‌ చిందేయనుండగా ప్రముఖ సింగర్లు తమ పాటలతో అలరించనున్నారు. ఈ ఈవెంట్ 23న సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుండగా.. ఈ కార్యక్రమం తరువాత డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తొలి మ్యాచ్ రాత్రి 7:30కు జరగనుంది.


First Published:  23 Feb 2024 12:34 PM IST
Next Story