భారత్- పాక్ మ్యాచ్ కు హాజరైన ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడి హఠాన్మరణం!
భారత్ లోనే అత్యంతశక్తిమంతమైన ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు అమోల్ కాలే న్యూయార్క్ నగరంలో హఠాన్మరణం చెందారు.
భారత్ లోనే అత్యంతశక్తిమంతమైన ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు అమోల్ కాలే న్యూయార్క్ నగరంలో హఠాన్మరణం చెందారు.
న్యూయార్క్ వేదికగా భారత్- పాక్ జట్ల మధ్య జరిగిన టీ-20 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో రోహిత్ సేన విజయం అభిమానులకు ఆనందం కలిగించినా..ముంబై క్రికెట్ సంఘం అభిమానులకు మాత్రం చేదుఅనుభవంగా మిగిలింది.
దాయాదుల సమరం ప్రత్యక్షంగా చూడటానికి ముంబై నుంచి న్యూయార్క్ నగరానికి వెళ్లిన ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు, 48 సంవత్సరాల అమోల్ కాలే హఠాన్మరణం పొందారు.
బీజెపీ నాయకుడు దేవేంద్ర పడ్నవీస్ కు అత్యంత సన్నిహితుడుగా పేరుపొందిన అమోల్ కాలే గత రెండేళ్లకాలంలో ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా పలు కార్యక్రమాలు నిర్వహించారు.
ముంబై క్రికెట్ సంఘానికి జరిగిన ఎన్నికల్లో భారత మాజీ ఆల్ రౌండర్ సందీప్ పాటిల్ పై నెగ్గడం ద్వారా ప్రతిష్టాత్మక అధ్యక్షపదవిని 46 సంవత్సరాల చిన్నవయసులోనే చేపట్టారు. నాగపూర్ కు చెందిన అమోల్ ఆ తరువాత ముంబై మహానగరంలో స్థిరపడ్డారు.
సచిన్ విగ్రహం ఏర్పాటులో ప్రధానపాత్ర...
ముంబై వాంఖడే స్టేడియంలో మాస్టర్ సచిన్ టెండుల్కర్ నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయడంలో అమోల్ కాలే చురుకైన పాత్ర పోషించారు.దేశవాళీ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులు గణనీయంగా పెరగడంలో తనవంతుగా కృషి చేశారు.
ముంబై క్రికెట్ అడ్డా వాంఖడే స్టేడియం వేదికగా పలు అంతర్జాతీయమ్యాచ్ లు నిర్వహించడంలో సఫలమయ్యారు. 2023 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్ తో పాటు పలు లీగ్ మ్యాచ్ లు సైతం ముంబై వేదికగానే నిర్వహించగలిగారు.
జాతీయ క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే రంజీట్రోఫీని ( 2023-24 ) ముంబైజట్టు తిరిగి గెలుచుకోడంతో 5 కోట్ల రూపాయల నజరానాను సైతం ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడి హోదాలో ప్రకటించారు.
ముంబైలో గత దశాబ్దకాలంగా పలు రకాల వ్యాపారసంస్థలను నిర్వహిస్తూ..క్రికెట్ సంఘానికి సైతం సేవలు అందిస్తూ వచ్చారు.
టెన్నిస్ బాల్ క్రికెట్ లీగ్ నిర్వహణలో...
ఇండియన్ స్ట్ర్రీట్ ప్రీమియర్ లీగ్, టెన్నిస్ బాల్ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ లాంటి వినూత్న క్రికెట్ టోర్నీలు నిర్వహించడంలో అమోల్ కాలే ప్రధానపాత్ర పోషించారు. భారత క్రికెటర్లకు బీసీసీఐ చెల్లిస్తున్న మ్యాచ్ ఫీజునే..ముంబై క్రికెటర్లకు సైతం చెల్లించేలా అమోల్ చర్యలు తీసుకొన్నారు.
క్రికెట్ ను విపరీతంగా అభిమానించే అమోల్..ముంబై క్రికెట్ సంఘం కార్యదర్శి అజింక్యా నాయక్, కార్యవర్గ సభ్యుడు సూరజ్ సామత్ లతో కలసి భారతజట్టు ఆడే ప్రపంచకప్ మ్యాచ్ లు చూడటానికి న్యూయార్క్ నగరానికి వచ్చారు.
క్రికెట్ మ్యాచ్ తరువాత గుండెపోటు...
న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్- పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూసి..తన విడిదికి చేరి విశ్రాంతి తీసుకొంటున్న సమయంలో అమోల్ కాలేకు తీవ్రస్థాయిలో గుండెపోటు వచ్చింది. వైద్యసహాయం అందించేలోపే గుండెఆగి మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
48 సంవత్సరాల చిన్నవయసులోనే అమోల్ కాలే హఠాన్మరణం పొందడం పట్ల బీసీసీఐ కార్యదర్శి జే షా, ఇతర కార్యవర్గ సభ్యులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.