Telugu Global
Sports

ఐపీఎల్ లో ధోనీ రిటైర్మెంట్ మ్యాచ్ వేదిక చెన్నై!

భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్, 'ఐపీఎల్ సూపర్ కింగ్' మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ వేదికగా ఖరారయ్యింది.

ఐపీఎల్ లో ధోనీ రిటైర్మెంట్ మ్యాచ్ వేదిక చెన్నై!
X

భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్, 'ఐపీఎల్ సూపర్ కింగ్' మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ వేదికగా ఖరారయ్యింది. 17వసీజన్ ఐపీఎల్ ప్లే-ఆఫ్ రౌండ్ మ్యాచ్ ల కార్యక్రమాన్ని సైతం బోర్డు ప్రకటించింది.

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడైన మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు పూర్తి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ..ఐపీఎల్ కు సైతం గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకొన్నాడు. ప్రస్తుత 2024 సీజన్ తో ఐపీఎల్ లో ధోనీ కెరియర్ ముగియనుంది.

మే 26న ధోనీ రిటైర్మెంట్.......

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా మే 26న జరిగే ఐపీఎల్-2024 సీజన్ ఫైనల్ మ్యాచ్ తో ధోనీ రిటైర్మెంట్ పరిపూర్ణం కానుంది. ఐపీఎల్ సాంప్రదాయం ప్రకారం డిఫెండింగ్ చాంపియన్ గా నిలిచిన జట్టుకే సీజన్ ప్రారంభ, ముగింపు మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చే అవకాశం ఉంటుంది.

ప్రస్తుత 17వ సీజన్ ప్రారంభమ్యాచ్ ను చెపాక్ స్టేడియం వేదికగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తో నిర్వహించారు. మే 26న జరిగే ఐపీఎల్ ఫైనల్స్ కు సైతం చెపాక్ స్టేడియం వేదిక కానుంది.

ఐదుసార్లు ఐపీఎల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ 17వ సీజన్ ఫైనల్స్ చేరినా..చేరకున్నా టైటిల్ సమరాన్ని చెపాక్ లోనే నిర్వహించనున్నట్లు బీసీసీఐ వర్గాలు ప్రకటించాయి.

అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫైయర్స్ ...

ప్రస్తుత సీజన్ ఎలిమినేటర్, క్వాలిఫైయర్ రౌండ్ మ్యాచ్ లను అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా నిర్వహిస్తారు.

దేశవ్యాప్తంగా మరికొద్ది రోజుల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కారణంగా లీగ్ దశ మ్యాచ్ ల కార్యక్రమంలో సైతం ఐపీఎల్ బోర్డు మార్పులు చేర్పులు చేయనుంది..

లీగ్ టేబుల్ టాపర్ గా రాజస్థాన్ రాయల్స్..

గత మూడురోజులుగా జరిగేన ప్రస్తుత సీజన్ తొలిరౌండ్ 5మ్యాచ్ ల్లో మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తొలివిజయాలు సాధించాయి.

లక్నో సూపర్ జెయింట్స్ ను 20 పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా రాజస్థాన్ రాయల్స్ 10 జట్ల లీగ్ టేబుల్ అగ్రస్థానంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై ఇండియన్స్ 6 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది.

బెంగళూరు వేదికగా ఈ రోజు జరిగే పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. తొలిరౌండ్ పోరులో చెన్నై చేతిలో బెంగళూరు ఓటమిపాలు కాగా...ఢిల్లీ క్యాపిటల్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.

First Published:  25 March 2024 2:46 PM IST
Next Story