Telugu Global
Sports

జోస్...ఐపీఎల్ లో సెంచరీల బాస్!

ఐపీఎల్ -17వ సీజన్ లో సెంచరీల మోత జోరందుకొంది. సీజన్ తొలిశతకాన్ని విరాట్ కొహ్లీ సాధిస్తే..రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ రెండు చేజింగ్ సెంచరీలతో టాపర్ గా నిలిచాడు.

జోస్...ఐపీఎల్ లో సెంచరీల బాస్!
X

ఐపీఎల్ -17వ సీజన్ లో సెంచరీల మోత జోరందుకొంది. సీజన్ తొలిశతకాన్ని విరాట్ కొహ్లీ సాధిస్తే..రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ రెండు చేజింగ్ సెంచరీలతో టాపర్ గా నిలిచాడు.

ఐపీఎల్ -2024 సీజన్లో మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ విజయపరంపర కొనసాగుతోంది. పది జట్ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 7 రౌండ్ల మ్యాచ్ ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించడం ద్వారా రాజస్థాన్ టేబుల్ టాపర్ గా నిలిచింది.

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా మాజీ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన హైస్కోరింగ్ పోరులో రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్లతో సంచలన విజయం సాధించింది.

భారత క్రికెట్ మక్కాలో పరుగుల విందు...

భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ కీలక పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగుల స్కోరుతో ప్రత్యర్థి ఎదుట 224 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచింది.

సమాధానంగా..ఓపెనర్ జోస్ బట్లర్ అజేయ చేజింగ్ సెంచరీతో రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 224 పరుగులతో విజేతగా నిలిచింది. రెండుజట్లూ కలసి ఈమ్యాచ్ లో 447 పరుగుల స్కోరు సాధించడం విశేషం.

సునీల్ నరేన్ సూపర్ సెంచరీ..

కోల్ కతా నైట్ రైడర్స్ స్పిన్ ఆల్ రౌండర్ సునీల్ నరేన్ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా మాత్రమే కాదు...పించ్ హిట్టింగ్ బ్యాటర్ గా కూడా సత్తా చాటుకొన్నాడు. సునీల్ నరేన్ మొత్తం 56 బంతుల్లోనే 13 ఫోర్లు, 6 సిక్సర్లతో 109 పరుగులు సాధించాడు. ఐపీఎల్ లో గత దశాబ్దకాలంగా ఆడుతున్న సునీల్ నరేన్ కు బ్యాటర్ గా ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. అంతేకాదు..ఐపీఎల్ చరిత్రలో 5 వికెట్లు పడగొట్టిన బౌలర్ గాను, శతకం బాదిన బ్యాటర్ గాను సునీల్ కు అరుదైన రికార్డు దక్కింది.

2012 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ పై 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టిన సునీల్..2024 సీజన్లో 109 పరుగులతో శతకం బాదడం ద్వారా రికార్డుల్లో చేరాడు.

ఐపీఎల్ చరిత్రలో శతకం బాదిన మూడో కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడిగా సునీల్ రికార్డు నెలకొల్పాడు. గతంలో బ్రెండన్ మెకల్లమ్, వెంకటేశ్ అయ్యర్ మాత్రమే కోల్ కతా ఫ్రాంచైజీ తరపున సెంచరీలు బాదిన బ్యాటర్లుగా ఉన్నారు. 2008లో బ్రెండన్ మెకల్లమ్, 2023 సీజన్లో వెంకటేశ్ ఆయ్యర్ సెంచరీలు నమోదు చేశారు.

చేజింగ్ లో బట్లర్ రెండో సెంచరీ...

224 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన రాజస్థాన్ కు జోస్ బట్లర్ సూపర్ చేజింగ్ సెంచరీతో విజయం అందించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న జోస్ తనదైన శైలిలో షాట్లు కొడుతూ ప్రస్తుత సీజన్లో రెండో అజేయ శతకం సాధించడం ద్వారా మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. బట్లర్ కేవలం 60 బంతులు మాత్రమే ఎదుర్కొని 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 107 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు.

ప్రస్తుత సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 100 పరుగులతో నాటౌట్ గా తనజట్టుకు విజయం అందించిన జోస్..కోల్ కతా నైట్ రైడర్స్ పైన సైతం అదేస్థాయి గెలుపును అందించాడు.

ఐపీఎల్ లో జోస్ బట్లర్ కు ఇది 7వ సెంచరీ కాగా..ప్రస్తుత సీజన్లో రెండో శతకం.

విరాట్ తర్వాతి స్థానంలో జోస్...

2008లో ప్రారంభమైన ఐపీఎల్ గత 17 సీజన్ల చరిత్రలో అత్యధికంగా 8 సెంచరీలు బాదిన ఘనత విరాట్ కొహ్లీకి ఉంది. విరాట్ తరువాతి స్థానంలో జోస్ బట్లర్ 7 శతకాలతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.

బెంగళూరు మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ 6 శతకాలతో మూడు, కెఎల్ రాహుల్, డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్ నాలుగేసి సెంచరీలతో సంయుక్త నాలుగు స్థానాలలో కొనసాగుతున్నారు.

టీ-20 క్రికెట్ చేజింగ్ లో బట్లర్ కు ఇది మూడో చేజింగ్ సెంచరీ కాగా..ఓవరాల్ గా 8వ శతకం. గత మూడేళ్లలోనే ఈ ఎనిమిది శతకాలు జోస్ సాధించడం విశేషం.

First Published:  17 April 2024 3:49 PM IST
Next Story