ఆసియా బ్యాడ్మింటన్లో భారత్ కు మిశ్రమఫలితాలు!
పారిస్ ఒలింపిక్స్ కు అర్హతగా జరుగుతున్న 2024 ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల, మహిళల విభాగాలలో భారత్ కు మిశ్రమఫలితాలు ఎదురయ్యాయి.
పారిస్ ఒలింపిక్స్ కు అర్హతగా జరుగుతున్న 2024 ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల, మహిళల విభాగాలలో భారత్ కు మిశ్రమఫలితాలు ఎదురయ్యాయి.
చైనా వేదికగా ప్రారంభమైన ఈ టోర్నీ పురుషుల, మహిళల సింగిల్స్ లో సీడెడ్ స్టార్లు హెచ్ఎస్ ప్రణయ్, పీవీ సింధు తొలిరౌండ్ విజయాలు సాధిస్తే..లక్ష్యసేన్, కిడాంబీ శ్రీకాంత్ తొలిరౌండ్ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్ర్రమించారు.
ప్రణయ్ 90 నిముషాల పోరాటం...
గాయం, ఫిట్ నెస్ సమస్యలతో గత కొంతకాలంగా బ్యాడ్మింటన్ కు దూరంగా ఉన్న ప్రపంచ 9వ ర్యాంక్ ప్లేయర్ ప్రణయ్ తొలిరౌండ్ గెలుపు కోసం 90 నిముషాలపాటు పోరాడాల్సి వచ్చింది.
పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించాలన్న పట్టుదలతో పోటీకి దిగిన ప్రణయ్ 17-21, 23-21, 23-21తో చైనాకు చెందిన లు గువాంగ్ జును అధిగమించగలిగాడు.
నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ పోరు తొలిగేమ్ ను 17-21తో చేజార్చుకొన్న ప్రణయ్ ఆ తర్వాతి రెండుగేమ్ లను 23-21, 23-21తో నెగ్గడం ద్వారా రెండోరౌండ్లో అడుగుపెట్టాడు. తుదపరి రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన లిన్ చున్ ఇతో తలపడాల్సి ఉంది.
చెమటోడ్చి నెగ్గిన సింధు...
మహిళల సింగిల్స్ తొలిరౌండ్ పోరులో ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ పీవీ సింధు గెలుపు కోసం మూడుగేమ్ ల పోరాటం చేసింది. మలేసియాకు చెందిన 33వ ర్యాంకర్ గో జిన్ వీతో సాగిన పోరులో సింధు 18-21, 21-14, 21-19తో విజేతగా నిలిచింది. జిన్ వీ ప్రత్యర్థిగా సింధు తన రికార్డును 5-1గా చేసుకోగలిగింది.
రెండోరౌండ్లో చైనా ప్లేయర్ హాన్ యూ తో సింధు తలపడనుంది. హాన్ యు ప్రత్యర్థిగా సింధు ఇప్పటి వరకూ ఐదుసార్లు తలపడి ..ఐదుకు ఐదు విజయాలతో తిరుగులేని ఆధిక్యంతో ఉంది.
పాపం! లక్ష్యసేన్.......
పారిస్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ కు అర్హత సాధించాలన్న భారత యువఆటగాడు లక్ష్యసేన్ ఆశలు తొలిరౌండ్ ఓటమితో అడియాతసలుగా మిగిలిపోయాయి. చైనా కు చెందిన టాప్ సీడింగ్ స్టార్ షీ యు క్వితో జరిగిన తొలిసమరంలో 19-21, 15-21తో లక్ష్య సేన్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
మరో తొలిరౌండ్ పోరులో ప్రపంచ 23వ ర్యాంక్ ప్లేయర్ కిడాంబీ శ్రీకాంత్ కు సైతం ఓటమి తప్పలేదు. చైనాకు చెందిన టాప్ సీడింగ్ ప్లేయర్ షి యు క్వీ వరుస గేమ్ లు నెగ్గడం ద్వారా విజేతగా నిలిచాడు.
మరో తొలిరౌండ్ పోరులో తెలుగుతేజం కిడాంబీ శ్రీకాంత్ కు సైతం పరాజయం తప్పలేదు. ఇండోనీసియా ఆటగాడు ఆంథోనీ జింటింగ్ 21-14, 21-13తో కిడాంబీని చిత్తు చేశాడు.
భారత యువఆటగాడు ప్రియాంశు రాజావాట్ 39 నిముషాల పోరులో మలేసియాకు చెందిన 8వ సీడ్ స్టార్ లీ జి జియా చేతిలో 9-21, 13-21తో ఓటమి చవిచూశాడు.
డబుల్స్ లోనూ వైఫల్యాలు...
పురుషుల, మహిళల డబుల్స్ తొలిరౌండ్లోనే భారత జంటలకు ఓటమి ఎదురయ్యింది. అర్జున్- ధృవ కపిల మూడుగేమ్ ల పోరులో చైనాకు చెందిన 7వ సీడ్ జంట లీయు చెన్- గ్జున్ ఈ ల చేతిలో 21-23, 21-19, 24-26తో పరాజయ పాలయ్యారు.
మహిళల డబుల్స్ లో సైతం భారత్ కు ఓటమి తప్పలేదు. తొలిరౌండ్లో భారత జోడీ ట్రీసా జోలీ-గాయత్రీ గోపీచంద్ 2-21, 11-21తో చైనాకు చెందిన 4వ సీడ్ జోడీ లీ షెంగ్, షు-టాన్ నింగ్ ల చేతిలో కంగు తిన్నారు.
పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్, కిడాంబీ శ్రీకాంత్, డబుల్స్ లో అర్జున్- ధృవ కపిల, గాయత్రీ గోపీచంద్- ట్రీసా జోలీ తొలిరౌండ్ పరాజయాలు చవిచూడటం ద్వారా..పారిస్ ఒలింపిక్స్ కు అర్హతను మరింత క్లిష్టం చేసుకోగలిగారు.