Telugu Global
Sports

ముంబైలో నేడు ప్రపంచకప్ వీరులకు సత్కారం!

2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ విజేత భారతజట్టు ను ఈరోజు జరిగే విజయోత్సవ వేడుకల్లో బీసీసీఐ ఘనంగా సత్కరించనుంది.

ముంబైలో నేడు ప్రపంచకప్ వీరులకు సత్కారం!
X

2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ విజేత భారతజట్టు ను ఈరోజు జరిగే విజయోత్సవ వేడుకల్లో బీసీసీఐ ఘనంగా సత్కరించనుంది.

అమెరికా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో ముగిసిన 2024 టీ-20 ప్రపంచకప్ లో విశ్వవిజేతగా నిలిచిన భారతజట్టును ఘనంగా సత్కరించడానికి ముంబై వాంఖడే స్టేడియంలో బీసీసీఐ ఘనమైన ఏర్పాట్లు చేసింది.

నాలుగురోజుల తరువాత స్వదేశం చేరిన రోహిత్ సేన రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు గత నెల 29నే బార్బడోస్ నుంచి స్వదేశానికి తిరిగిరావాల్సి ఉంది. అయితే..భీకర కరీబియన్ తుపాను దెబ్బతో భారత బృందంలోని 70 మంది సభ్యులూ మూడురోజులపాటు బ్రిడ్డ్ టౌన్ లోని తమ హోటెల్ గదులకే పరిమితం కావాల్సి వచ్చింది.

బెరీల్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉండడంతో బార్బడోస్ అంతర్జాతీయ విమానాన్ని మూడోరోజులపాటు మూసి వేయడంతో బీసీసీఐ కార్యదర్శి జే షాతో పాటు.. భారత క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బంది, జర్నలిస్టులు అక్కడే చిక్కుకుపోయారు.

తుపాను తీవ్రత తగ్గటం, విమానాశ్రయాన్ని రాకపోకలకు అనుమతించడంతో..భారతజట్టు సభ్యులు ఏర్ ఇండియా ప్రత్యేక విమానంలో 16 గంటలపాటు ప్రయాణం తరువాత స్వదేశానికి కొద్ది గంటల క్రితమే తిరిగి వచ్చారు.

ప్రధానితో మర్యాదపూర్వక సమావేశం..

టీ-20 ప్రపంచకప్ తో స్వదేశానికి తిరిగి వచ్చిన భారతజట్టు సభ్యులు రాజధాని ఢిల్లీ నగరంలోని ఐటీసీ మౌర్య హోటెల్ లో విడిది చేశారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీని మర్యాద పూర్వకంగా కలసిన అనంతరం ముంబైకి చేరుకోనున్నారు. ప్రధాని అధికారిక నివాసంలో రోహిత్ సేనతో పాటు జట్టు సహాయక సిబ్బందిని సత్కరించనున్నారు. ముంబై వాంఖడే స్టేడియంలో బీసీసీఐ సత్కారసభను ఏర్పాటు చేయడం ద్వారా భారీస్థాయిలో విజయోత్సవాలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది.

ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపు...

న్యూఢిల్లీ నుంచి ముంబైకి చేరిన భారతజట్టు సభ్యులను విమానాశ్రయం నుంచే ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపుగా వాంఖడే స్టేడియానికి తీసుకురానున్నారు. దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఈ విజయయాత్ర సాగనుంది. నారిమన్ పాయింట్ లోని ఏర్ ఇండియా భవనం నుంచి వాంఖడే స్టేడియం వరకూ ఓపెన్ టాప్ బస్ యాత్ర నిర్వహిస్తారు. రోహిత్ సేన రోడ్ షో దాదాపు 2 గంటలపాటు సాగనుందని బీసీసీఐ ప్రకటించింది.

సాయంత్రం 5-30 గంటల నుంచి జరిగే విజయోత్సవ వేడుకల్లో బీసీసీఐ కార్యవర్గ సభ్యులందరూ పాల్గొంటారు. 17 సంవత్సరాల తరువాత టీ-20 ప్రపంచకప్, 13 సంవత్సరాల తరువాత ఐసీసీ ట్రోఫీ సాధించిన రోహిత్ సేనకు బీసీసీఐ గతంలో ఎన్నడూలేని విధంగా 125 కోట్ల రూపాయల నగదు పురస్కారం ప్రకటించింది.

ఈ మొత్తాన్ని సత్కార సభలోనే అందచేయనున్నారు.

ఒక్కో ఆటగాడికి 5 కోట్ల నజరానా...

ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారతజట్టులోని 15 మంది సభ్యులకు 5 కోట్ల రూపాయలు చొప్పున, స్టాండ్ బై ఆటగాళ్లు ముగ్గురికి కోటి రూపాయలు చొప్పున, జట్టు సహాయక సిబ్బంది, చీఫ్ కోచ్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లకు కోటి రూపాయలు చొప్పున ప్రోత్సాహక నగదు పురస్కారాన్ని బీసీసీఐ ఇవ్వనుంది.

భారతజట్టు విజయోత్సవ వేడుకలను న్యూస్ -18 న్యూస్ నెట్ వర్క్ తో పాటు జియో సినిమా ప్రత్యక్షప్రసారం చేయనుంది.

First Published:  4 July 2024 11:13 AM IST
Next Story