2024 టీ-20 ప్రపంచకప్ బరిలో 43 ఏళ్ల కుర్రాడు!
2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ద్వారా ఉగాండా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పడానికి తహతహలాడుతున్నాడు. వయసుతో ఏమాత్రం సంబంధంలేదని చాటాలని ఉవ్విళూరుతున్నాడు.
2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ద్వారా ఉగాండా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పడానికి తహతహలాడుతున్నాడు. వయసుతో ఏమాత్రం సంబంధంలేదని చాటాలని ఉవ్విళూరుతున్నాడు.
20 ఓవర్లు..60 థ్లిల్సుగా సాగిపోయే ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ అంటే నూనూగు మీసాల కుర్రాళ్ల ఆట అనుకొనే రోజులు పోయాయి. ఐపీఎల్ లీగ్ నుంచి టీ-20 ప్రపంచకప్ టోర్నీల వరకూ వయసుతో ప్రమేయం లేకుండా కేవలం తమ ప్రతిభ, అనుభవంతో మాత్రమే ముదురు వయసులోనూ బరిలోకి దిగుతున్న క్రికెటర్లు మనకు చాలా తక్కువమందే కనిపిస్తారు.
మరి కొద్దివారాలలో..వెస్టిండీస్, అమెరికా క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో ప్రారంభంకానున్న 2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ద్వారా..ఆఫ్రికా రన్నరప్ ఉగాండా జట్టు సభ్యుడిగా 43 సంవత్సరాల ఆఫ్ స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా అరంగేట్రం చేయబోతున్నాడు. లేటు వయసులో ప్రపంచకప్ అరంగేట్రం చేసిన మొనగాడిగా నిలిచిపోనున్నాడు.
కంపాలా నుంచి ప్రపంచకప్ వరకూ...
అలనాటి బ్రిటీష్ పాలిత ఆఫ్రికా దేశాలలో ఒకటైన ఉగాండాలోనూ క్రికెట్ జాడలు ఉన్నాయి. అయితే..ఐసీసీ చొరవ, పూనికతో ఉగాండా సైతం ప్రపంచకప్ లో పాల్గొనే స్థాయికి చేరుకోగలిగింది.
2024 ఐసీసీ ప్రపంచకప్ అర్హత ఆఫ్రికా ఖండ పోటీలలో నమీబియా తరువాతి స్థానంలో నిలవడం ద్వారా తొలిసారిగా ప్రపంచకప్ బరిలో నిలవటానికి అర్హత సంపాదించింది. జింబాబ్వే లాంటి జట్టే ప్రపంచకప్ కు అర్హత సాధించడంలో విఫలం కావడం, ఉగాండా లాంటి పసికూనజట్టు తొలిసారిగా అర్హత సంపాదించడం విశేషం.
ప్రపంచకప్ గ్రూప్- సీ లీగ్ లో తలపడే ఉగాండా జట్టుకు బ్రయన్ మసాబా నాయకత్వం వహించనున్నాడు. మొత్తం 15 మంది సభ్యులజట్టులో 43 ఏళ్ళ ఫ్రాంక్ సుబుగా సైతం చోటు దక్కించుకోగలిగాడు.
క్రికెట్టే ఊపిరిగా...
ఉగాండా రాజధాని కంపాలాకు చెందిన ఫ్రాంక్ సుబుగాకు చిన్ననాటినుంచి క్రికెట్ అంటే ప్రాణం. చక్కటి ఆఫ్ స్పిన్నర్ గా గుర్తింపు తెచ్చుకొన్న సుబుగా కేవలం ఆటపైన ఉన్న మక్కువతోనే క్రికెటర్ గా కొనసాగుతూ వస్తున్నాడు. తగిన అవకాశాలు లేకున్నా ఏమాత్రం నిరాశపడలేదు. అయితే 2024 ప్రపంచకప్ రూపంలో సుబుగాను అదృష్టం వరించింది. ప్రపంచకప్ లో పాల్గొనే ఉగాండాజట్టులో చోటు దక్కడంతో సుబుగా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
43 సంవత్సరాస వయసులో ప్రపంచకప్ లో పాల్గొనే అవకాశం రావడాన్ని మించిన అదృష్టం మరొకటి లేదని మురిసిపోతున్నాడు. ఆఫ్రికాఖండ దేశాల ప్రపంచకప్ అర్హత టోర్నీలలో ఉగాండా అంచనాలకు మించి రాణించడమే కాదు..విజేత నమీబియా తరువాతి స్థానంలో నిలవడంలో సుబుగా సైతం తనవంతు పాత్ర పోషించాడు.
ఉగాండాజట్టులో ఆసియా సంతతి ఆటగాళ్లు....
మొత్తం 15 మంది సభ్యుల ఉగాండా జట్టులో భారత ఉపఖండ ( భారత్, పాకిస్థాన్ ) దేశాల మూలాలున్న ఆటగాళ్లు పలువురు ఉన్నారు. బ్రియానా మసాబా కెప్టెన్ గా, రియాజత్ అలీ షా వైస్ కెప్టెన్ గా వ్యవహరించే ఉగాండా జట్టులోని ఇతర ఆటగాళ్లలో కెన్నెత్ వైస్వా, దినేశ్ నకరానీ, ఫ్రాంక్ సుబుగా, రోనక్ పటేల్, రోజల్ ముకాసా, కాస్మాస్ క్వెవుటా, బిలాల్ హుస్సేన్, ఫ్రెడ్ అక్లెమ్, రాబిన్సన్ ఒబుయా, సిమోన్ సిసుజు, హెన్రీ సిసియోండో, అల్పెశ్ రాజ్ మణి, జుమా మియాజీ ఉన్నారు.
గ్రూప్ - సీ లీగ్ లో ఉగాండా పోరు...
ఆతిథ్య వెస్టిండీస్, అఫ్గనిస్థాన్, న్యూజిలాండ్, పాపువా న్యూగినియా లాంటి జట్లున్న గ్రూప్ -సీ లీగ్ లో ఉగాండా పోటీపడనుంది. పాపువా న్యూగినియా పైన మాత్రమే ఉగాండాకు విజయావకాశాలున్నాయి. రెండుసార్లు విన్నర్ వెస్టిండీస్, న్యూజిలాండ్, అప్ఘనిస్థాన్ జట్ల ధాటికి పసికూన ఉగాండా ఎంతవరకూ తట్టుకోగలదన్నది అనుమానమే.
ఫ్రాంక్ సుబుగా లాంటి ఆటగాళ్లు 43 సంవత్సరాల వయసులో సైతం ప్రపంచకప్ కు ఎంపిక కావడం ఓ అరుదైన ఘనతగా మిగిలిపోతుంది. ప్రతిభకు, పట్టుదలకు వయసుతో ఏమాత్రం సంబంధం లేదనటానికి సుబుగా ఎంపికే నిదర్శనం.
ఐసీసీ టీ-20 ప్రపంచకప్ చరిత్రలో..అత్యంత పెద్దవయసులో పాల్గొన్న ఆటగాడిగా ఫ్రాంక్ సుబుగా ఇక ప్రపంచ రికార్డు నెలకొల్పడమే తరువాయి..