మయాంక్ వేగానికి బీసీసిఐ ఫిదా..కోటి కాంట్రాక్టు!
ఢిల్లీ కుర్రాడు, లక్నో సూపర్ జెయింట్స్ మెరుపు ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ రొట్టె విరిగి నేతిలో పడింది. ఏకంగా ఫాస్ట్ బౌలర్ల కాంట్రాక్టు జాబితాలో చేరిపోయాడు.
ఢిల్లీ కుర్రాడు, లక్నో సూపర్ జెయింట్స్ మెరుపు ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ రొట్టె విరిగి నేతిలో పడింది. ఏకంగా ఫాస్ట్ బౌలర్ల కాంట్రాక్టు జాబితాలో చేరిపోయాడు.
అదృష్టం ఎవరిని ఏ వైపు నుంచి వచ్చి వరిస్తోందో చెప్పటం కష్టం. దానికి ఢిల్లీ కమ్ లక్నో ఫ్రాంచైజీ కుర్రఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ఏ మాత్రం మినహాయింపు కాదు.
గంటకు 155 కిలోమీటర్ల వేగంతో నిప్పులు చెరిగే బంతులు వేయటం ద్వారా ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజాల దృష్టిని మాత్రమే కాదు..ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డును సైతం ఆ కట్టు కొన్నాడు.
రెండుకు రెండు మ్యాచ్ ల్లోనూ...
ప్రపంచ క్రికెట్లో గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే దమ్మున్న ఫాస్ట్ బౌలర్లు ప్రస్తుతం చేతివేళ్ల మీద లెక్కించదగినంతమంది మాత్రమే ఉన్నారు. అలాంటి అగ్గిపిడుగు ఫాస్ట్ బౌలర్ల జాబితాలో 22 సంవత్సరాల మయాంక్ యాదవ్ సైతం వచ్చి చేరిపోయాడు.
ఐపీఎల్ లో తన మొదటి రెండుమ్యాచ్ ల్లోనే నిప్పులు చెరిగే బంతులతో మ్యాచ్ విన్నర్ గా నిలవడంతో పాటు..ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సైతం దక్కించుకొన్న మయాంక్ ను ప్రపంచ ఫాస్ట్ బౌలింగ్ మాజీ దిగ్గజాలు బ్రెట్ లీ, అలెన్ డోనాల్డ్ ఎంతగానో మెచ్చుకొన్నారు. మయాంక్ లాంటి బౌలర్ భారత్ కు దొరకడం అదృష్టమంటూ ఆకాశానికి ఎత్తేశారు.
20 లక్షల నుంచి కోటి రూపాయలకు...
న్యూఢిల్లీలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మయాంక్ తన తండ్రి ప్రేరణతో ఫాస్ట్ బౌలింగ్ వైపు మొగ్గు చూపాడు. చక్కటి లైన్ అండ్ లెగ్త్ తో కుదురైన బౌలింగ్ కు ..155 కిలోమీటర్ల వేగాన్ని జోడించి మరీ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకోగలిగాడు.
గత సీజన్లోనే 20 లక్షల కనీసధరకు లక్నో ఫ్రాంచైజీలో చేరిన మయాంక్ ఫిట్ నెస్ సమస్యలతో 16వ సీజన్ మ్యాచ్ లకు దూరమయ్యాడు. అయితే ..ప్రస్తుత 17వ సీజన్లో తన అరంగేట్రం మ్యాచ్ లోనే 3 వికెట్లు పడగొట్టడం, ఆ తర్వాతి మ్యాచ్ లో సైతం అదేజోరుతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకోడంతో మయాంక్ పేరు మార్మోగిపోయింది.
గంటకు 150 కిలోమీటర్ల సగటు వేగంతో బౌలింగ్ చేయటం, చక్కటి నియంత్రణతో 155 కిలోమీటర్ల వేగంతో బ్యాటర్లను కకావికలు చేయటం మయాంక్ ను గొప్ప భవిష్యత్ ఉన్న బౌలర్ గా నిలిపింది.
గాయంతో కొద్దిమ్యాచ్ లకే పరిమితం..
ప్రస్తుత సీజన్లో ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో మయాంక్ 3.1 ఓవర్లు మాత్రమే బౌల్ చేసి పక్కటెముకల గాయంతో ఆట నుంచి తప్పుకొన్నాడు. సీజన్ మిగిలిన మ్యాచ్ ల్లో మయాంక్ పాల్గొనే అవకాశం లేదని లక్నో ఫ్రాంచైజీ సైతం అధికారికంగా ప్రకటించింది.
అయితే..మయాంక్ లోని వేగం విలువను గ్రహించిన బీసీసీఐ ఏడాదికి కోటి రూపాయల కాంట్రాక్టు ఇచ్చి గొప్ప బౌలర్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. వార్షిక కాంట్రాక్టులు లేకున్నా..ప్రతిభావంతులైన ఫాస్ట్ బౌలర్లకు కోటి రూపాయల వంతున పేస్ బౌలింగ్ కాంట్రాక్టు ఇవ్వటం బీసీసీఐ ప్రస్తుత సీజన్ నుంచి మొదలు పెట్టింది. ఇప్పటికే ఉమ్రాన్ మాలిక్, విద్వత్ కావేరప్ప, వ్యాషక్ విజయ్ కుమార్, యాశ్ దయాల్, ఆకాశ్ దీప్ లాంటి యువ బౌలర్లు కోటి రూపాయల కాంట్రాక్టులో ఉన్నారు. ఇదే జాబితాలో మయాంక్ ను సైతం చేర్చాలని బీసీసీఐ నిర్ణయించింది.
కాంట్రాక్టుతో మయాంక్ కు చక్కటి చికిత్సతో పాటు నిపుణుల పర్యవేక్షణలో నాణ్యమైన శిక్షణ సైతం అందుతుంది. లక్నో సూపర్ జెయింట్స్ ప్లే-ఆఫ్ రౌండ్ చేరగలిగితే మయాంక్ ను ఆడించే అవకాశం ఉందని, లేదంటే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించే రీహెబిలేషన్ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు..ఆస్ట్ర్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ కోసం కంగారూల్యాండ్ కు వెళ్లే భారతజట్టులో మయాంక్ కు చోటు కల్పించాలని ఎంపిక సంఘం భావిస్తోంది. మంచిభవిష్యత్ ఉన్న బౌలర్ మయాంక్ ను రాటుదేలేలా చేయాలని బీసీసీఐ గట్టిగా నిర్ణయించింది.
మొత్తం మీద 20 లక్షల రూపాయల ఐపీఎల్ కాంట్రాక్టుతో మొదలైన మయాంక్ ప్రస్థానం..ప్రస్తుతం కోటి రూపాయల బీసీసీఐ పేస్ బౌలింగ్ కాంట్రాక్టు వద్దకు వచ్చి ఆగింది.
ఉమ్రాన్ ను మించిన మయాంక్..
ఐపీఎల్ గత 17 సీజన్ల చరిత్రలో అత్యంత వేగంగా బంతులు విసిరిన భారత బౌలర్ గా జమ్మూ-కాశ్మీర్ కు చెందిన ఉమ్రాన్ మాలిక్ పేరుతో రికార్డు ఉంది. ఆ రికార్డును ప్రస్తుత సీజన్ తన తొలిమ్యాచ్ లోనే మయాంక్ అధిగమించగలిగాడు. గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా బంతి విసిరిన ఫాస్ట్ బౌలర్ రికార్డు ఆస్ట్ర్రేలియాకు చెందిన షేన్ టెయిట్ పేరుతో ఉంది. టెయిట్ 157.7 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతే ఇప్పటి వరకూ ఐపీఎల్ రికార్డుగా ఉంది. ఆ తర్వాతి స్థానాలలో భారత్ కు చెందిన ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్ నిలిచారు.
ఐపీఎల్ చరిత్రలో మయాంక్ విసిరిన బంతి ఐదో అత్యంతవేగవంతమైన బంతిగా రికార్డుల్లో చేరింది. తన ఆఖరి ఓవర్లో మయాంక్ గంటకు 152, 153, 154 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడం విశేషం.
21 సంవత్సరాల వయసులోనే నిప్పులు చెరిగే బౌలింగ్ తో చెలరేగిపోతున్న మయాంక్ కు కంగారూ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ హ్యాట్సాఫ్ చెప్పాడు. భారత అమ్ములపొదిలో మరో మెరుపు ఫాస్ట్ బౌలర్ వచ్చి చేరాడంటూ ప్రశంసించాడు.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో విశ్వరూపమే ప్రదర్శించాడు. తన కోటా 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.
కనీసం ఒక్క వైడ్ లేదా నోబాల్ లేకుండా 17 డాట్ బాల్స్ వేయడం ద్వారా సంచలనమే సృష్టించాడు. మిడిల్, డెత్ ఓవర్లలో అగ్నిగోళాల్లాంటి బంతులు వేస్తూ లక్నోజట్టుకు వరుస విజయాలు అందించాడు. అత్యంత వేగవంతమైన 156.7 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరి 2024 సీజన్ కే ఫాస్టెస్ట్ బౌలర్ గా నిలిచాడు.
స్పీడ్ థ్రిల్స్..స్పీడ్ విన్స్.....
స్పీడ్ థ్రిల్స్, స్పీడ్ కిల్స్ అన్న హెచ్చరికను యువఫాస్ట్ బౌలర్ మయాంక్ తనకు అనుకూలంగా మలచుకొన్నాడు. స్పీడ్ థ్రిల్స్ ..స్పీడ్ విన్స్ అనుకొనేలా చేశాడు. కేవలం 21 ఏళ్ల వయసుకే మయాంక్ ఇంత వేగంగా ఎలా బౌల్ చేయగలుగుతున్నాడు, మయాంక్ మెరువువేగం వెనుక అసలు రహస్యం ఏమిటంటూ మీడియా ప్రతినిథులు ఆరా తీస్తే ..అసలు రహస్యం ఏమిటో బయటపడింది.
సాధారణంగా..ఫాస్ట్ బౌలర్లు మాంసాహారంతో కూడిన పౌష్టిక, సమతుల ఆహారం తీసుకొంటారన్నది వాస్తవమే. ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్లలో ఎక్కువ మంది మాంసాహారులే.
అయితే ..మయాంక్ మాత్రం మాంసాహారాన్ని విసర్జించి రెండేళ్లు అయ్యిందని, శాకాహారిగా మారిన తరువాత అతని బౌలింగ్ లో వాడివేడీ పెరిగినట్లు మయాంక్ తల్లి మమతా యాదవ్ ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది.
శ్రీకృష్ణ భక్తుడు మయాంక్...
మయాంక్ యాదవ్ యుక్తవయసులోనే శ్రీకృష్ణభక్తుడిగా మారాడు. గత రెండు సంవత్సరాలుగా మాంసాహారాన్ని విడిచి పెట్టి పూర్తి శాకాహారిగా మారిపోయినట్లు అతని తల్లి మమత చెబుతున్నారు.
మయాంక్ కు పప్పు, ఆకుకూరలు, రొట్టెలు, పాలపదార్థాలు మాత్రమే ఆహారంగా ఇస్తున్నట్లు తెలిపారు. మయాంక్ శరీరతత్వానికి మాంసాహారం అస్సలు పడదని, శాకారం తీసుకోడంతో అతని శారీరక పటుత్వంలోనే కాదు..బౌలింగ్ లోనూ అనూహ్యమైన మార్పులు చోటు చేసుకొన్నట్లు వివరించింది.
కృష్ణభక్తుడుగా మారటంతో తనకు తానుగా మాంసాహారానికి దూరమయ్యాడని, శాకాహార భోజనంతో తన ఫిట్ నెస్ ను మెరుగుపరచుకోడం తాను గమనించినట్లు వివరించారు.