Telugu Global
Sports

టీ20 వరల్డ్ కప్ లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం

కెన్యా మాజీ పేసర్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోసం పలుమార్లు వేర్వేరు నంబర్లతో ఉగాండా ఆటగాడిని సంప్రదించడానికి ప్రయత్నించినట్టు తెలిసింది.

టీ20 వరల్డ్ కప్ లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం
X

ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ని కుదిపేసిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వ్యవహారం తాజాగా టీ20 ప్రపంచ కప్‌ వేళ మరోసారి వెలుగు చూసింది. టీ20 ప్రపంచ కప్‌ సూపర్‌–8 దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోసం కెన్యా మాజీ క్రికెటర్‌ ఉగాండా జట్టు ఆటగాడిని సంప్రదించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఉగాండా ఆటగాడు వెంటనే ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి తెలియజేసినట్టు సమాచారం.

టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా గయానాలో ఉగాండా మూడు లీగ్‌ దశ మ్యాచ్‌లు ఆడిన విషయం తెలిసిందే. అప్పుడు కెన్యా మాజీ పేసర్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోసం పలుమార్లు వేర్వేరు నంబర్లతో ఉగాండా ఆటగాడిని సంప్రదించడానికి ప్రయత్నించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని సదరు ప్లేయర్‌ ఐసీసీ అవినీతి నిరోధక బృందం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఫిక్సింగ్‌ కోసం ప్రయత్నించిన వ్యక్తి పెద్ద జట్ల ఆటగాళ్లతో పోలిస్తే అసోసియేట్‌ దేశాల ఆటగాళ్లను వలలో వేసుకోవడం తేలికని భావించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఉగాండా ఆటగాడిని టార్గెట్‌ చేసినట్టు భావిస్తున్నారు. అయితే.. ఉగాండా ఆటగాడు ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లడంతో దీనిపై విచారణ చేపడతామని ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ టీ20 ప్రపంచ కప్‌లో ఉగాండా జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒక దానిలో విజయం సాధించిన విషయం తెలిసిందే.

First Published:  18 Jun 2024 11:58 PM IST
Next Story