Telugu Global
Sports

టెస్టు చరిత్రలో ఇంగ్లండ్ ' అగ్గిపిడుగు' మార్క్ వుడ్ !

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో మరో అరుదైన రికార్డు నమోదయ్యింది. ఈ ఘనతను ఇంగ్లండ్ మెరుపు ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ సాధించాడు.

టెస్టు చరిత్రలో ఇంగ్లండ్  అగ్గిపిడుగు మార్క్ వుడ్ !
X

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో మరో అరుదైన రికార్డు నమోదయ్యింది. ఈ ఘనతను ఇంగ్లండ్ మెరుపు ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ సాధించాడు.

ఐదురోజుల సాంప్రదాయ టెస్టు క్రికెట్ కు..మెరుపు ఫాస్ట్ బౌలర్లకు అవినాభావ సంబంధమే ఉంది. ఫాస్ట్ బౌలర్లు సత్తా చాటుకోడానికి అసలు సిసలు వేదిక టెస్టు క్రికెట్ మాత్రమే.

ఐదురోజులపాటు..రోజుకు 90 ఓవర్ల చొప్పున ..నాలుగు ఇన్నింగ్స్ గా సాగే టెస్టు క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లు గంటలు, రోజుల తరబడి బౌల్ చేయటం అంతతేలిక కాదు.

దశాబ్దాల చరిత్ర కలిగిన టెస్టు క్రికెట్లో మనకు కరీబియన్, కంగారూ, ఇంగ్లీష్, పాకిస్థానీ, కివీ ఫాస్ట్ బౌలర్లు ఎందరెందరో కనిపిస్తారు. గంటకు 150 కిలోమీటర్లకు మించిన వేగంతో నిప్పులు చెరగడం ద్వారా బ్యాటర్ల వెన్నులో ఒణుకు పుట్టించిన ఫాస్ట్ బౌలర్లు ఎందరో ఉన్నారు.

మార్క్ వుడ్ ..సరికొత్త మార్క్....

టెస్టు క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లు సగటున గంటకు 145 కిలోమీటర్ల వేగంతోనే బంతులు విసురుతూ ఉంటారు. అదికూడా కొత్తబంతితోనే. అడపాదడపా ఒకటో లేదా రెండో బంతులు మాత్రమే 150 కిలోమీటర్లను ( గంటకు 90 మైళ్లకు పైగా ) మించిన వేగంతో విసురుతూ ఉంటారు. అయితే..ఒక ఓవర్ ఆరుబంతులూ గంటకు 150 కిలోమీటర్ల వేగాన్ని మించిన రికార్డును ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ నమోదు చేశాడు.

ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండోటెస్టు రెండోరోజుఆటలో మార్క్ వుడ్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్ బ్యాటింగ్ కు దిగిన సమయంలో తన తొలి ఓవర్ తొలిబంతినే గంటకు 93.9 మైళ్ల ( 151.1 కిలోమీటర్ల ) వేగంతో విసిరాడు. వెస్టిండీస్ ఓపెనర్ మికిల్ లూయి పైన అగ్గిపిడుగు లాంటి ఈ బంతిని సంధించాడు.

ఆదే ఓవర్లో ఆ తరువాతి బంతుల్ని 96.1 మైళ్లు ( 154.65 కిలోమీటర్లు ), 95.2 ( 152.88 కిలోమీటర్లు ), 92.2 మైళ్లు ( 148.06 కిలోమీటర్లు ), 96.5 మైళ్లు ( 155.30 కిలోమీటర్లు ), 95.2 మైళ్లు ( 152.88 ), 92.2 మైళ్లు ( 148.06 కిలోమీటర్లు ) వేగంతో విసిరాడు.

ఓవర్ ఆఖరి రెండు బంతుల్ని 95.5 మైళ్లు ( 155.30 ), 95.2 మైళ్లు ( 153.20 కిలోమీటర్లు ) వేగంతో వేయడం ద్వారా..టెస్టు చరిత్రలోనే అత్యంత వేగంతో నమోదైన ఓవర్ ను ముగించగలిగాడు.

టెస్టు చరిత్రలో ఓ ఫాస్ట్ బౌలర్ ఇంత నిలకడగా..ఒకే వేగంతో అగ్నిగోళాల లాంటి బంతుల్ని వేయడం ఇదే మొదటిసారి. ఆ ఘనత ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ కే దక్కుతుంది.

రెండో ఓవర్లో సైతం వుడ్ అదే వేగం కొనసాగించగలిగాడు. గంటకు 95 మైళ్ల సగటు ( గంటకు 150 కిలోమీటర్లకు పైగా ) వేగం సాధించగలిగాడు.

యాషెస్ సిరీస్ లోనూ అదేజోరు...

గతేడాది చిరకాల ప్రత్యర్థి ఆస్ట్ర్రేలియాతో హెడింగ్లే వేదికగా జరిగిన 3వ టెస్టులో సైతం 34 సంవత్సరాల వుడ్..91, 93, 95, 93, 94, 93 మైళ్ల వేగంతో ఓ ఓవర్ ను పూర్తి చేసి 3 వికెట్లు పడగొట్టడం విశేషం.

ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో మైకేల్ స్టిచ్, షాహీన్ అఫ్రిదీ, మాట్ హెన్రీ, ఎన్రిచ్ నోర్గే, జస్ ప్రీత్ బుమ్రా, నసీమ్ షా లాంటి ఎందరో గొప్పగొప్ప ఫాస్ట్ బౌలర్లున్నా..మార్క్ వుడ్ నిలకడగా రాణించడం ద్వారా తనకుతానే సాటిగా నిలువగలిగాడు.

క్రికెట్ మూడు ఫార్మాట్ల( టీ-20, వన్డే క్రికెట్, టెస్టు క్రికెట్) లోనూ అత్యంత వేగంగా బంతులు విసిరిన ఏకైక, ఒకే ఒక్క ఫాస్ట్ బౌలర్ గా మార్క్ వుడ్ నిలిచాడు.

First Published:  20 July 2024 12:15 PM GMT
Next Story