మా తప్పిదం వల్లే ఇంగ్లాండ్‌కు ప్రపంచకప్.. అంపైర్ ఎరాస్మస్ సంచలన వ్యాఖ్యలు
ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలవడానికి చివరి ఓవర్లో 15 పరుగులు కావాలి. కానీ 14 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది.
క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్‌కు వరల్డ్‌కప్ ఎప్పుడూ అందని ద్రాక్షే. అలాంటిది 2019లో అత్యంత నాటకీయంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఎట్టకేలకు ఇంగ్లిష్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ నిర్వహించారు. అక్కడా ఇరు జట్లూ సమానంగా పరుగులు చేయడంతో బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లాండ్‌ను వరల్డ్ ఛాంపియన్‌గా ప్రకటించారు. అయితే ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలుపు తమ తప్పిదమేనంటూ ఫైనల్ మ్యాచ్ ఫీల్డ్ అంపైర్లలో ఒకరయిన మారిస్ ఎరాస్మస్ రిటైర్మెంట్ అనంతరం తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రకటించడం సంచలనంగా మారింది.
అది సిక్స్ కాదు.. 5 పరుగులే
ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలవడానికి చివరి ఓవర్లో 15 పరుగులు కావాలి. కానీ 14 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. అయితే ఆ ఓవర్లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ బెన్‌స్టోక్స్, అదిల్ రషీద్ రెండో రన్‌కు ప్రయత్నిస్తున్నప్పుడు న్యూజిలాండ్ ఆటగాడు గప్తిల్ విసిరిన త్రో స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ దాటేసింది. దీంతో ఆ రెండు రన్స్, బౌండరీ దాటినందుకు ఓవర్‌త్రో నాలుగు పరుగులతో కలిపి సిక్స్‌గా ప్రకటించామని, అయితే అక్కడ ఇవ్వాల్సింది 5 పరుగులేనని ఆ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన ఎరాస్మస్ తాజాగా ప్రకటించారు. ఎందుకంటే త్రో స్టోక్స్ బ్యాట్‌ను తాకేసరికి వారు రెండో రన్ పూర్తి చేయలేదు కాబట్టి ఒక్క రన్‌నే లెక్కించాలని, అప్పుడు మొత్తం 5 పరుగులే ఇవ్వాల్సి ఉందని ఎరాస్మస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అదే జరిగి ఉంటే ఒక్క రన్ తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయేది, న్యూజిలాండ్ విశ్వవిజేత అయ్యేది.
ధర్మసేన చెప్పాడు కానీ అప్పటికే అంతాఅయిపోయింది
ఫైనల్ మ్యాచ్‌లో నాతోపాటు ఫీల్డ్ అంపైర్‌గా ఉన్న కుమార ధర్మసేన తర్వాత రోజు నా హోటల్ రూమ్‌కు వచ్చి మనం ఈ తప్పు చేశాం. నువ్వూ గుర్తించలేదా అన్నాడు.. దాంతో నేను షాకయ్యాను. ఎందుకంటే మేమిద్దరం ఆ రోజు గ్రౌండ్‌లో దాన్ని గుర్తించి ఉంటే 2019 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని ఎరాస్మస్ అంగీకరించాడు.