పారిస్ ఒలింపిక్స్ మహిళల షూటింగ్ ఫైనల్లో మను బాకర్!
2024- ఒలింపిక్స్ తొలిరోజు పోటీలలో భారత అథ్లెట్లు వివిధ క్రీడల్లో శుభారంభం చేశారు. మహిళల పిస్టల్ షూటింగ్ మెడల్ రౌండ్ కు మను బాకర్ అర్హత సంపాదించింది.
2024- ఒలింపిక్స్ తొలిరోజు పోటీలలో భారత అథ్లెట్లు వివిధ క్రీడల్లో శుభారంభం చేశారు. మహిళల పిస్టల్ షూటింగ్ మెడల్ రౌండ్ కు మను బాకర్ అర్హత సంపాదించింది.
పారిస్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన 2024 ఒలింపిక్స్ క్రీడల తొలిరోజున భారత అథ్లెట్లు పలు రకాల క్రీడల్లో తొలి విజయాలతో శుభారంభం చేశారు. షూటింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, హాకీ క్రీడల్లో భారత అథ్లెట్లు, జట్లు రాణించాయి.
మెడల్ రౌండ్లో మను బాకర్.....
మహిళల పిస్టల్ 10 మీటర్ల షూటింగ్ ఫైనల్స్ కు భారత ఆశాకిరణం మను బాకర్ అలవోకగా చేరుకొంది. పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ వేదికలో జరిగిన పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మను బాకర్ స్థాయికి తగ్గట్టుగా రాణించడం ద్వారా మొదటి 10 మంది అత్యుత్తమ షూటర్లలో నిలవడం ద్వారా ఫైనల్స్ చేరుకోగలిగింది.
గత ఒలింపిక్స్ లో దారుణంగా విఫలమైన మను ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో మాత్రం అత్యుత్తమంగా రాణించింది. మొత్తం 10 మంది షూటర్లపోరులో మను ఏదో ఒక పతకం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
10 మీటర్ల వ్యక్తిగత విభాగం ఫైనల్స్ లో మొత్తం మూడు పతకాల కోసం 10 మంది షూటర్లు తలపడనున్నారు.
క్వాలిఫైయింగ్ రౌండ్ పోటీలలో 22 సంవత్సరాల మను 580 పాయింట్లు సాధించడం ద్వారా మూడో అత్యుత్తమ షూటర్ గా ఫైనల్స్ లో చోటు ఖాయం చేసుకొంది. హంగెరీ షూటర్ వెరోనియా 582 పాయింట్లతో టాపర్ గా నిలిచింది. ఇదే విభాగంలో పోటీకి దిగిన మరో భారత షూటర్ రిథిమా సంగ్వాన్ 573 పాయింట్లతో 15వ స్థానం సాధించడం ద్వారా ఫైనల్లో చోటు దక్కించుకోలేకపోయింది.
ప్రీతి పవార్ పతకం వేట...
బాక్సింగ్ మహిళల విభాగంలో భారత యువబాక్సర్ ప్రీతి పవార్ తొలిగెలుపుతో ప్రీ-క్వార్టర్ ఫైనల్ రౌండ్లో అడుగుపెట్టింది. వివిధ దేశాలకు చెందిన 32 మంది బాక్సర్లు తలపడిన తొలిరౌండ్ పోటీలలో 16 మంది విజేతలుగా ఆఖరి 16 మంది బాక్సర్లలో చోటు సంపాదించారు.
బ్యాడ్మింటన్లో తొలివిజయాలు..
బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్, డబుల్స్ లో భారత క్రీడాకారులు తొలివిజయాలు నమోదు చేశారు. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో యువఆటగాడు లక్ష్యసేన్ వరుస గేమ్ ల విజయం సాధించాడు.
పురుషుల డబుల్స్ విభాగంలో హాట్ ఫేవరెట్ జోడీగా ఉన్న సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి తొలిరౌండ్ ను అలవోకగా అధిగమించి..ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ రౌండ్లో అడుగుపెట్టారు.
మూడోసీడ్ గా ఒలింపిక్స్ లో తొలిసారి పాల్గొంటున్న సాత్విక్- చిరాగ్ గ్రూప్- సీ తొలిరౌండ్ మ్యాచ్ లో ఫ్రెంచ్ జోడీ లూకాస్- రోనాన్ లను కేవలం 45 నిముషాలలోనే 21-17, 21-14 తో చిత్తు చేయడం ద్వారా తొలి విజయం సాధించారు.
సోమవారం జరిగే గ్రూపు రెండోరౌండ్ పోరులో జర్మన్ జోడీ మార్క్- మార్విన్ లతో తలపడనున్నారు.
పురుషుల సింగిల్స్ గ్రూపు తొలిరౌండ్ పోరులో 22 ఏళ్ళ లక్ష్యసేన్ 21-8, 22-20తో గ్వాతెమాలా ఆటగాడు కెవిన్ కార్డాన్ ను ఓడించాడు. రెండోరౌండ్లో బెల్జియం ఆటగాడు జూలియన్ క్రాగ్గీతో లక్ష్య తలపడనున్నాడు.
ఆఖరినిముషం గోలుతో భారత్ బోణీ...
ఒలింపిక్స్ హాకీ పురుషుల పూల్ -బీ తొలిమ్యాచ్ లో గత క్రీడల కాంస్యవిజేత భారత్ ఆఖరి నిముషం గోలుతో న్యూజిలాండ్ ను అధిగమించగలిగింది. నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో ఆధిక్యత తరచూ రెండుజట్ల చేతులు మారుతూ వచ్చింది.
ఆట మరో నిముషంలో ముగుస్తుందనగా రెండుజట్లు 2-2తో సమఉజ్జీగా నిలిచాయి. అయితే..ఆట ఆఖరి నిముషంలో భారత్ కు లభించిన పెనాల్టీకార్నర్ ను కెప్టెన్ హర్మన్ ప్రీత్ గోలుగా మలచడం ద్వారా కీలక విజయం అందించాడు. భారత్ 3-2 గోల్స్ తో తొలిరౌండ్ విజయాన్ని సొంతం చేసుకొంది.
ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో భారత్ తరపున ఆట 24వ నిముషంలో మన్ దీప్ సింగ్, 34వ నిముషంలో వివేక్ సాగర్ ప్రసాద్, 81వ నిముషంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ తలో గోలు సాధించారు.
న్యూజిలాండ్ తరపున ఆట 8వ నిముషంలోనే సామ్ లానే, 53వ నిముషంలో సిమోన్ చిల్డ్ చెరో గోలు సాధించారు. న్యూజిలాండ్ తన రెండు గోల్స్ ను పెనాల్టీ కార్నర్ ల ద్వారానే సాధించింది.
భారత్ కు మొత్తం ఐదు పెనాల్టీ కార్నర్ లు లభించగా పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఐదింట ఒక్క పెనాల్టీ కార్నర్ మాత్రమే గోలుగా మలచుకోగలిగింది. పూల్-బీలో భాగంగా సోమవారం జరిగే రెండోరౌండ్ పోటీలో పవర్ ఫుల్ అర్జెంటీనాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం, ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్ర్రేలియాజట్లు సైతం భారత గ్రూపులోనే ప్రధానజట్లుగా ఉన్నాయి.