Telugu Global
Sports

పారిస్ ఒలింపిక్స్... తెలుగుజోడీకి అరుదైన గౌరవం!

తెలుగు దిగ్గజ ఒలింపియన్లు శరత్ కమల్, పీవీ సింధులకు అరుదైన గౌరవం దక్కింది. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి సంయుక్త పతాకధారులుగా వ్యవహరించనున్నారు.

పారిస్ ఒలింపిక్స్... తెలుగుజోడీకి అరుదైన గౌరవం!
X

తెలుగు దిగ్గజ ఒలింపియన్లు శరత్ కమల్, పీవీ సింధులకు అరుదైన గౌరవం దక్కింది. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి సంయుక్త పతాకధారులుగా వ్యవహరించనున్నారు.

మరికొద్దిరోజుల్లో పారిస్ వేదికగా ప్రారంభంకానున్న 2024 ఒలింపిక్స్ లో పాల్గొనే భారత బృందం వివరాలను జాతీయ ఒలింపిక్స్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష అధికారికంగా ప్రకటించారు.

జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకూ జరిగే ఈ క్రీడాసంరంభంలో 125మందికి పైగా అథ్లెట్ల బృందంతో భారత్ పాల్గోనుంది.

చెఫ్-డి-మిషన్ గా గగన్ నారంగ్...

ఒలింపిక్స్ లో పాల్గొనే భారత బృందానికి పెద్దదిక్కుగా మాజీ ఒలింపియన్, ఏపీ షూటర్ గగన్ నారంగ్ వ్యవహరించనున్నారు. భారత చెఫ్ -డి- మిషన్ గా గతంలోనే మేరీ కోమ్ ను జాతీయ ఒలింపిక్స్ సంఘం ఎంపిక చేసింది. అయితే..వ్యక్తిగత కారణాలతో ఆ బాధ్యత నుంచి మేరీ కోమ్ తప్పుకోడంతో ఒలింపిక్స్ పతక విజేత, హైదరాబాదీ మాజీషూటర్ గగన్ నారంగ్ పేరును ఖరారు చేశారు.

మూడువారాలపాటు సాగే ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ల బాగోగులను చెఫ్- డి- మిషన్ హోదాలో గగన్ నారంగ్ చూసుకోనున్నారు.

సంయుక్త పతాకధారులుగా శరత్- సింధు...

పారిస్ ఒలింపిక్స్ ప్రధాన స్టేడియం వేదికగా జరిగే క్రీడల ప్రారంభ వేడుకల్లో పాల్గొనే భారత బృందానికి సంయుక్త పతాకధారులుగా తెలుగుతేజాలు పీవీ సింధు, ఆచంట శరత్ కమల్ వ్యవహరించనున్నారు.

రెండుసార్లు ఒలింపిక్స్ మెడలిస్ట్ పీవీ సింధు, తన కెరియర్ లో ఆరవసారి ఒలింపిక్స్ లో పాల్గొన బోతున్న వెటరన్ టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్ ల పేర్లను ఫ్లాగ్ బేరర్లుగా ఎంపిక చేసినట్లు భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది.

టోక్యో వేదికగా జరిగిన గత ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో బాక్సర్ మేరీకోమ్, హాకీ కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ భారత బృందం పతాకధారులుగా వ్యవహరించారు. అదే సాంప్రదాయాన్ని ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో సైతం కొనసాగిస్తున్నారు.

భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధుకు ఒలింపిక్స్ లో ఇప్పటికే రెండు పతకాలు సాధించిన ఘనత ఉంది. 2016 రియో ఒలింపిక్స్ లో రజత, 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకాలు సాధించిన సింధు కెరియర్ లో సైతం ఇవే ఆఖరి ఒలింపిక్స్ కానున్నాయి.

41 సంవత్సరాల వయసులో....

ఒలింపిక్స్ లో భారత వందేళ్ల చరిత్రలో అతిపెద్ద వయసున్న పతాకధారిగా ఆచంట శరత్ కమల్ రికార్డుల్లో చేరనున్నాడు. 2004 ఏధెన్స్ ఒలింపిక్స్ లో తొలిసారిగా పాల్గొన్న శరత్ 2008, 2012, 2016, 2020 ఒలింపిక్స్ లో పాల్గొంటూ వచ్చాడు. తన క్రీడాజీవితంలో చివరిసారిగా, ఆరవ ఒలింపిక్స్ బరిలో నిలవడం ద్వారా మరో అరుదైన ఘనత సాధించాడు.

ప్రపంచ టేబుల్ టెన్నిస్ లో గత రెండుదశాబ్దాలుగా భారత పతాకాన్ని రెపరెపలాడిస్తున్న శరత్ కమల్ పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించినా వృత్తిరీత్యా చెన్నైలో స్థిరనివాసం ఏర్పరచుకొన్నాడు.

భారత టేబుల్ టెన్నిస్ జట్టుకు పెద్దదిక్కుగా ఉంటూ వస్తున్న శరత్ కమల్ కు ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ లో డజనుకు పైగా పతకాలు సాధించిన రికార్డు ఉంది.

ప్రపంచ టేబుల్ టెన్నిస్ పురుషుల టీమ్ విభాగంలో భారతజట్టు తొలిసారిగా 9వ ర్యాంకులో నిలవడంతో పాటు పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడంలోనూ శరత్ కమల్ తనవంతు పాత్ర నిర్వర్తించాడు.

అయితే..ఒలింపిక్స్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రాను కాదని శరత్ కమల్ ను పతాకధారిగా ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది.

నీరజ్ ను కాదని శరత్ కే ఎందుకు?

ఒలింపిక్స్ చరిత్రలో భారత్ కు అథ్లెటిక్స్ వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం అందించిన ఏకైక అథ్లెట్ నీరజ్ చోప్రాను కాదని..వెటరన్ శరత్ కమల్ కు పతాకధారిగా అవకాశం ఇవ్వడం వివాదానికి దారితీసింది.

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు కచ్చితంగా బంగారు పతకం సాధించి పెట్టగల నీరజ్ చోప్రాకు పతాకధారిగా అవకాశం ఎందుకు ఇవ్వలేదంటూ భారత ఒలింపిక్ సంఘాన్ని తమిళనాడు అథ్లెటిక్స్ సంఘం నిలదీసింది. ఆగమేఘాల మీద ఫ్లాగ్ బేరర్ గా శరత్ కమల్ పేరును ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నించారు.

శరత్ కమల్ ను తక్కువ చేస్తూ ఓ లేఖ పంపిన తమిళనాడు అథ్లెటిక్స్ సంఘం తీరును భారత మాజీ ఒలింపియన్ వీరేన్ రస్కినా తప్పు పట్టారు. నీరజ్ చోప్రాకు పతాకధారిగా అవకాశం ఇవ్వలేదని శరత్ కమల్ ను అగౌరవంగా మాట్లాడటం సబబుగా లేదంటూ వీరేన్ మండి పడ్డారు. తమిళనాడు అథ్లెటిక్స్ సంఘం పదాలను జాగ్రత్తగా వాడటం నేర్చుకోవాలని చురక అంటించారు.

భారత్ కు ఎనలేని గుర్తింపు తెచ్చిన శరత్ కమల్ ను చిన్నచూపు చూడటం, తక్కువ చేసి మాట్లాడటం దేశానికి గౌరవం కాదని చెప్పారు.

అన్నిఅంశాలు దృష్టిలో ఉంచుకొనే......

ఒలింపిక్స్ లో వరుసగా రెండోసారి బంగారు పతకం సాధించాలన్న పట్టుదలతో శిక్షణ పొందుతున్న నీరజ్ చోప్రా సాధనకు భంగం కలిగించరాదన్న కారణంగానే శరత్ కమల్ ను ఫ్లాగ్ బేరర్ గా ఎంపిక చేసినట్లు భారత ఒలింపిక్స్ సంఘ వర్గాలు చెబుతున్నాయి.

స్విట్జర్లాండ్ లోని ఓ శిక్షణ శిబిరంలో సాధన చేస్తున్న నీరజ్ చోప్రా.. జులై 26న జరిగే ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల కోసం జులై 25నే పారిస్ కు రావాల్సి ఉంటుందని, ప్రారంభ వేడుకలు ముగిసిన వెంటనే వేరే దేశంలోని తన శిబిరానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుందని, నీరజ్ శిక్షణకు అంతరాయం కలిగించరాదనే ఫ్లాగ్ బేరర్ బాధ్యతని అప్పగించలేదని వివరణ ఇచ్చారు.

ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు జూలై 26న నిర్వహిస్తే...నీరజ్ చోప్రా పతకం వేట మాత్రం ఆగస్టు 6న ప్రారంభంకానుంది. ఒలింపిక్స్ కు మూడోసారి ఆతిథ్యమిస్తున్న పారిస్ నగరం..ప్రస్తుత క్రీడల ప్రారంభ వేడుకలను వినూత్నంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. 204దేశాలకు చెందిన బృందాలు ప్రారంభవేడుకల కవాతులో పాల్గోనున్నాయి.

First Published:  9 July 2024 4:02 PM IST
Next Story