Telugu Global
Sports

భారత షట్లర్లకు ఆఖరి చాన్స్...నేటినుంచే ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీ!

చైనా వేదికగా ప్రారంభంకానున్న 2024 ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీ భారత స్టార్ షట్లర్ల సత్తాకు పరీక్షకానుంది. పారిస్ ఒలింపిక్స్ బెర్త్ లు ఖాయం చేసుకోవాలంటే ఆసియా టోర్నీలో అత్యుత్తమంగా రాణించితీరక తప్పని పరిస్థితి నెలకొంది.

భారత షట్లర్లకు ఆఖరి చాన్స్...నేటినుంచే ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీ!
X

చైనా వేదికగా ప్రారంభంకానున్న 2024 ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీ భారత స్టార్ షట్లర్ల సత్తాకు పరీక్షకానుంది. పారిస్ ఒలింపిక్స్ బెర్త్ లు ఖాయం చేసుకోవాలంటే ఆసియా టోర్నీలో అత్యుత్తమంగా రాణించితీరక తప్పని పరిస్థితి నెలకొంది.

2024-ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ కు చైనాలోని నింగ్బో వేదికగా రంగం సిద్ధమయ్యింది. మరికొద్దివారాలలో పారిస్ వేదికగా ప్రారంభంకానున్న ఒలింపిక్స్ కు అర్హత సాధించాలంటే..ప్రస్తుత ఆసియా టోర్నీ పీవీ సింధు, ప్రణయ్ లతో సహా పలువురు భారత స్టార్లకు ఆఖరి అవకాశంగా ఉంది.

టోర్నీకి భారత స్టార్ జోడీ దూరం...

ఆసియా బ్యాడ్మింటన్లో అగ్రశ్రేణి దేశాలుగా పేరుపొందిన చైనా, జపాన్, కొరియా, ఇండోనీసియా, హాంకాంగ్, థాయ్ లాండ్, మలేసియాలతో పాటు భారత్ సైతం..మొత్తం ఐదు ( పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ ) విభాగాలలో పోటీకి దిగుతోంది.

పారిస్ ఒలింపిక్స్ కు అర్హత గా ఆసియా దేశాల క్రీడాకారులు..ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీనే ఆఖరి అవకాశంగా భావిస్తున్నారు. ఈనెల 30న ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించే ర్యాంకింగ్స్ ఆధారంగానే పురుషుల, మహిళల విభాగాలలో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన క్రీడాకారులెవ్వరో తేలిపోనుంది.

పురుషుల డబుల్స్ లో ప్రపంచ నంబర్ వన్ జోడీగా ఉన్న సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి ఇప్పటికే ఒలింపిక్స్ కు అర్హత సాధించిన కారణంగా ఆసియాటోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించారు. 2023 ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతలుగా నిలిచిన సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ జోడీ ప్రస్తుత 2024 టోర్నీకి దూరం కావడం కేవలం వ్యూహాత్మక నిర్ణయం మాత్రమే.

పురుషుల డబుల్స్ లో మరో ఒలింపిక్ బెర్త్ కోసం అర్జున్- ధృవ్ కపిల జోడీ పోటీకి దిగుతున్నారు.

సింధుకు అంతతేలిక కాదు....

ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో ప్రపంచ మాజీ చాంపియన్ సింధు జోరు బాగా తగ్గిందనే చెప్పాలి. గత రెండేళ్లుగా సింధు ఎదుర్కొంటున్న వైఫల్యాలు అన్నీఇన్నీకావు. పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడం సింధుకు ఏమంత కష్టం కాకున్నా..ఆసియాటోర్నీలో రాణించడం అంతతేలిక కాబోదు.

2004 తరువాత పురుషుల సింగిల్స్ లో రెండు బెర్త్ ల కోసం భారత స్టార్ ప్లేయర్లు ప్రణయ్, లక్ష్యసేన్ పోటీపడుతున్నారు. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం 8వ స్థానంలో ఉన్న ప్రణయ్ కు ఒలింపిక్స్ బెర్త్ దాదాపుగా ఖాయమైనా..లక్ష్యసేన్ మాత్రం తన బెర్త్ కోసం గట్టిగా ప్రయత్నించాల్సిందే. ప్రపంచ 27వ ర్యాంకర్ కిడాంబీ శ్రీకాంత్ సైతం ఒలింపిక్స్ బెర్త్ ఆశలతోనే ఆసియాటోర్నీ బరిలోకి దిగుతున్నాడు.

మహిళల డబుల్స్ బెర్త్ ల కోసం అశ్వనీ పొన్నప్ప- తనీషా క్రాస్టోజోడీతో పాటు..ట్రీసా జోలీ- గాయత్రీ గోపీచంద్ జంట పోటీకి దిగుతున్నారు. ప్రస్తుత ఆసియాటోర్నీ రెండోరౌండ్లో చైనీస్ తైపీ జంటలు సు య చింగ్- లిన్ వాన్..లీచియా- టెంగ్ చున్ ల నుంచి అసలు సిసలు పరీక్ష ఎదుర్కొనబోతున్నారు.

మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో మలేసియాకు చెందిన 33వ ర్యాంకర్ గో జిన్ వీతో సింధు తలపడనుంది. గో జిన్ ప్రత్యర్థిగా సింధుకు 4-1 విజయాల రికార్డు ఉంది.

రెండోరౌండ్లో చైనాకు చెందిన హాన్ యూతో సింధు పోటీపడాల్సి ఉంది. హాన్ యూ ప్రత్యర్థిగా సింధు 5-0 రికార్డుతో ఉంది.

క్వార్టర్ ఫైనల్ దశలో అకానే యమగుచితో తలపడే అవకాశం లేకపోలేదు.

లక్ష్యసేన్ లక్ష్యం నెరవేరేనా?

పురుషుల సింగిల్స్ లో ప్రణయ్ కు ఒలింపిక్స్ బెర్త్ ఖాయమైనా..లక్ష్యసేన్ మాత్రం టాప్ సీడ్ సీ యు క్వితో తలపడాల్సి ఉంది. ప్రపంచ మాజీ నంబర్ వన్ కిడాంబీ శ్రీకాంత్ 2వ సీడ్ ఆంథోనీ జింటింగ్ తో పోటీపడనున్నాడు. రజావత్ తన తొలిరౌండ్ పోరులో మలేసియాకు చెందిన లీ జి జియాతో తలపడతాడు.

మొత్తం మీద..భారత షట్లర్ల సత్తాకు వచ్చే వారం రోజులపాటు అసలు సిసలు పరీక్షేకానుంది.

First Published:  9 April 2024 2:23 PM IST
Next Story