Telugu Global
Sports

సింధు అవుట్..ఆల్-ఇంగ్లండ్ క్వార్టర్స్ లో లక్ష్యసేన్!

ప్రతిష్టాత్మక ఆల్-ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీలో సింధు వైఫల్యం కొనసాగుతూనే ఉంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు భారత యువఆటగాడు లక్ష్యసేన్ చేరుకొన్నాడు.

సింధు అవుట్..ఆల్-ఇంగ్లండ్ క్వార్టర్స్ లో లక్ష్యసేన్!
X

ప్రతిష్టాత్మక ఆల్-ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీలో సింధు వైఫల్యం కొనసాగుతూనే ఉంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు భారత యువఆటగాడు లక్ష్యసేన్ చేరుకొన్నాడు.

అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో ఎన్ని టోర్నీలు ఉన్నా ..ప్రతిష్టాత్మక ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్ తరువాతే. ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించినా..ఆల్-ఇంగ్లండ్ ఓపెన్లో నెగ్గకుంటే గొప్పగొప్ప బ్యాడ్మింటన్ క్రీడాకారుల జీవితాలలో అదో లోటుగా మిగిలిపోతుంది. అదే పరిస్థితి భారతస్టార్ ప్లేయర్ పీవీ సింధును సైతం వెంటాడుతోంది.

పరాజయాల ఊబిలో...

ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ ను గతంలో ఓ కుదుపు కుదిపిన తెలుగుతేజం పీవీ సింధు ప్రభ గత కొంతకాలంగా మసకబారుతూ వస్తోంది. గత రెండేళ్లుగా ఓవైపు గాయాలు, మరోవైపు వరుస వైఫల్యాలు సింధును కృంగదీస్తున్నాయి. రిటైర్మెంట్ దిశగా నడిచేలా చేస్తున్నాయి.

హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మకాం మార్చినా, గోపిచంద్ ను వీడి ప్రకాశ్ పడుకోన్ చెంతచేరినా, విదేశీ కోచ్ లను తరచూ మార్చుతూ వస్తున్నా సింధు తలరాత ఏమాత్రం మారడం లేదు.టోర్నీ ఏదైనా క్వార్టర్ ఫైనల్స్ కు ముందే నిష్క్ర్రమించడం సింధుకు ఓ బలహీనతగా మారిపోయింది.

ఆల్-ఇంగ్లండ్ ఓపెన్లోనూ అదేసీన్..

తన కెరియర్ లో ప్రపంచ, ఒలింపిక్స్ పతకాలు అలవోకగా సాధించిన సింధుకు ఆల్ -ఇంగ్లండ్ టైటిల్ మాత్రం అందని ద్రాక్షలా మిగిలిపోయింది. ప్రతి ఏడాది బరిలో నిలవడం, ప్రారంభం రౌండ్లలోనే పరాజయం పొందటం సింధు కు అలవాటుగా తయారయ్యింది. ప్రస్తుత 2024 ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీలో సైతం సింధు రెండోరౌండ్లోనే పరాజయం చవిచూసింది.

దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్, 22 సంవత్సరాల అన్ సే యంగ్ వరుస గేమ్ ల్లో సింధును చిత్తు చేసింది. 28 సంవత్సరాల సింధు

19-21, 11-21 ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

తాను చేసిన తప్పులే చేస్తూ పరాజయం కొని తెచ్చుకొన్నానని, కాస్త ఓర్పుతో ఆడి ఉంటే ఫలితంగా వేరేవిధంగా ఉండేదని ఓటమి అనంతరం సింధు వాపోయింది.

యంగ్ చేతిలో వరుసగా 7వ ఓటమి..

అన్ సీ యంగ్ ప్రత్యర్థిగా సింధుకు ఇది వరుసగా 7వ పరాజయం. గతేడాది ఆడిన 17 టోర్నీలలో 11 టైటిల్స్ నెగ్గిన యంగ్ ఇప్పుడు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ గా కొనసాగుతోంది. 2023 ఆసియా చాంపియన్షిప్ నుంచి ప్రస్తుత ఆల్ ఇంగ్లండ్ వరకూ వివిధ టోర్నీలలో యంగ్ ప్రత్యర్థిగా సింధు పోటీపడిన ప్రతిసారీ ఓటమి తప్పలేదు.

ఆల్-ఇంగ్లండ్ టైటిల్ సంగతి అటుంచి..క్వార్టర్ ఫైనల్స్ చేరడమే సింధుకు తలకుమించిన భారంగా మారింది.

లక్ష్యసేన్ సంచలనం...

మరోవైపు పురుషుల సింగిల్స్ లో భారత యువఆటగాడు లక్ష్యసేన్ ప్రపంచ 3వ ర్యాంక్ ఆటగాడు, డెన్మార్క్ స్టార్ ప్లేయర్ యాండెర్స్ ఆంటోన్ సెన్ పై సంచలన విజయం సాధించడం ద్వారా క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సంపాదించాడు.

ప్రపంచ 18వ ర్యాంక్ ప్లేయర్ లక్ష్య మూడుగేమ్ ల హోరాహోరీ పోరులో 24-22, 11-21, 21-14తో విజేతగా నిలిచాడు.2022 ఆల్- ఇంగ్లండ్ టోర్నీ రన్నరప్ గా నిలిచిన లక్ష్య క్వార్టర్ ఫైనల్స్ చేరడం గత మూడేళ్లలో ఇది రెండోసారి. మూడుసార్లు ప్రపంచ బ్యాడ్మింటన్ మెడల్స్ విజేత యాండెర్స్ ను కంగుతినిపించడం ద్వారా తన కెరియర్ లో లక్ష్య మరో అతిపెద్ద విజయం నమోదు చేయగలిగాడు.

మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాలలో భారత్ పోటీ ముగిసింది. అయితే..పురుషుల డబుల్స్ లో మాత్రం సాయిరాజ్- చిరాగ్ జోడీ హాట్ ఫేవరెట్ల హోదాలో టైటిల్ వేట కొనసాగిస్తున్నారు.

ఆల్- ఇంగ్లండ్ చరిత్రలో ప్రకాశ్ పడుకోనే, పుల్లెల గోపీచంద్ మాత్రమే భారత్ తరపున విజేతలుగా నిలువగలిగారు. సైనా నెహ్వాల్ మాత్రమే మహిళల సింగిల్స్ లో రన్నరప్ గా నిలువగిలిగింది.

First Published:  15 March 2024 8:28 AM IST
Next Story