Telugu Global
Sports

ఇటు హైదరాబాద్- అటు కోల్ కతా ..నేడు తొలి క్వాలిఫైయర్ సమరం!

లీగ్ టేబుల్ అగ్రస్థానంలో నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ తో రెండోస్థానం సాధించిన హైదరాబాద్ సన్ రైజర్స్ అహ్మదాబాద్ వేదికగా ఢీ కోనుంది. రాత్రి 7-30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో పరుగులు వెల్లువెత్తే అవకాశం ఉంది.

ఇటు హైదరాబాద్- అటు కోల్ కతా ..నేడు తొలి క్వాలిఫైయర్ సమరం!
X

ఐపీఎల్-17వ సీజన్ క్వాలిఫైయర్ రౌండ్ తొలి సమరానికి లీగ్ టేబుల్ టాపర్ కోల్ కతా, రెండోస్థానంలో నిలిచిన హైదరాబాద్ సై అంటే సై అంటున్నా. ఈ మ్యాచ్ లో నెగ్గినజట్టు నేరుగా ఫైనల్స్ చేరుకోగలుగుతుంది.

ఐపీఎల్-2024 తొలిదశ 70 మ్యాచ్ ల రౌండ్ రాబిన్ లీగ్ సమరం ముగియడంతో మూడుమ్యాచ్ ల క్వాలిఫైయర్ రౌండ్ పోరుకు రంగం సిద్ధమయ్యింది.

లీగ్ టేబుల్ అగ్రస్థానంలో నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ తో రెండోస్థానం సాధించిన హైదరాబాద్ సన్ రైజర్స్ అహ్మదాబాద్ వేదికగా ఢీ కోనుంది. రాత్రి 7-30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో పరుగులు వెల్లువెత్తే అవకాశం ఉంది.

నెగ్గినజట్టుకు నేరుగా ఫైనల్స్ బెర్త్....

శ్రేయస్ అయ్య్రర్ నాయకత్వంలోని కోల్ కతా, పాట్ కమిన్స్ కెప్టెన్సీలోని హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల జరిగే ఈ క్వాలిఫైయర్ -1 పోరులో నెగ్గినజట్టు నేరుగా ఫైనల్ చేరుకోగలుగుతుంది. ఓడిన జట్టుకు క్వాలిఫైయర్స్ -2 మ్యాచ్ ద్వారా ఫైనల్స్ చేరుకోడానికి మరో అవకాశం ఉంటుంది.

14 మ్యాచ్ ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో కోల్ కతా, హైదరాబాద్ తమదైన శైలిలో రికార్డులు, విజయాలు సాధిస్తూ లీగ్ టేబుల్ మొదటి రెండుస్థానాలలో నిలవడం ద్వారా సత్తా చాటుకొన్నాయి. అయితే...లీగ్ దశలో కనబరచిన ప్రతిభ ఒక ఎత్తయితే...క్వాలిఫైయర్ రౌండ్లో స్థాయికి తగ్గట్టుగా రాణించడం మరో ఎత్తు కానుంది. గత 17 సీజన్ల చరిత్రలో తొలిసారిగా లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచిన కోల్ కతా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో పోటీకి దిగుతుంటే..మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ సైతం అదే జోష్ తో పోరుకు సిద్ధమయ్యింది.

కోల్ కతా బ్యాటింగ్ కు హైదరాబాద్ బౌలింగ్ సవాల్!

సమానబలం కలిగిన రెండుజట్లు తలపడితే మ్యాచ్ ఎంత రంజుగా ఉంటుందో..కోల్ కతా- హైదరాబాద్ జట్ల పోరు సైతం అంతే పట్టుగా సాగనుంది. బ్యాటింగ్ విభాగంలో రెండుజట్లు సమఉజ్జీలుగా ఉన్నా..బౌలింగ్ లో మాత్రం కోల్ కతా కంటే హైదరాబాద్ జట్టే మెరుగ్గా ఉంది.

నిప్పుల కుంపటిలా మారిన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే ఈ పోరులో పేస్ బౌలర్ల హవా కొనసాగనుంది. బ్యాటర్లు సైతం చెలరేగిపోయే అవకాశం ఉంది.

250కి పైగా స్కోర్లు నమోదైనా ఆశ్చర్యపోనక్కరలేదని అహ్మదాబాద్ స్టేడియం క్యూరేటర్ చెబుతున్నారు.

సునీల్ నరైన్ కు డకౌట్ల టెన్షన్....

ప్రస్తుత సీజన్లో పించ్ హిట్టింగ్ ఓపెనర్ గా పరుగుల మోత మోగించిన స్పిన్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ కు అహ్మదాబాద్ వేదికగా ఆడిన మూడుకు మూడుమ్యాచ్ ల్లోనూ డకౌట్లయిన రికార్డు ఉంది. దీంతో ఈ కీలక బ్యాటర్ తీవ్రఒత్తిడి నడుమ బ్యాటింగ్ కు దిగనున్నాడు.

అయితే..సునీల్ ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. 500 పరుగులు, 15 వికెట్ల రికార్డును ఈ మ్యాచ్ లో సునీల్ పూర్తి చేసే అవకాశాలు లేకపోలేదు. డాషింగ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ అందుబాటులో లేకపోడంతో..రహమానుల్లా గుర్బాజ్ కోల్ కతా ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది.

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, వీరబాదుడు యాండ్రీ రస్సెల్ సైతం కోల్ కతా బ్యాటింగ్ కు కీలకంకానున్నారు.

పేస్ బౌలింగే అస్త్రంగా సన్ రైజర్స్...

మాజీ చాంపియన్ సన్ రైజర్స్..పేస్ బౌలింగే ప్రధాన ఆయుధంగా పోరుకు సిద్ధమయ్యింది. కోల్ కతా స్పిన్ బౌలింగ్ జోడీ వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ లను అస్త్ర్రాలుగా ప్రయోగిస్తుంటే..సన్ రైజర్స్ ఐదుగురు పేసర్లతో ప్రత్యర్థిజట్లను నిలువరిస్తూ వస్తోంది. కోల్ కతా జట్టులో మిషెల్ స్టార్క్, రస్సెల్ మాత్రమే పేసర్లుగా ఉన్నారు.

కెప్టెన్ యాండీ కమిన్స్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్ లతో పాటు మార్కో జెన్సన్ లతో కూడిన పేస్ ఎటాక్ సన్ రైజర్స్ కు ఆయువుపట్టుగా ఉంది.

అహ్మదాబాద్ పిచ్ పేసర్లకు అనువుగా ఉండడంతో కోల్ కతాకు కష్టాలు తప్పవు.

ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇచ్చే మెరుపు ఆరంభంపైనే సన్ రైజర్స్ జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. లీగ్ దశలో రెండుసార్లు 270కి పైగా స్కోర్లు సాధించిన రికార్డు సన్ రైజర్స్ కు ఉంది.

కోల్ కతా 17- హైదరాబాద్ 9

ఈ రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డు చూస్తే కోల్ కతాదే పైచేయిగా ఉంది. హైదరాబాద్ ప్రత్యర్థిగా కోల్ కతా 17సార్లు నెగ్గితే..కోల్ కతాపై హైదరాబాద్ కు 9 విజయాలు మాత్రమే ఉన్నాయి.

ప్లే-ఆఫ్ రౌండ్లలో కోల్ కతా 8 విజయాలు, 5 పరాజయాల రికార్డుతోనూ, హైదరాబాద్ 5 విజయాలు, 6 పరాజయాల రికార్డుతోను ఉన్నాయి.

ఈ పోరులో టాస్ నెగ్గినజట్టు చేజింగ్ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టు 250కి పైగా స్కోరు సాధించినా విజయానికి గ్యారెంటీ లేకపోడం విశేషం. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్ చేరితో..ఓడిన జట్టుకు మరో అవకాశం ఉండడంతో రెండుజట్లూ ఎలాంటి ఒత్తిడి లేకుండా పోటీకి దిగనున్నాయి.

రాత్రి 7-30కి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కు లక్షమందికి పైగా అభిమానులు హాజరు కానున్నారు. నిప్పులు చెరిగే ఎండవేడిమితో పూర్తిగా పొడిబారిన అహ్మదాబాద్ పిచ్ పై రెండుజట్ల బ్యాటర్లూ పరుగుల సునామీ సృష్టించగలరనడంలో ఏమాత్రం సందేహంలేదు.

First Published:  21 May 2024 8:57 AM GMT
Next Story