Telugu Global
Sports

చెపాక్ లో నేడే ఐపీఎల్ ఫైనల్స్ షో!

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7-30కి ప్రారంభమయ్యే ఈ సూపర్ సండే ఫైట్ లో మాజీ చాంపియన్లు కోల్ కతా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ ఢీ అంటే ఢీ అంటున్నాయి.

చెపాక్ లో నేడే ఐపీఎల్ ఫైనల్స్ షో!
X

ఐపీఎల్ -17వ సీజన్ టైటిల్ సమరానికి చెన్నై చెపాక్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. లీగ్ టేబుల్ మొదటి రెండుస్థానాలలో నిలిచిన కోల్ కతా, హైదరాబాద్ అమీతుమీకి సిద్ధమయ్యాయి.

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను గత ఆరువారాలుగా ఓలలాడిస్తూ వచ్చిన ఐపీఎల్ -17వ సీజన్ టైటిల్ పోరుకు రంగం సిద్ధమయ్యింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7-30కి ప్రారంభమయ్యే ఈ సూపర్ సండే ఫైట్ లో మాజీ చాంపియన్లు కోల్ కతా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ ఢీ అంటే ఢీ అంటున్నాయి.

రెండు అత్యుత్తమ జట్ల నడుమ....

70 మ్యాచ్ ల తొలిదశ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటి రెండుస్థానాలలో నిలిచిన జట్ల నడుమే టైటిల్ సమరం సైతం జరుగనుంది. తొలి క్వాలిఫైయర్స్ లో సన్ రైజర్స్ ను 8 వికెట్లతో చిత్తు చేయడం ద్వారా కోల్ కతా ఫైనల్స్ చేరితే..రెండో క్వాలిఫైయర్స్ లో రాజస్థాన్ రాయల్స్ పై నెగ్గడం ద్వారా సన్ రైజర్స్ సైతం టైటిల్ సమరానికి అర్హత సంపాదించింది.

లీగ్ దశ నుంచి ప్లే-ఆఫ్ రౌండ్ వరకూ నిలకడగా రాణిస్తూ వచ్చిన రెండు అత్యుత్తమజట్ల నడుమ జరిగే ఈ పోరు రసపట్టుగా, హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది.

శ్రేయస్ అయ్య్రర్ నాయకత్వంలోని కోల్ కతా, యాండీ కమిన్స్ కెప్టెన్సీలోని సన్ రైజర్స్ జట్లు..తమ మూడో ఐపీఎల్ టైటిల్ కు తహతహలాడుతున్నాయి.

ఏజట్టు నెగ్గినా..అది మూడోసారే...

ఐపీఎల్ గత 16 సీజన్లలో ఇటు కోల్ కతా, అటు హైదరాబాద్ జట్లకు చెరో రెండుసార్లు విజేతగా నిలిచిన రికార్డు ఉంది. డెక్కన్ చార్జర్స్, సన్ రైజర్స్ పేర్లతో హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇప్పటి వరకూ రెండుమార్లు ఐపీఎల్ ట్రోఫీ అందుకొంటే...కోల్ కతా ఫ్రాంచైజీకి సైతం రెండుసార్లు చాంపియన్ గా నిలిచిన ఘనత ఉంది.

ఈ రోజు జరిగే ఫైనల్లో ఏ జట్టు నెగ్గినా..మూడోసారి ట్రోఫీ అందుకో గలుగుతుంది.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా ముంబై, చెన్నై ఫ్రాంచైజీలు చెరో 5సార్లు విజేతలుగా నిలిస్తే..కోల్ కతా 2 సార్లు, రాజస్థాన్ రాయల్స్ ఓసారి, హైదరాబాద్ ఫ్రాంచైజీ రెండుసార్లు, గుజరాత్ టైటాన్స్ ఓసారి చాంపియన్లు కాగలిగాయి.

పొంచిఉన్న వానముప్పు....

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగే ఫైనల్స్ కు సైతం వానముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో..ఈ రోజు పగలు, రాత్రి వేళ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది.

అయితే..నిబంధనల ప్రకారం నిర్వాహక సంఘం విజేతను నిర్ణయించడానికి పలు రకాల నిబంధనలను ఏర్పాటు చేసింది. ఒకవేళ వర్షంతో ఈ రోజు జరగాల్సిన మ్యాచ్ రద్దయితే...సోమవారం ( రిజర్వ్ డే) రోజున నిర్వహిస్తారు. సోమవారం సైతం వానపడితే 5 పరిమిత ఓవర్ల మ్యాచ్ గా పోరు జరుగుతుంది. అదీ సాధ్యం కాని పక్షంలో.. లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచిన కోల్ కతా జట్టుకే ఐపీఎల్ ట్రోఫీ చిక్కుతుంది.

బౌలర్లే మ్యాచ్ విన్నర్లు....

లీగ్ దశలో రెండుసార్లు ఐపీఎల్ సరికొత్త రికార్డు స్కోర్లు సాధించిన సన్ రైజర్స్ పవర్ ఫుల్ బ్యాటింగ్ తో పాటు..పదునైన బౌలింగ్ ఎటాక్ తోనూ కోల్ కతాకు సవాలు విసురుతోంది. ఓపెనింగ్ జోడీ ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మలను అదుపు చేయకుంటే కోల్ కతా బౌలర్లకు కష్టాలు తప్పవు.

మరోవైపు..పించ్ హిట్టింగ్ ఓపెనర్ సునీల్ నరైన్ ను కట్టడి చేయకుంటే హైదరాబాద్ కు సైతం చిక్కులు తప్పవు. కోల్ కతా బౌలింగ్ బలమంతా ఫాస్ట్ బౌలర్ స్టార్క్, స్పిన్ జోడీ వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ల ప్రతిభతోనే ఉంది.

టాస్ నెగ్గిన జట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగాలా.లేదా చేజింగ్ కు దిగాలా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. చెపాక్ వేదికగా జరిగిన క్వాలిఫైయర్ -2 పోరులో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోడం ద్వారా రాజస్థాన్ రాయల్స్ ఓటమి కొని తెచ్చుకోడంతో ..ఫైనల్లో టాస్ నెగ్గినజట్టు..ముందుగా బ్యాటింగ్ కు దిగి.. 180కి పైగా స్కోరు సాధించడం ద్వారా ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేసే వ్యూహం అనుసరించే అవకాశం లేకపోలేదు.

రెండుజట్లలోని స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను ఎంత సమర్థవంతంగా కట్టడి చేయగలరన్నదే మ్యాచ్ తుది ఫలితాన్ని నిర్ణయించనుంది.

నైట్ రైడర్స్ 18- సన్ రైజర్స్ 9

ఫైనల్లో తలపడుతున్న ఈ రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే...కోల్ కతా జట్టే హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. సన్ రైజర్స్ పై కోల్ కతాకు 18 విజయాలు, 9 పరాజయాల రికార్డు ఉంది. అదే సన్ రైజర్స్ కు మాత్రం కోల్ కతా ప్రత్యర్థిగా 18 పరాజయాల రికార్డు ఉంది. తొమ్మిది విజయాలు మాత్రమే ఉన్నాయి. గత రికార్డులు ఎలా ఉన్నా...ఈరోజు జరిగే ఫైనల్లో ఎంత సమర్ధవంతంగా ఆడగలరన్న అంశంపైనే జయాపజయాలు ఆధారపపడి ఉన్నాయి.

టైటిల్ నెగ్గితే 20 కోట్ల ప్రైజ్ మనీ....

ఐపీఎల్-17వ సీజన్ టైటిల్ విజేతకు ట్రోఫీతో పాటు 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కనుంది. ఫైనల్లో ఓడినజట్టుకు 13 కోట్ల రూపాయలు, మూడు, నాలుగుస్థానాలలో నిలిచినజట్లకు 7 కోట్లు, 6.5 కోట్ల రూపాయలు చొప్పున ప్రైజ్ మనీ ఇస్తారు.

బ్యాటింగ్,బౌలింగ్ విభాగాలలో అత్యుత్తమంగా రాణించిన ఆటగాళ్లకు 15 లక్షల రూపాయల చొప్పున ప్రైజ్ మనీ అందచేస్తారు.

అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ కు ఆరెంజ్ క్యాపుతో పాటు 15 లక్షలు, అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ కు పర్పుల్ క్యాపుతోపాటు 15 లక్షలు నజరానాగా ఇస్తారు. ఫైనల్లో అత్యు్త్తమ ఆటగాడి అవార్డుకు సైతం 15 లక్షల రూపాయలే ఇస్తారు.

వరుణుడు కరుణిస్తే..మ్యాచ్ పూర్తిస్థాయిలో 40 ఓవర్లతో ముగియాలని, అదీ ఆఖరి బంతి వరకూ సస్పెన్స్ థ్రిల్లర్లా సాగాలని అభిమానులు కోరుకొంటున్నారు. మరి ఈ సూపర్ సండే టైటిల్ పోరు ఎంత పట్టుగా, రసపట్టుగా సాగుతుందో తెలుసుకోవాలంటే...మరి కొద్ది గంటలపాటు వేచిచూడక తప్పదు.

First Published:  26 May 2024 7:23 AM GMT
Next Story