Telugu Global
Sports

దక్షిణాఫ్రికా గడ్డపై వార్న్ ను మించిన బుమ్రా!

దక్షిణాఫ్రికా ఫాస్ట్- బౌన్సీ పిచ్ లపై అత్యదిక వికెట్లు పడగొట్టిన విదేశీ బౌలర్ల వరుసలో భారత ఫాస్ట్ బౌలర్ బూమ్ బూమ్ బుమ్రా చేరాడు. స్పిన్ జాదూ షేన్ వార్న్ రికార్డును అధిగమించాడు.

దక్షిణాఫ్రికా గడ్డపై వార్న్ ను మించిన బుమ్రా!
X

దక్షిణాఫ్రికా ఫాస్ట్- బౌన్సీ పిచ్ లపై అత్యదిక వికెట్లు పడగొట్టిన విదేశీ బౌలర్ల వరుసలో భారత ఫాస్ట్ బౌలర్ బూమ్ బూమ్ బుమ్రా చేరాడు. స్పిన్ జాదూ షేన్ వార్న్ రికార్డును అధిగమించాడు.

భారత ఫాస్ట్ బౌలర్ కమ్ యార్కర్ల కింగ్ బూమ్ బూమ్ బుమ్రా మరోసారి సత్తా చాటుకొన్నాడు. వెన్నెముక గాయంతో ఏడాదిపాటు అంతర్జాతీయ క్రికెట్ కు దూరమై..తిరిగి పూర్తి ఫిట్ నెస్ తో బరిలో నిలవడం ద్వారా ప్రపంచ మేటి బ్యాటర్ల వెన్నులో ఒణుకు పుట్టిస్తున్నాడు.

దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో డీన్ ఎల్గర్ తో కలసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన బుమ్రా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు.

కేప్ టౌన్ లో బుమ్రా జోరు...

కేప్ టౌన్ న్యూలాండ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండోటెస్టు తొలిరోజు ఆటలో 2 వికెట్లు పడగొట్టిన బుమ్రా..రెండోరోజుఆటలో 6 వికెట్లు సాధించడం ద్వారా హేమాహేమీల సరసన నిలువగలిగాడు.

61 పరుగులకే 6 వికెట్లు పడగొట్టిన బుమ్రాకు న్యూలాండ్ వేదికగా 18 వికెట్లు పడగొట్టిన మొనగాడిగా నిలిచాడు. కేప్ టౌన్ టెస్టులో అత్యధిక వికెట్లు పడగొట్టిన విదేశీ బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో బుమ్రా నిలిచాడు. కంగారూ స్పిన్ జాదూ షేన్ వార్న్ పేరుతో ఉన్న 17 వికెట్ల రికార్డును బుమ్రా అధిగమించాడు.

న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన విదేశీ బౌలర్లలో ఇంగ్లండ్ కు చెందిన కోలిన్ బ్లిత్ 25 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

18 వికెట్లతో బుమ్రా రెండు, 17 వికెట్లతో షేన్ వార్న్ మూడు, 16 వికెట్లతో జేమ్స్ యాండర్సన్ నాలుగు, 15 వికెట్లతో ఇంగ్లండ్ కే చెందిన జానీ బ్రిగ్స్ ఐదు స్థానాలలో కొనసాగుతున్నారు.

సఫారీగడ్డపై మూడోసారి...

దక్షిణాఫ్రికాతో దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన టెస్టుమ్యాచ్ ల్లో బుమ్రా ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టడం ఇది మూడోసారి. భారత దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ కు సైతం మూడుసార్లు 5 వికెట్లు సాధించిన రికార్డు ఉంది.

సఫారీ ల్యాండ్ లో 5 వికెట్లను చెరో మూడుసార్లు బుమ్రా, శ్రీనాథ్ పడగొడితే..వెంకటేశ్ ప్రసాద్, శ్రీశాంత్, మహ్మద్ షమీ తలో రెండుసార్లు సాధించారు.

దక్షిణాఫ్రికాతో దక్షిణాఫ్రికా వేదికగా ఆడిన టెస్టుమ్యాచ్ ల్లో బుమ్రా సాధించిన వికెట్ల సంఖ్య 38కి చేరింది. ఇప్పటి వరకూ మహ్మద్ షమీ పేరుతో ఉన్న రికార్డును బుమ్రా ప్రస్తుత సిరీస్ లో పడగొట్టిన వికెట్లతో అధిగమించగలిగాడు.

దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్ జట్లతో జరిగిన టెస్టుమ్యాచ్ ల్లో బుమ్రా ఆరుసార్లు 5 వికెట్ల ఫీట్ ను సాధించాడు. జహీర్ ఖాన్, బీఎస్ చంద్రశేఖర్ ల కు సైతం అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టిన ఘనత ఉంది.

ప్రస్తుత రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో బుమ్రా మూడు ఇన్నింగ్స్ లో మొత్తం 12 వికెట్లు పడగొట్టడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సొంతం చేసుకోగలిగాడు.

First Published:  5 Jan 2024 9:59 AM IST
Next Story