భారత టేబుల్ టెన్నిస్ లో తెలుగోళ్ల హవా!
ఇప్పటి వరకూ భారత అత్యుత్తమ మహిళా సింగిల్స్ ప్లేయర్ గా కొనసాగిన మనీకా స్థానాన్ని తెలుగువెలుగు శ్రీజ ఆకుల తొలిసారిగా కైవసం చేసుకోగలిగింది.
భారత టేబుల్ టెన్నిస్ పురుషుల, మహిళల సింగిల్స్ ర్యాంక్ లను తెలుగుతేజాలు తొలిసారిగా దక్కించుకొన్నారు. పారిస్ ఒలింపిక్స్ కు సైతం భారతజట్లు అర్హత సాధించడంలో ప్రధానపాత్ర వహించారు.
భారత టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ అనగానే ఢిల్లీకి చెందిన మనీకా బాత్రా పేరే గుర్తుకు వస్తుంది. ఇప్పటి వరకూ భారత అత్యుత్తమ మహిళా సింగిల్స్ ప్లేయర్ గా కొనసాగిన మనీకా స్థానాన్ని తెలుగువెలుగు శ్రీజ ఆకుల తొలిసారిగా కైవసం చేసుకోగలిగింది.
తొలి తెలుగు మహిళ శ్రీజ...
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం హైదరాబాద్ కు చెందిన శ్రీజ ఆకుల ప్రపంచ స్థాయిలో 39వ ర్యాంకులో నిలవడంతో పాటు..
భారత మహిళా సింగిల్స్ లో టాప్ ర్యాంకర్ గా నిలిచింది.
భారత టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ చరిత్రలోనే నంబర్ వన్ ర్యాంక్ సాధించిన తెలుగు తొలిక్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. తన కెరియర్ లో అత్యుత్తమంగా 38వ ర్యాంక్ సాధించిన శ్రీజ ప్రస్తుతం 39వ ర్యాంకర్ గా ఉంది.
వెటరన్ స్టార్ శరత్ కమల్ తో జంటగా కామన్వెల్త్ గేమ్స్ మిక్సిడ్ డబుల్స్ బంగారు పతకం గెలుచుకోడం ద్వారా గుర్తింపు సంపాదించిన శ్రీజ..ఆ తర్వాత నుంచి నిలకడగా రాణిస్తూ వస్తోంది. ప్రధానంగా మహిళల సింగిల్స్ లో పలు అంతర్జాతీయ టైటిల్స్ సాధించడం ద్వారా తన ర్యాంక్ ను గణనీయంగా మెరుగుపరచుకోగలిగింది.
25 సంవత్సరాల శ్రీజ డబ్లుటీటీ ఫీడర్ బీరూట్, కార్పస్ క్రిస్టీ టోర్నీలలో విజేతగా నిలవడంతో పాటు గోవా వేదికగా ముగిసిన డబ్లుటీటీ స్టార్ టోర్నీ క్వార్టర్ ఫైనల్స్ చేరుకోడం ద్వారా కీలక ర్యాంకింగ్ పాయింట్లు సంపాదించింది.
2022 కామన్వెల్త్ గేమ్స్ మిక్సిడ్ డబుల్స్ లో స్వర్ణ విజేతగా నిలిచిన శ్రీజ..మహిళల టీమ్ విభాగంలో భారత్ కు పారిస్ ఒలింపిక్స్ లో ప్రాతినిథ్యం వహించనుంది.
ఇతర భారత మహిళా సింగిల్స్ ప్లేయర్లలో యశస్వినీ ఘోర్పడే 99, అర్చనా కామత్ 100వ ర్యాంక్ సాధించారు.
పురుషుల సింగిల్స్ లో శరత్ టాప్...
పురుషుల సింగిల్స్ లో సైతం మరో తెలుగుతేజం , వెటరన్ శరత్ కమల్ టాప్ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచ ర్యాంకింగ్స్ లో శరత్ కమల్ 37, సత్యన్ 60, మానవ్ ఠాకూర్ 61 ర్యాంకుల్లో నిలిచారు.
జాతీయ చాంపియన్ హర్మీత్ దేశాయ్ 64వ ర్యాంక్ కు పడిపోయాడు. జులైలో పారిస్ వేదికగా ప్రారంభంకానున్న 2024 ఒలింపిక్స్ పురుషుల, మహిళల టీమ్ విభాగాలలో పాల్గొనటానికి భారతజట్లు ఇప్పటికే అర్హత సాధించడం ద్వారా చరిత్ర సృష్టించాయి.
పురుషుల, మహిళల సింగిల్స్ లో భారత్ తరపున పాల్గొనే ఇద్దరేసి అత్యుత్తమ ప్లేయర్లు ఎవరో..మే 16లోగా భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య నిర్ణయించాల్సి ఉంది.
9వ ర్యాంక్ లో పురుషుల జట్టు....
భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి మన పురుషులజట్టు తెరలేపింది. గతంలో ఎన్నడూ లేనంతగా భారతపురుషుల జట్టు..అత్యుత్తమంగా ప్రపంచ 8వ ర్యాంక్ తో సంచలనం సృష్టించింది.
తాజా ర్యాంకింగ్స్ ప్రకారం చైనా, జపాన్,జర్మనీ మొదటి మూడు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. భారత పురుషుల జట్టు 8వ ర్యాంక్ కు చేరుకోగలిగింది.
కామన్వెల్త్ గేమ్స్, ఆసియాక్రీడల్లో భారత క్రీడాకారులు, జట్లు మెరుగైన ఆటతీరు ప్రదర్శించడంతో ర్యాంకింగ్ గణనీయంగా మెరుగుపడింది.
భారత్, ఆస్ట్ర్రియా జట్లు చెరో 272 పాయింట్ల చొప్పున సాధించి సమానస్థితిలో ఉన్నా..సత్యన్, శరత్ కమల్ వ్యక్తిగతంగా మెరుగైన ర్యాంకుల్లో నిలవడంతో...భారత్ 8, ఆస్ట్ర్రియా 10 ర్యాంకుల్లో ఉన్నట్లు ప్రకటించారు.
గతంలో 13వ ర్యాంక్ లో నిలిచిన భారతజట్టు...కేవలం ఏడాదికాలంలోనే ఐదుర్యాంకుల మేర తన స్థానాన్ని మెరుగుపరచుకోగలిగింది.