Telugu Global
Sports

అశ్విన్ తో ప్రయాణం ఈనాటిది కాదు- రోహిత్!

వందటెస్టు మ్యాచ్ ల హీరో అశ్విన్ తో తన ప్రయాణం ఈనాటిది కాదని, అశ్విన్ భారత క్రికెట్ కు దొరికిన ఆణిముత్యమంటూ కెప్టెన్ రోహిత్ శర్మ కొనియాడాడు.

అశ్విన్ తో ప్రయాణం ఈనాటిది కాదు- రోహిత్!
X

వందటెస్టు మ్యాచ్ ల హీరో అశ్విన్ తో తన ప్రయాణం ఈనాటిది కాదని, అశ్విన్ భారత క్రికెట్ కు దొరికిన ఆణిముత్యమంటూ కెప్టెన్ రోహిత్ శర్మ కొనియాడాడు.

సాంప్రదాయ టెస్టు క్రికెట్ చరిత్రలో శత టెస్టుమ్యాచ్ లు ఆడిన భారత క్రికెటర్లలో 14వ ఆటగాడిగా స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఆఖరి (5వ) టెస్టు బరిలో నిలవడం ద్వారా 37 సంవత్సరాల అశ్విన్ వందటెస్టుల మైలురాయిని చేరుకోగలిగాడు.

కోల్ కతా నుంచి ధర్మశాల వరకూ.....

2011 సిరీస్ లో భాగంగా జరిగిన కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన అశ్విన్ గత 13 ఏళ్ల్లుగా భారత క్రికెట్ నమ్మదగిన స్పిన్ ఆల్ రౌండర్ గా అపురూప సిరీస్ విజయాలు అందించాడు. పలు అరుదైన రికార్డులు సైతం సాధించాడు.

ప్రస్తుత సిరీస్ లోని రాంచీ టెస్టు వరకూ ఆడిన 99 మ్యాచ్ ల్లో 507 వికెట్లు పడగొట్టిన వెటరన్ అశ్విన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పుష్కరకాలం పాటు భారత టెస్టు జట్టు మ్యాచ్ విన్నర్ గా కొనసాగిన అశ్విన్ కు ప్రత్యర్థిజట్ల ఆటగాళ్లు మాత్రమే కాదు..భారత మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్ర్రి సైతం హ్యాట్సాఫ్ చెప్పారు.

ఇక..భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అశ్విన్ తో తన ప్రయాణాన్ని తనదైన శైలిలో వివరించాడు.

అండర్ -17 రోజుల నుంచీ....

అండర్ -17 రోజుల నుంచి అశ్విన్ తో తాను కలిసి ఆడుతూ వచ్చానని, తమ ప్రయాణం, అనుబంధం ఈనాటిది కాదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ గుర్తు చేసుకొన్నాడు.

గత ఎనిమిది సంవత్సరాలుగా భారత్ కు సిరీస్ వెంట సిరీస్ విజయాలు అందిస్తూ వచ్చిన అశ్విన్ ను ఎంతగా పొగిడినా అది తక్కువేనని మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు.

అశ్విన్ లాంటి అంకితభావం, తెలివిగల ఆల్ రౌండర్ జట్టులో ఉంటే కెప్టెన్ కు కావాల్సింది మరేదీ లేదని, ఎంత గొప్ప బ్యాటరైనా అశ్విన్ స్పిన్ మాయలో గల్లంతు కావాల్సిందేనంటూ రోహిత్ ప్రశంసించాడు.

బ్యాటుతోనూ, బంతితోనూ రాణించడంలో అశ్విన్ కు అశ్విన్ మాత్రమే సాటని, తన ఆటతీరును, బౌలింగ్ లో ప్రావీణ్యాన్ని నిరంతరం మెరుగు పరచుకోడానికి అశ్విన్ పడుతున్న తపన చూస్తే అబ్బురమనిపిస్తుందని రోహిత్ చెప్పాడు.

ఓపెనర్ నుంచి స్పిన్నర్ గా, స్పిన్నర్ నుంచి బ్యాటర్ గా....

అశ్విన్, తన కెరియర్ సమాంతరంగా సాగడం, భారతజట్టు విజయాలలో తామిద్దరం ప్రధానపాత్ర వహించడం గర్వకారణమని రోహిత్ చెప్పాడు. 17 సంవత్సరాలలోపు వయసు జాతీయ క్రికెట్ పోటీలలో తాను బౌలర్ గా ఉంటే...అశ్విన్ ఓపెనింగ్ బ్యాటర్ గా ఉండేవాడని...ఆ తరువాతి రోజుల్లో అశ్విన్ ఓపెనర్ నుంచి స్పెషలిస్ట్ స్పిన్నర్ గా పరిణామం పొందితే..తాను బౌలింగ్ విడిచి పెట్టి స్పెషలిస్ట్ బ్యాటర్ గా మారడం తనకు వింతగా అనిపిస్తుందని భారత కెప్టెన్ తెలిపాడు.

ఓ ఆటగాడు తన కెరియర్ లో వంద టెస్టులు ఆడాలంటే ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందని, కుటుంబ సహకారం కూడా ప్రధానమని..ఇవన్నీ ఉన్న కారణంగానే అశ్విన్ వందటెస్టుల క్లబ్ లో చేరగలిగాడని రోహిత్ చెప్పాడు. అశ్విన్ నూరోటెస్టు ఆడటం చూస్తుంటే కష్టానికి, అంకితభావానికి తగిన ఫలితం దక్కినట్లుగా తనకు అనిపిస్తోందని రోహిత్ అన్నాడు.

క్రికెట్ ఆటపట్ల అశ్విన్ కు సంపూర్ణ అవగాహన ఉందని, ఎంతో తెలివైన క్రికెటర్ మాత్రమే కాదు..ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణించగల సత్తా ఉన్న మొనగాడంటూ ఆకాశానికి ఎత్తి వేశాడు.

అశ్విన్ కు జ్ఞాపికగా 100వ టెస్ట్ క్యాప్...

క్రికెట్లో సాధారణంగా అరంగేట్రం మ్యాచ్ లో మాత్రమే టీమిండియా క్యాప్ ను ఇస్తారు. అయితే..వందో టెస్టు ఆడుతున్న సమయంలో అశ్విన్ కు జ్ఞాపికగా 100వ టెస్ట్ క్యాప్ ను బీసీసీఐ బహుకరించింది.

ధర్మశాల టెస్టు ప్రారంభానికి ముందు జరిగిన ఓ కార్యక్రమంలో అశ్విన్ తన భార్య ప్రీతి, ఇద్దరు కుమార్తెలతో కలసి పాల్గొన్నాడు. ప్రధాన శిక్షకుడు రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు..జట్టులోని సహ ఆటగాళ్లంతా అశ్విన్ కు అభినందనలు తెలిపారు. వందటెస్టుల ప్రత్యేక టోపీని అశ్విన్ కు ద్రావిడ్ అందచేశారు.

కాగా..ధర్మశాల టెస్టుతో అరంగేట్రం చేసిన యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కు భారత టెస్ట్ క్యాప్ ను అశ్విన్ అందచేయటం విశేషం.

భారత 14వ ఆటగాడు అశ్విన్.....

1930లో భారత్ తన మొట్టమొదటి టెస్టు మ్యాచ్ ఆడిన నాటినుంచి గత 94 సంవత్సరాల కాలంలో వంద టెస్టులు ఆడిన భారత క్రికెటర్లు 14మంది జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ సైతం చోటు సంపాదించగలిగాడు.

టెస్టు చరిత్రలో అత్యధికంగా 200 టెస్టులు ఆడిన ప్రపంచ రికార్డు మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉంది. 163 టెస్టులతో రాహుల్ ద్రావిడ్, 134 టెస్టులతో వీవీఎస్ లక్ష్మణ్, 132 టెస్టులతో అనీల్ కుంబ్లే, 131 టెస్టులతో కపిల్ దేవ్ మొదటి ఐదుస్థానాలలో కొనసాగుతున్నారు.

125 టెస్టులతో సునీల్ గవాస్కర్, 116 టెస్టులతో దిలీప్ వెంగ్ సర్కార్, 113 టెస్టులతో సౌరవ్ గంగూలీ, 105 టెస్టులతో ఇశాంత్ శర్మ, 103 టెస్టులతో హర్భజన్ సింగ్, 103 టెస్టులతో చతేశ్వర్ పూజారా, 103 టెస్టులతో వీరేంద్ర సెహ్వాగ్ వందటెస్టుల క్లబ్ లో చేరిన భారత క్రికెటర్లుగా ఉన్నారు.

First Published:  7 March 2024 4:30 PM IST
Next Story