Telugu Global
Sports

భారత టెస్టు జట్టులో యువ క్రికెటర్లకు దారేదీ?

సాంప్రదాయ టెస్టు క్రికెట్ ప్రస్తుత భారతజట్టులో వయసు మీద పడుతున్న ఆటగాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. 15 సంవత్సరాలుగా జట్టునే పట్టుకొని వేలాడే క్రికెటర్ల సంఖ్య ఎక్కువైపోతోంది.

భారత టెస్టు జట్టులో యువ క్రికెటర్లకు దారేదీ?
X

రోహిత్ శర్మ

సాంప్రదాయ టెస్టు క్రికెట్ ప్రస్తుత భారతజట్టులో వయసు మీద పడుతున్న ఆటగాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. 15 సంవత్సరాలుగా జట్టునే పట్టుకొని వేలాడే క్రికెటర్ల సంఖ్య ఎక్కువైపోతోంది.

క్రికెట్ అంటే ఇప్పడు కాసుల గలగలలు. ప్రతిభ ఉంటే, నిలకడగా రాణించే దమ్ముంటే చాలు కోట్లరూపాయలు సంపాదించడం, రాత్రికి రాత్రే కుబేరులుగా మారిపోడం నేటితరం ఆటగాళ్లకు చిటికెలో పని.

టెస్టుమ్యాచ్ ఆడితే 15 లక్షలు, వన్డేకి 7 లక్షలు, టీ-20 మ్యాచ్ కు 4 లక్షలు మ్యాచ్ ఫీజుగా దక్కుతోంది. ఇక దేశవాళీ క్రికెట్లో మ్యాచ్ ఆడిన రోజున ఒక్కో ఆటగాడికీ 50 వేల రూపాయల చొప్పున బీసీసీఐ చెల్లిస్తూ వస్తోంది. ఇది కాక ..బోర్డు వార్షిక కాంట్రాక్టుతో కోటి రూపాయల నుంచి 7 కోట్ల రూపాయల వరకూ స్థిర ఆదాయం దక్కుతోంది. దీనికి అదనంగా వార్షిక ఐపీఎల్ కాంట్రాక్టు ద్వారా ప్రతిభకు తగ్గట్టుగా కోట్ల రూపాయల కాంట్రాక్టు దక్కుతోంది.

ఈ నేపథ్యంలో క్రికెట్ ను కెరియర్ గా ఎంచుకొనే ఆటగాళ్ల సంఖ్య వందల నుంచి వేలకు పెరిగిపోడంతో గతంలో ఎన్నడూ లేనంతగా విపరీతమైన పోటీ నెలకొని ఉంది.

మూడు ఫార్మాట్లలోనూ తీవ్ర పోటీ....

సాంప్రదాయ టెస్టు క్రికెట్, 50 ఓవర్ల వన్డే క్రికెట్, ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్...ఇలా మూడు ఫార్మాట్లలోనూ భారతజట్టులో చోటు కోసం పోటీ అనూహ్యంగా పెరిగిపోయింది.

టీ-20 జట్టులో యువఆటగాళ్లకు తగిన అవకాశాలు కల్పిస్తున్న భారత టీమ్ మేనేజ్ మెంట్..వన్డే, టెస్టు ఫార్మాట్లలో మాత్రం ఆచితూచి అవకాశాలు కల్పిస్తూ వస్తోంది.

36 సంవత్సరాల రోహిత్ శర్మ నాయకత్వంలోని ప్రస్తుత టెస్టు జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్న విరాట్ కొహ్లీ వయసు 35, అశ్విన్ వయసు 37, రవీంద్ర జడేజా వయసు 35 సంవత్సరాలు.

జట్టులో చోటు కోల్పోయిన చతేశ్వర్ పూజారా, అజింక్యా రహానే, హనుమ విహారీ 30 నుంచి 35 సంవత్సరాల నడుమ వయసువారే.

సరఫ్రాజ్ ఖాన్ ఎదురుచూపులు....

అయితే...దేశవాళీ క్రికెట్లో గత మూడేళ్లుగా సెంచరీల వెంట సెంచరీలు బాదుతూ, టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తున్నసర ఫ్రాజ్ ఖాన్, రుతురాజ్ గయక్వాడ్ లాంటి పలువురు ప్రతిభావంతులైన బ్యాటర్లు తమవంతు కోసం ఎదురుచూస్తున్నారు.

కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి సెమీసీనియర్లు గాయాలతో జట్టుకు అడపాదడపా దూరమవుతూనే వస్తున్నారు. బౌలింగ్ విభాగంలో సైతం బుమ్రా, షమీ, ప్రసిద్ధ కృష్ణ లాంటి కీలక ఫాస్ట్ బౌలర్లు జట్టులోకి వస్తూ పోతూ ఉన్నారు. యువబ్యాటర్లు యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్ లకు తగిన అవకాశాలు కల్పిస్తూ టీమ్ మేనేజ్ మెంట్ వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ వస్తోంది.

భారత్ తరపున 100కు పైగా టెస్టులు ఆడిన చతేశ్వర్ పూజారా సైతం తిరిగి భారతజట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

ఆడినవారే ఆడుతు ఉంటే కుర్రాళ్లకు చోటేలా?

అయితే...గత దశాబ్దకాలంగా భారతజట్టుకు ఆడుతూ , నిలకడగా రాణిస్తున్న పూజారా లాంటి సీనియర్ క్రికెటర్లకు తిరిగి జట్టులో చోటు కల్పించడం అంతతేలిక కాదని, ఆడినవారే ఆడుతూ పోతే యువక్రికెటర్లను జట్టులో ఎలా చేర్చుకోగలమంటూ కెప్టెన్ రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశాడు. క్రికెటర్లకు ఎప్పుడో ఒకప్పుడు రిటైర్మెంట్ అనివార్యమని, అందరికీ సుదీర్ఘకాలం భారతజట్టులో సభ్యుడిగా ఉండాలన్న కోరిక ఉంటుందని..అందులో తప్పేమీ లేదని రోహిత్ వివరించాడు.

భారత క్రికెట్ భవితవ్యమంతా యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్ , రిషభ్ పంత్ లాంటి యువక్రికెటర్ల పైనే ఆధారపడి ఉందని రోహిత్ స్పష్టం చేశాడు. నేటితరం క్రికెటర్లంతా తమ వంతు కోసం కాస్త ఓపికగా ఎదురుచూడాలంటూ భారత కెప్టెన్ సలహా ఇచ్చాడు.

First Published:  10 Feb 2024 6:30 AM IST
Next Story