చెన్నైలో ఐపీఎల్ ఫైనల్.. ధోనీ ఫేర్‌వెల్ కోసమేనా?
ఈ ఐపీఎల్‌తో ధోనీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడన్న అంచనాల నేపథ్యంలో అతనికి ఘనంగా వీడ్కోలు పలికేందుకే ఇలా రెండు కీలక మ్యాచ్‌లను చెన్నైలో పెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ సగం షెడ్యూల్‌నే విడుదల చేసిన బీసీసీఐ మిగిలిన షెడ్యూల్‌ను ఈరోజు ప్రకటించింది. మే 26న ఐపీఎల్ ఫైనల్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. అంతకు ముందు 24న రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌కు కూడా చెన్నైనే ఆతిథ్యమివ్వబోతోంది. ఈ ఐపీఎల్‌తో ధోనీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడన్న అంచనాల నేపథ్యంలో అతనికి ఘనంగా వీడ్కోలు పలికేందుకే ఇలా రెండు కీలక మ్యాచ్‌లను చెన్నైలో పెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఫైనల్‌కు కాకుంటే క్వాలిఫయర్‌కు అయినా పక్కా అని
ఐపీఎల్ 14 సీజన్లలో 12సార్లు ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయింది చెన్నై సూపర్ కింగ్స్. ఇది ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు. అందులో 10 సార్లు ఫైనల్‌కు చేరి, ఐదుసార్లు కప్పు ఎగరేసుకుపోయిన బీభత్సమైన రికార్డు చెన్నై సొంతం. అంతటి చెన్నై విజయాల వెనక కీలక పాత్రధారి కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. ఈసారి కూడా చెన్నై ఫైనల్‌కు కాదంటే కనీసం ప్లే ఆఫ్స్‌కు వస్తుందని అంచనా.
ఈ ఏడాదితో ముగిస్తాడని..
ధోనీ ఈ ఏడాదితో ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పేస్తాడని అంచనా. ధోనీ తప్పుకుని సీఎస్‌కే కెప్టెన్‌గా లాస్ట్‌మినిట్‌లో రుతురాజ్ గైక్వాడ్‌ను నియమించడం కూడా ఇందులో భాగమే అంటున్నారు. ఈ నేపథ్యంలో తలాకు ఘనమైన వీడ్కోలు పలకడానికే ఫైనల్‌కు చెన్నై సూపర్ కింగ్స్ హోం గ్రౌండ్ అయిన చెపాక్‌లో పెట్టారని భావిస్తున్నారు. ఒకవేళ చెన్నై ఫైనల్ వరకు రాకపోయినా కనీసం క్వాలిఫయర్‌కు వస్తుందన్న లెక్కతో సెకండ్ క్వాలిఫయర్‌ను కూడా చెపాక్‌లోనే పెట్టారని విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు. ఒకవేళ అన్నీ అనుకున్నట్లే జరిగి చెన్నై ఫైనల్‌కు వచ్చి చెపాక్‌లో కప్పు గెలిస్తే ధోనీకి ఘనంగా వీడ్కోలు పలికినట్లే కదా!