Telugu Global
Sports

పదేళ్ల తర్వాత ఐపీఎల్'బరి'లో 'మాటలమాంత్రికుడు'!

క్రికెట్ 'మాటల మాంత్రికుడు' నవజోత్ సింగ్ సిద్ధు దశాబ్దకాలం విరామం తర్వాత తిరిగి ఐపీఎల్ కామెంట్రీబరిలోకి పునరాగమనం చేయబోతున్నాడు.

పదేళ్ల తర్వాత ఐపీఎల్బరిలో మాటలమాంత్రికుడు!
X

క్రికెట్ 'మాటల మాంత్రికుడు' నవజోత్ సింగ్ సిద్ధు దశాబ్దకాలం విరామం తర్వాత తిరిగి ఐపీఎల్ కామెంట్రీబరిలోకి పునరాగమనం చేయబోతున్నాడు....

ఐపీఎల్ క్రికెట్ వ్యాఖ్యానాన్ని కొంతపుంతలు తొక్కించిన భారత మాజీ ఓపెనర్ కమ్ కామెంటీటర్ కమ్ పొలిటీషియన్ నవజోత్ సింగ్ సిద్ధూ పదేళ్ల విరామం తరువాత.. తిరిగి వ్యాఖ్యాతగా పునరాగమనం చేయనున్నాడు.

క్రికెట్ వ్యాఖ్యానానికి సిద్ధూ మార్క్!

క్రికెట్ వ్యాఖ్యాతలలో ఒక్కొక్కరదీ ఒక్కో శైలి. క్రికెటర్లుగా తమ రిటైర్మెంట్ తరువాత కామెంటీటర్లుగా తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత క్రికెటర్లలో సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి,నవజోద్ సింగ్ సిద్ధూ, సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తీక్, దినేశ్ కార్తీక్ తమదైన శైలి వ్యాఖ్యానంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొన్నారు. అయితే...వీరందరిలో విలక్షణ శైలి ఎవరిదంటే భారత మాజీ ఓపెనర్ కమ్ పొలిటీషియన్ నవజోత్ సింగ్ సిద్ధూది మాత్రమే అనిచెప్పాలి.

క్రికెట్ వ్యాఖ్యానానికి పుస్తకపఠనం ద్వారా తాను సంపాదించిన విషయ, భాషాపరిజ్ఞానాన్ని జోడించి..భావాత్మకంగా, కవితాత్మకంగా చెప్పడంలో సిద్ధూ తరువాతే ఎవరైనా.

1999 నుంచి 2014-15 వరకూ క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సిద్ధూ..2008లో ప్రారంభమైన ఐపీఎల్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నాడు. తన ట్రేడ్ మార్క్ క్రికెట్ కామెంట్రీతో ఐపీఎల్ కే సరికొత్త గుర్తింపు సంపాదించి పెట్టాడు.

ఓ క్రికెటర్ గా సంపాదించలేని మొత్తాన్ని క్రికెట్ కామెంటటీర్ గా సిద్ధూ ఆర్జించాడు. కేవలం క్రికెట్ కామెంట్రీ ద్వారానే సీజన్ కు 60 నుంచి 70 లక్షల రూపాయల వరకూ సిద్ధూ ఆర్జన ఉండేది.

రాజకీయ రొంపి నుంచి తిరిగి క్రికెట్ కామెంట్రీలోకి...

2015 తర్వాత నుంచి తన పూర్తిసమయాన్ని కేవలం రాజకీయాలకు పరిమితం చేయడంతో సిద్ధూ తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ కామెంట్రీకి దూరమయ్యాడు. పంజాబ్ రాజకీయాలలో ఓ చక్రం తిప్పడమే కాదు...పార్లమెంటు సభ్యుడిగా కూడా సేవలు అందించిన సిద్ధూ చివరకు రాజకీయాలతో విసిగిపోయి..తిరిగి కామెంటీటర్ అవతారం ఎత్తాడు.

ఈనెల 22 నుంచి ఎనిమిదివారాలపాటు సాగనున్న ఐపీఎల్ 17వ సీజన్ కు క్రికెట్ వ్యాఖ్యాతగా 60 సంవత్సరాల సిద్ధూ వ్యవహరించనున్నాడు. పదేళ్ల విరామం తరువాత తిరిగి కామెంటీటర్ గా రావడం తనకు కొత్తగా ఏమీ అనిపించలేదని, తాను రాజకీయాలలో కొనసాగినా క్రికెట్ పరిణామాలను గమనిస్తూనే ఉండేవాడినని గుర్తు చేసుకొన్నాడు.

కేవలం మూడురోజుల వ్యవధిలోనే సాధికారికంగా వ్యాఖ్యానం చేయగలుగుతున్నానంటూ సంతృప్తి ప్రకటించాడు. సవాళ్లు, పునరాగమనాలు తనకు కొత్తేమీ కాదని, కామెంటీటర్లకు లభించే భారీ పారితోషికాలకు ఆశపడి తాను వ్యాఖ్యానం చేయడం లేదని..కేవలం కామెంట్రీ మీద ప్రేమతోనే రీ-ఎంట్రీ చేశానని స్పష్టం చేశాడు.

First Published:  20 March 2024 2:30 AM GMT
Next Story