Telugu Global
Sports

ముంబై అవుట్..ఐపీఎల్ ప్లే- ఆఫ్ రౌండ్లో కోల్ కతా!

ఐపీఎల్ -17వ సీజన్ ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన తొలిజట్టుగా రెండుసార్లు విజేత కోల్ కతా నైట్ రైడర్స్ నిలిచింది.మాజీ చాంపియన్ ముంబైని 18 పరుగులతో కోల్ కతా చిత్తు చేసింది.

ముంబై అవుట్..ఐపీఎల్ ప్లే- ఆఫ్ రౌండ్లో కోల్ కతా!
X

ఐపీఎల్ -17వ సీజన్ ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన తొలిజట్టుగా రెండుసార్లు విజేత కోల్ కతా నైట్ రైడర్స్ నిలిచింది.మాజీ చాంపియన్ ముంబైని 18 పరుగులతో కోల్ కతా చిత్తు చేసింది.

ఐపీఎల్-2024 సీజన్ ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన తొలిజట్టు ఘనతను మాజీ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకొంది. హోంగ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా వర్షం దెబ్బతో 16 ఓవర్ల మ్యాచ్ గా సాగిన 13వ రౌండ్ పోరులో ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ ను కోల్ కతా 18 పరుగులతో అధిగమించింది.

మొత్తం 12 రౌండ్లలో 9 విజయాలు, 3 పరాజయాల రికార్డుతో 18 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ టాపర్ గా నిలవడమే కాదు...ప్లే-ఆఫ్ రౌండ్ బెర్త్ ను సైతం ఖాయం చేసుకోగలిగింది.

ముంబై..షరామామూలే....

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలకవర్మ, బుమ్రా లాంటి మేటి ఆటగాళ్లున్న ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ పరిస్థితి ఇంత బతుకూ బతికి.... అన్నట్లుగా తయారయ్యింది. 13వ రౌండ్ మ్యాచ్ లో సైతం పరాజయం పాలై..లీగ్ టేబుల్ ఆఖరునుంచి 2వ స్థానంలో నిలిచింది.

కోల్ కతా నైట్ రైడర్స్- ముంబై ఇండియన్స్ జట్ల నడుమ జరిగిన ఈ మ్యాచ్ కు వానదెబ్బ తగలడంతో మ్యాచ్ ను 16 పరిమిత ఓవర్లకు కుదించి నిర్వహించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య కోల్ కతా 16 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు సాధించింది.

యార్కర్ల కింగ్ అరుదైన రికార్డు...

ఇప్పటికే ప్లే-ఆఫ్ రౌండ్ చేరే అవకాశాలను చేజార్చుకొన్న ముంబై..అంతగా ప్రాధాన్యం లేని ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొంది. కోల్ కతా స్టార్ ఓపెనర్ సునీల్ నరైన్ ను రెండోఓవర్లోనే ఓ సూపర్ స్వింగర్ తో యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రా పడగొట్టడం ద్వారా తనజట్టుకు చక్కటి ఆరంభాన్ని ఇచ్చాడు.

ప్రస్తుత సీజన్లో ఓ సెంచరీతో సహా 400కు పైగా పరుగులు సాధించడం ద్వారా కోల్ కతా తురుపుముక్కగా మారిన సునీల్ నరైన్ డకౌట్ కావడం ద్వారా ఓ చెత్త రికార్డును మూటగట్టుకొన్నాడు. తన టీ-20 కెరియర్ లో 44వసారి డకౌటయ్యాడు.

అయితే..మరో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ 21 బంతుల్లో 42, రింకూ సింగ్ 12 బంతుల్లో 20 పరుగులు, యాండ్రీ రస్సెల్ 14 బంతుల్లో 24 పరుగులు, నితీశ్ రాణా 23 బంతుల్లో 33 పరుగులు చేయడంతో కోల్ కతా 157 పరుగుల స్కోరు సాధించగలిగింది.

మరోవైపు ముంబై స్టార్ బౌలర్ బుమ్రా తన కోటా 4 ఓవర్లలో 39 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టడం ద్వారా ఆరెంజ్ క్యాప్ ను కైవసం చేసుకోగలిగాడు. లెగ్ స్పిన్నర్ పియూశ్ చావ్లా 3 ఓవర్లలో 28 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించాడు.

జస్ ప్రీత్ బుమ్రా కు ఆరెంజ్ క్యాప్....

ప్రస్తుత సీజన్ లీగ్ మొదటి 13 రౌండ్ల మ్యాచ్ ల్లో 20 వికెట్లు పడగొట్టడం ద్వారా బుమ్రా ఆరెంజ్ క్యాప్ ను అందుకొన్నాడు. తన కెరియర్ లో ఓ సీజన్లో 20 వికెట్లు పడగొట్టడం బుమ్రాకు ఇది నాలుగోసారి.

2017, 2022, 2021 సీజన్లలో 20కి పైగా వికెట్లు పడగొట్టిన బుమ్రా ప్రస్తుత 2024 సీజన్లో సైతం 20 వికెట్ల ఘనత సాధించగలిగాడు.

చేజింగ్ లో ముంబై విఫలం...

158 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ముంబైకి ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- ఇషాన్ కిషన్ మొదటి వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యంతో చక్కటి ఆరంభాన్ని ఇచ్చినా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. ఇషాన్ కిషన్ 40, రోహిత్ 24 బంతుల్లో 19 పరుగుల స్కోర్లకు అవుటయ్యారు. ముంబై తురుపుముక్క సూర్యకుమార్ యాదవ్ సైతం తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు.

తిలక్ వర్మ 17 బంతుల్లో 32 పరుగులు సాధించినా ముంబై 16 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. లీగ్ లో ఇప్పటి వరకూ ఆడిన 13 రౌండ్లలో ముంబై 4 విజయాలు, 9 పరాజయాల రికార్డుతో డీలా పడిపోయింది.

ఈరోజు జరిగే మరో కీలక పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో నెగ్గినజట్టుకే ప్లే-ఆఫ్ రౌండ్ చేరే అవకాశాలు ఉంటాయి.

ఢిల్లీ కెప్ట్టెన్ రిషభ్ పంత్ ఓ మ్యాచ్ సస్పెన్ష్ కు గురికావడంతో..స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. ఈ మ్యాచ్ లో సైతం భారీ స్కోరు సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పడానికి బెంగళూరు ఓపెనర్ విరాట్ కొహ్లీ తహతహలాడుతున్నాడు.

లీగ్ టేబుల్ 5వ స్థానంలో నిలిచిన ఢిల్లీకి మాత్రమే కాదు...7వ స్థానంలో కొనసాగుతున్న బెంగళూరుకు సైతం ఈ మ్యాచ్ డూ ఆర్ డై లాంటిదే.

First Published:  12 May 2024 5:30 AM GMT
Next Story