Telugu Global
Sports

భారత యువషట్లర్ సంచలనం..ఆల్ ఇంగ్లండ్ సెమీస్ లో చోటు!

భారత యువఆటగాడు లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. రెండేళ్లలో రెండోసారి ప్రతిష్టాత్మక ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్ సెమీస్ చేరిన భారత నేటితరం ఆటగాడిగా నిలిచాడు.

భారత యువషట్లర్ సంచలనం..ఆల్ ఇంగ్లండ్ సెమీస్ లో చోటు!
X

భారత యువఆటగాడు లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. రెండేళ్లలో రెండోసారి ప్రతిష్టాత్మక ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్ సెమీస్ చేరిన భారత నేటితరం ఆటగాడిగా నిలిచాడు.

అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆల్-ఇంగ్లండ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో యువఆటగాడు లక్ష్యసేన్ భారత్ పతాకం రెపరెపలాడిస్తున్నాడు.

కేవలం రెండేళ్ వ్యవధిలోనే రెండోసారి సెమీస్ చేరడం ద్వారా అరుదైన ఘనత సంపాదించాడు. పురుషుల డబుల్స్ లో టైటిల్ ఖాయమనుకొన్న భారతజోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టిల కు రెండోరౌండ్లోనే గట్టి దెబ్బ తగిలింది.

మూడుగేమ్ ల థ్రిల్లర్లో విన్నర్ లక్ష్యసేన్...

బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న 2024 ఆల్- ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీ పురుషుల సింగిల్స్ లో మినహా మిగిలిన అన్ని విభాగాలలోనూ భారత క్రీడాకారుల పోటీ ముగిసింది.

మహిళల సింగిల్స్ లో పీవీ సింధు, పురుషుల డబుల్స్ లో ప్రపంచ నంబర్ వన్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి సైతం విఫలమయ్యారు. అయితే..భారత పతకం ఆశలన్నీ యంగ్ గన్ లక్ష్యసేన్ పైనే ఆధారపడి ఉన్నాయి.

క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడోర్యాంక్ ఆటగాడు, డేనిష్ స్టార్ ను మూడుగేమ్ ల సమరంలో కంగు తినిపించిన లక్ష్య...సెమీఫైనల్లో చోటు కోసం జరిగిన పోరులో సైతం తుదివరకూ పోరాడి మూడు గేమ్ ల విజయంతో సెమీస్ రౌండ్లో అడుగు పెట్టాడు.

గంటా 11 నిముషాల పోరాటం...

ఆల్- ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ కాంప్లెక్స్ సెంటర్ కోర్ట్ వేదికగా జరిగిన సెమీస్ పోరులో ప్రపంచ 18వ ర్యాంక్ ఆటగాడు లక్ష్యసేన్ విజేతగా నిలవడానికి మాజీ చాంపియన్, 10వ ర్యాంక్ ప్లేయర్ లీ జీ జియాతో గంటా 11 నిముషాలపాటు పోరాడాల్సి వచ్చింది.

13 లక్షల డాలర్ల ఈ ప్రైజ్ మనీ టోర్నీకి సూపర్ -1000 టోర్నీగా గుర్తింపు ఉంది. బ్యాడ్మింటన్ రాకెట్ చేతపట్టిన క్రీడాకారులంతా తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారి ఆల్-ఇంగ్లండ్ టైటిల్ నెగ్గితే జన్మధన్యమైనట్లుగానే భావిస్తారు.

ఆల్-ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్ కు చెందిన ప్రకాశ్ పడుకోన్, పుల్లెల గోపీచంద్ మాత్రమే గత వందేళ్లకాలంలో విజేతలుగా నిలువగలిగారు. అంతటి ప్రతిష్టాత్మక టోర్నీలో రెండేళ్ల క్రితమే తొలిసారిగా సింగిల్స్ ఫైనల్స్ చేరిన లక్ష్యసేన్ అనుభవం లేమితో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అయితే..గత రెండేళ్లుగా ..ప్రపంచ బ్యాడ్మింటన్ సర్క్యూట్ లో భాగంగా జరిగిన ఎనిమిది అంతర్జాతీయ టోర్నీలలో మొదటి రెండోరౌండ్ కే నిష్క్ర్రమించాల్సి వచ్చింది. ఏకంగా ఏడుటోర్నీల తొలిరౌండ్లోనే పరాజయాలు చవిచూడటం ద్వారా ఆత్మవిశ్వాసం కోల్పోయాడు.

అయితే..2024- ఆల్ - ఇంగ్లండ్ టోర్నీలో మాత్రం స్థాయికి తగ్గట్టుగా ఆడుతూ టైటిల్ కు రెండడుగుల దూరంలో నిలువగలిగాడు.

సెమీస్ లో తొలిగేమ్ ను 20-22తో చేజార్చుకొని..రెండో గేమ్ ఓ దశలో 14-16తో వెనుక బడిన లక్ష్య తుదివరకూ పోరాడి 20-22, 21-16, 21-19తో సంచలన విజయం సాధించాడు.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన నిర్ణయాత్మక ఆఖరిగేమ్ లో ఇద్దరు ఆటగాళ్లు 19-19 పాయింట్లతో సమఉజ్జీలుగా నిలిచిన తరుణంలో లక్ష్య వరుసగా 2 పాయింట్లు సాధించడం ద్వారా విజేతగా నిలిచాడు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే రెండోసారి సెమీస్ చేరిన భారత తొలి ప్లేయర్ గా రికార్డు నెలకొల్పాడు.

చైనాకు చెందిన రెండోసీడ్ ఆటగాడు షి యు క్వీ, ఇండోనీసియా ఆటగాడు జోనాథన్ క్రిస్టీల నడుమ జరిగే రెండో సెమీస్ పోరులో నెగ్గిన ఆటగాడితో లక్ష్య తలపడాల్సి ఉంది.

పురుషుల డబుల్స్ లో చుక్కెదురు....

పురుషుల డబుల్స్ బరిలోకి ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ హోదాతో పోటీకి దిగిన భారతజోడీకి రెండోరౌండ్లోనే అనుకోని పరాజయం ఎదురయ్యింది. భారత్ కు టైటిల్ సాధించి పెట్టడం ఖాయమని భావించిన సాయిసాత్విక్- చిరాగ్ షెట్టిల జోడీ 16-21, 15-21తో ఇండోనీసియా జోడీ షోహిబుల్ ఫిక్రీ- బగాస్ మౌలానా చేతిలో పరాజయం పొందడం ద్వారా టోర్నీ నుంచి నిష్క్ర్రమించారు.

మిగిలిన విభాగాలలో భారత క్రీడాకారుల నిష్క్ర్రమణ పూర్తి కావడంతో..ఏదో ఒక పతకం సాధించే భారం సింగిల్స్ స్టార్ , 22 సంవత్సరాల లక్ష్యసేన్ పైన పడింది.

First Published:  16 March 2024 6:18 PM IST
Next Story