Telugu Global
Sports

ప్రపంచ చెస్ సంయుక్త ఆధిక్యంలో భారత యువగ్రాండ్ మాస్టర్!

ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ లో భారత యువగ్రాండ్ మాస్టర్లు పుంజుకొన్నారు. 17 ఏళ్ల గుకేశ్ 6వ రౌండ్ పోటీలు ముగిసే సమయానికి 4 పాయింట్లతో సంయుక్త ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.

ప్రపంచ చెస్ సంయుక్త ఆధిక్యంలో భారత యువగ్రాండ్ మాస్టర్!
X

ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ లో భారత యువగ్రాండ్ మాస్టర్లు పుంజుకొన్నారు. 17 ఏళ్ల గుకేశ్ 6వ రౌండ్ పోటీలు ముగిసే సమయానికి 4 పాయింట్లతో సంయుక్త ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.

కెనడాలోని టొరాంటో వేదికగా జరుగుతున్న 2024- ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ 5, 6వ రౌండ్ పోటీలలో భారత యువ గ్రాండ్ మాస్టర్ల జోడీ గుకేశ్, ప్రజ్ఞానంద్ కీలక విజయాలతో పుంజుకొన్నారు.

మహిళల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో భారత గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, వైశాలీలకు పరాజయాల దెబ్బ తగిలింది.

గుకేశ్ గ్రాండ్ షో....

మొదటి నాలుగు రౌండ్లలో స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయిన భారత యువగ్రాండ్ మాస్టర్ల జోడీ గుకేశ్, ప్రజ్ఞానంద్ ఓ రోజు విరామం తరువాత జరిగిన 5, 6 రౌండ్లలో అదరగొట్టారు.

6వ రౌండ్ పోటీలు ముగిసే నాటికి హాట్ ఫేవరెట్ ఇయాన్ నెపిమోనిచ్ తో కలసి 17 సంవత్సరాల గుకేశ్ సంయుక్త ఆధిక్యంలో నిలిచాడు. మొత్తం 14 రౌండ్ల ఈ టోర్నీ మొదటి ఆరురౌండ్ల మ్యాచ్ ల్లోనే నెపిమోనిచ్, గుకేశ్ 4 పాయింట్లు చొప్పున సాధించడం ద్వారా లీగ్ టేబుల్ సంయుక్త టాపర్లుగా నిలిచారు.

6వ రౌండ్ పోరులో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద్.. అజర్ బెజాన్ గ్రాండ్మాస్టర్ నిజత్ అబసోవ్ పై నెగ్గడం ద్వారా తన పాయింట్ల సంఖ్యను 3.5కు పెంచుకోగలిగాడు.

మరో ఆటగాడు విదిత్ గుజరాతీ సైతం 6వ రౌండ్ పోరులో ఫ్రెంచ్ గ్రాండ్మాస్టర్ అలీ రెజా ఆటకట్టించాడు.

అమెరికన్ గ్రాండ్ మాస్టర్ హికారు నకమురాతో జరిగిన 6వ గేమ్ ను గుకేశ్ డ్రాగా ముగించడం ద్వారా సంయుక్త ఆధిక్యంలో నిలువగలిగాడు. అమెరికన్ టాప్ సీడ్ స్టార్ ఫాబియానో కరునాతో జరిగిన గేమ్ ను ఇయాన్ నెపమోనిచ్ డ్రాగా ముగించాడు.

మొత్తం మీద 14 రౌండ్ల ఈ టోర్నీ 6వ గేమ్ లో మాత్రం భారత్ కు చెందిన ముగ్గురు యువగ్రాండాస్మటర్లూ అజేయంగా నిలవడం విశేషం. వరుస పరాజయాలు చవిచూసిన అలీరాజా, అబసోవ్ ల పోటీ దాదాపుగా ముగిసినట్లే.

మహిళల విభాగంలో....

మొత్తం ఎనిమిదిమంది మహిళా గ్రాండ్మాస్టర్లు తలపడుతున్న చాలెంజర్ రేస్ 6వ గేమ్ లో భారత గ్రాండ్మాస్టర్ల జోడీ కోనేరు హంపి, వైశాలిలకు చుక్కెదురయ్యింది.

6వ గేమ్ లో రష్యాకు చెందిన కాటరీనా లాగ్నో చేతిలో వైశాలి పరాజయం చవిచూసింది.

మరో 6వ గేమ్ లో భారత సీనియర్ స్టార్ కోనేరు హంపికి చైనా గ్రాండ్మాస్టర్ టింగ్జీ లీ చెక్ చెప్పింది. బల్గేరియాకు చెందిన నూర్గుల్ సాలిమోవా- అలెగ్జాండ్రా గోర్యచికినా పోరు హోరాహోరీగా సాగింది.

చైనా గ్రాండ్ మాస్టర్ జోగ్యీ టాన్ 6వ గేమ్ లో ఉక్రెయిన్ గ్రాండ్మాస్టర్ అన్నా ముజిచిక్ ను చిత్తు చేసింది. మొదటి 6 గేమ్ ల్లోనే టాన్ 4.5 పాయింట్లు సాధించడం ద్వారా తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.

లాగ్నో 3.5 పాయింట్లతో రెండు, వైశాలీ, సాలిమోవ్ 2.5 పాయింట్లతో లీగ్ టేబుల్ 3వ స్థానంలో కొనసాగుతున్నారు.

First Published:  11 April 2024 4:52 PM IST
Next Story