Telugu Global
Sports

'విడాకుల తుపాను'లో భారత వైస్ కెప్టెన్!

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే భారత వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా విడాకుల తుపానులో చిక్కుకొన్నాడు.

విడాకుల తుపానులో భారత వైస్ కెప్టెన్!
X

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే భారత వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా విడాకుల తుపానులో చిక్కుకొన్నాడు.

భారత డాషింగ్ ఆల్ రౌండర్, టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే జట్టు వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యాను ఇప్పట్లో కష్టాలు వీడేలా ఏమాత్రం కనిపించడం లేదు. ప్రస్తుత ఐపీఎల్ లో హార్థిక్ పాండ్యా నాయకత్వంలో పోటీకి దిగిన ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ చిత్తుగా ఓడి 10 జట్ల లీగ్ టేబుల్ ఆఖరిస్థానానికి పడిపోయిన కొద్దిరోజుల వ్యవధిలోనే.. విడాకుల తుపానులో చిక్కుకొన్నాడు.

ప్రపంచకప్ ప్రారంభానికి ముందే...

వెస్టిండీస్, అమెరికా క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో ..జూన్ మొదటివారంలో ప్రారంభంకానున్న 2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టుకు హార్థిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఒకదశలో రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టులో పాండ్యాకు చోటు దక్కడమే కష్టమని అందరూ భావించారు. అయితే..సెలెక్షన్ కమిటీలోని ఇద్దరు సభ్యులు గట్టిగా పట్టుబట్టడంతో పాండ్యాకు భారతజట్టులో చోటు కల్పించడమే కాదు..ఏకంగా వైస్ కెప్టెన్సీ సైతం అప్పజెప్పారు.

ఐపీఎల్ లో ఘోరవైఫల్యం...

2022 ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ ను విజేతగా నిలిపిన కెప్టెన్ హార్థిక్ పాండ్యా..2024 సీజన్లో ముంబైజట్టు పగ్గాలు చేపట్టాడు. ఆల్ రౌండర్ గా, కెప్టెన్ గా పాండ్యా ఘోరంగా విఫలయ్యాడు. గతంలో ఎన్నడూలేని విధంగా ముంబైజట్టు 14 రౌండ్లలో 4 విజయాలు, 10 పరాజయాలతో 8 పాయింట్లు మాత్రమే సాధించడం ద్వారా పాతాళానికి పడిపోయింది.

ప్రపంచకప్ కోసం భారతజట్టులోని తొలి బ్యాచ్ లో సభ్యుడిగా బయలుదేరాల్సిన సమయంలో హార్థిక్ పాండ్యాతో అతని భార్య నటాషాతో విడాకుల దుమారం లేచింది.

సెర్బియాకు చెందిన నటాషాతో సహజీవనం చేయటం ద్వారా ఓ మగబిడ్డకు తండ్రిగా మారిన తరువాతే పాండ్యా వివాహితుడుగా మారాడు. అయితే..సోషల్ మీడియాలో

అత్యంత చురుకుగా ఉండే నటాషా తన పేరులోని పాండ్యా పదాన్ని తొలగించి మరో పోస్ట్ ఉంచడంతో...విడాకుల వార్త గుప్పుమంది.

ఆస్తిలో 70 శాతం భరణంగా ఇవ్వాల్సిందే...

ప్రస్తుతం హార్థిక్ పాండ్యా- నటాషా స్టాన్ కోవిచ్ ల విడాకుల వార్త సోషల్ మీడియాలో ప్రధానంగా చక్కర్లు కొడుతోంది. దీనికితోడు నటాషా, పాండ్యాల ప్రవర్తన సైతం అనుమానాలను బలపరిచేదిగా ఉండడంతో..నిప్పులేనిదే పొగరాదని అందరూ అనుమానిస్తున్నారు. ఒకవేళ హార్థిక్ పాండ్యా విడాకులే ఇవ్వాల్సి వస్తే..తాను సంపాదించిన 100 కోట్ల రూపాయలకు పైగా ఆస్తిలో 70 శాతాన్ని తన కుమారుడికి, నటాషాకు భరణంగా చెల్లించక తప్పదని అంటున్నారు.

ప్రపంచకప్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే హార్థిక్ పాండ్యా..విడాకుల దుమారంలో చిక్కుకోడం రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టుకు మాత్రమే కాదు..వ్యక్తిగతంగా హార్థిక్ పాండ్యాకు సైతం చేసే నష్టం అంతాఇంతా కాదు.

ప్రపంచకప్ కు బయలుదేరిన భారత తొలి బ్యాచ్ లో హార్థిక్ పాండ్యా సైతం సభ్యుడిగా ఉన్నాడు. అయితే..కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, శివం దూబే, కుల్దీప్ యాదవ్ మాత్రమే విమానాశ్రయంలో కనిపించడం, హార్థిక్ పాండ్యా ఆచూకీ లేకపోడం కూడా విడాకులవార్తకు బలం చేకూర్చుతోంది.

ప్రపంచకప్ కు సన్నాహకంగా భారతజట్టు ఆడాల్సిన తొలి సన్నాహక మ్యాచ్ కు సైతం హార్థిక్ పాండ్యా అందుబాటులో ఉండబోడన్న వార్త సైతం బయటకు వచ్చింది.

ఫిట్ నెస్ సమస్యలకు తోడు..వ్యక్తిగత సమస్యలు సైతం సతమతమవుతున్న హార్థిక్ పాండ్యా లాంటి నిలకడలేని, నమ్మదగని ఆల్ రౌండర్ భారతజట్టుకు అసలు అవసరమా? అన్న ప్రశ్న కూడా క్రికెట్ వర్గాలలో చక్కర్లు కొడుతోంది.

First Published:  26 May 2024 8:21 AM GMT
Next Story