Telugu Global
Sports

ఆఖరి టీ-20లో భారత్ షో, 4-1తో సిరీస్ కైవసం!

ఆస్ట్ర్రేలియాతో జరిగిన పాంచ్ పటాకా టీ-20 సిరీస్ ను టాప్ ర్యాంకర్ భారత్ 4-1తో గెలుచుకొంది. బెంగళూరు వేదికగా జరిగిన లోస్కోరింగ్ వార్ లో భారత్ 6 పరుగుల విజయం నమోదు చేసింది.

ఆఖరి టీ-20లో భారత్ షో, 4-1తో సిరీస్ కైవసం!
X

ఆస్ట్ర్రేలియాతో జరిగిన పాంచ్ పటాకా టీ-20 సిరీస్ ను టాప్ ర్యాంకర్ భారత్ 4-1తో గెలుచుకొంది. బెంగళూరు వేదికగా జరిగిన లోస్కోరింగ్ వార్ లో భారత్ 6 పరుగుల విజయం నమోదు చేసింది......

2024- టీ-20 ప్రపంచకప్ కు మాజీ చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్ సిరీస్ విజయంతో సన్నాహాలను ప్రారంభించింది. 4వ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాతో జరిగిన ఐదుమ్యాచ్ ల సిరీస్ ను 4-1తో సొంతం చేసుకొంది.

అక్షర్ ఆల్ రౌండ్ షో......

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన సిరీస్ లోని ఆఖరి, 5వ మ్యాచ్ కు అంతగా ప్రాధాన్యం లేకపోయినా రెండుజట్లూ విజయం సాధించాలన్న పట్టుదలతో బరిలో నిలిచాయి. దీనికి తోడు మ్యాచ్ కోసం సిద్ధం చేసిన పిచ్ బౌలర్లకు అనువుగా ఉండడంతో పోరు ఆఖరి బంతి వరకూ నువ్వానేనా అన్నట్లుగా సాగింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ ను 20 ఓవర్లలో 160 పరుగులకే కట్టడి చేయడంలో కంగారూబౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, రుతురాజ్, కెప్టెన్ సూర్యకుమార్, వీరబాదుడు రింకూ సింగ్ విఫలమైనా...శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ల బ్యాటింగ్ జోరుతో భారత్ ప్రత్యర్థి ఎదుట 161 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచగలిగింది.

స్ట్ర్రోక్ ప్లేకు అంతగా అనువుకాని పిచ్ పైన శ్రేయస్ అయ్యర్ సమయోచితంగా ఆడి 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు, వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ 24, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 21 బంతుల్లో 2 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 31 పరుగులు సాధించారు. కంగారూ బౌలర్లలో మొత్తం ఐదుగురు బౌలర్లూ వికెట్లు పడగొట్టగలిగారు.

ఆస్ట్ర్రేలియాకు భారత్ కళ్లెం....

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 161 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన కంగారూజట్టును భారత బౌలర్లు కట్టడి చేయగలిగారు. బెన్ మెక్ డెర్మాట్ 36 బంతుల్లో 5 సిక్సర్లతో 54 పరుగులు సాధించినా ప్రయోజనం లేకపోయింది.

లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్, లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్, సీమర్ ముకేశ్ కుమార్ అద్భుతంగా బౌల్ చేసి కంగారూలకు పగ్గాలు వేయగలిగారు. ఆట 17 ఓవర్లలో వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా స్వింగ్ బౌలర్ ముకేశ్ కుమార్ మ్యాచ్ ను మలుపు తిప్పాడు. అక్షర్ పటేల్ తన కోటా 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.

మ్యాచ్ నెగ్గాలంటే ఆట ఆఖరి ఓవర్ 6 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన ఆస్ట్ర్రేలియాను పేసర్ అర్షదీప్ సింగ్ కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ఓటమి పాలు చేశాడు.

తన కోటా మొదటి 3 ఓవర్లలో 37 పరుగులిచ్చిన అర్షదీప్..ఆఖరి ఓవర్ ఆరు బంతుల్లో మూడు పరుగులు మాత్రమే ఇవ్వడం ద్వారా తనజట్టుకు 6 పరుగుల విజయం అందించాడు.

ఆస్ట్ర్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

మొత్తం 5 మ్యాచ్ ల సిరీస్ లో 9 వికెట్లు పడగొట్టిన లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.

ఆస్ట్ర్రేలియాపై 19వ విజయం..

ఈ మ్యాచ్ లో నెగ్గడం ద్వారా ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా భారత్ 19వ విజయం నమోదు చేయగలిగింది. టీ-20 చరిత్రలోనే అత్యధికంగా 137 విజయాలు సాధించిన జట్టుగా భారత్ తన ప్రపంచ రికార్డును తానే సవరించుకోగలిగింది.

2006లో టీ-20ల్లో తన తొలి అంతర్జాతీయమ్యాచ్ ఆడిన భారత్..ప్రస్తుత 5 మ్యాచ్ లసిరీస్ వరకూ 214 టీ-20ల్లో 137 విజయాలు, 67 పరాజయాలు, ఓ టై సాధించడం ద్వారా అగ్రస్థానంలో నిలిచింది. భారతజట్టు 63.84 విజయశాతాన్ని నమోదు చేయగలిగింది.

పాకిస్థాన్ జట్టు 226 టీ-20ల్లో 135 విజయాలు, న్యూజిలాండ్ 200 మ్యాచ్ ల్లో 102 విజయాలు, ఆస్ట్ర్రేలియా 181 మ్యాచ్ ల్లో 95 విజయాలు, దక్షిణాఫ్రికా 171 మ్యాచ్ ల్లో 95 విజయాల రికార్డులతో ఉన్నాయి.

ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా ఇప్పటి వరకూ 30 మ్యాచ్ లు ఆడిన భారత్ 19 విజయాలు, 11 పరాజయాల రికార్డుతో ఉంది. ఈనెల 10నుంచి దక్షిణాఫ్రికా గడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగనున్న తీన్మార్ టీ-20 సిరీస్ లో భారత్ పోటీపడనుంది.

First Published:  4 Dec 2023 7:00 AM IST
Next Story