Telugu Global
Sports

ప్రపంచ చెస్ లో భారత గ్రాండ్ మాస్టర్ల సంచలనం!

ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత యువగ్రాండ్ మాస్టర్ల త్రయం సంచలనం సృష్టించారు.

ప్రపంచ చెస్ లో భారత గ్రాండ్ మాస్టర్ల సంచలనం!
X

ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత యువగ్రాండ్ మాస్టర్ల త్రయం సంచలనం సృష్టించారు. 2024 క్యాండిడేట్స్ టైటిల్ పోరుకు తొలిసారిగా ముగ్గురు అర్హత సాధించడం ద్వారా అరుదైన రికార్డు నెలకొల్పారు.

కెనడాలోని టొరాంటో వేదికగా 2024లో జరిగే ప్రపంచ క్యాండిడేట్స్ టైటిల్ పోరుకు తొలిసారిగా భారత్ కు చెందిన ముగ్గురు యువగ్రాండ్ మాస్టర్లు అర్హత సంపాదించారు.

ప్రస్తుత ప్రపంచ చాంపియన్, గ్రాండ్ మాస్టర్ డింగ్ లీరెన్ తో తలపడటానికి ప్రపంచ చెస్ సమాఖ్య ఎనిమిదిమంది ప్రపంచ మేటి గ్రాండ్ మాస్టర్ల నడుమ అంతర్జాతీయ చెస్ సమాఖ్య 2024 క్యాండిడేట్స్ టోర్నీని నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది.

ఏప్రిల్ 2 నుంచి 25 వరకూ....

2024- ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టోర్నీని 2024 ఏప్రిల్ 2 నుంచి 25 వరకూ టొరాటో నగరంలో నిర్వహించడానికి ఫీడే రంగం సిద్ధంచేసింది. ఉజ్ బెకిస్థాన్ లోని సమర్ ఖండ్ వేదికగా నిర్వహించిన ఫిడే ప్రపంచ బ్లిట్జ్ టోర్నీలో రాణించడం ద్వారా భారత యువగ్రాండ్ మాస్టర్ డీ. గుకేశ్.. క్యాండిడేట్స్ టోర్నీ ఆఖరి బెర్త్ ఖాయం చేసుకొన్నాడు.

ఈ టోర్నీకి అర్హత సాధించిన మొత్తం 8 మంది గ్రాండ్ మాస్టర్లలో ముగ్గురు భారత యువఆటగాళ్లు ఉండటం విశేషం. నెదర్లాండ్స్ గ్రాండ్ మాస్టర్ అనీశ్ గిరి క్యాండిడేట్స్ బెర్త్ ఖాయం చేసుకోడంలో విఫలమయ్యాడు.

2023- ప్రపంచకప్ చెస్ టోర్నీలో రన్నరప్ గా నిలవడం ద్వారా ప్రజ్ఞానంద్ అర్హత సాధించగా, మరో గ్రాండ్ మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతీ సైతం క్యాండిడేట్స్ టోర్నీ బెర్త్ సంపాదించగలిగాడు.

భారత చదరంగ చరిత్రలో ఇదే మొదటిసారి.....

ప్రపంచ క్యాండిడేట్స్ టోర్నీ ఆఖరి బెర్త్ కోసం భారత గ్రాండ్ మాస్టర్ గుకేశ్, డచ్ గ్రాండ్ మాస్టర్ అనీశ్ గిరీల నడుమ పోరు హోరాహోరీగా సాగింది. ప్రపంచ ర్యాపిడ్ టోర్నీ మొదటి మూడుస్థానాలలో నిలిచినా లేదా..సమర్ ఖండ్ వేదికగా జరిగిన ప్రపంచ బ్లిట్జ్ టోర్నీ విజేతగా నిలిచిన గ్రాండ్ మాస్టర్లకే బెర్త్ ఖాయమవుతుంది.

ఈ అవకాశాన్ని భారత నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ గుకేశ్ సద్వినియోగం చేసుకొని క్యాండిడేట్స్ టో్ర్నీలో పాల్గొనటానికి అర్హత సంపాదించగలిగాడు.

భారత చదరంగ చరిత్రలో ముగ్గురు గ్రాండ్ మాస్టర్లు ప్రపంచ క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించడం ఇదే మొదటిసారి.

8 మందితో రౌండ్ రాబిన్ లీగ్ పోరు....

క్యాండిడేట్స్ టైటిల్ పోరుకు అర్హత సాధించిన మొత్తం 8 మంది విఖ్యాత గ్రాండ్ మాస్టర్లలో ఇయాన్ నేపోమినియాచిట్చీ, ప్రజ్ఞానంద్, ఫేబియానో కరూనా, నిజత్ అబసోవ్, విదిత్ గుజరాతీ, హికారు నకమురా, అలీరెజా ఫిరోజా, గుకేశ్ ఉన్నారు.

మహిళా క్యాండిడేట్స్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ల జోడీ కోనేరు హంపి, వైశాలి రమేశ్ బాబు భారత్ తరపున అర్హత సాధించినవారిలో ఉన్నారు.

First Published:  31 Dec 2023 2:17 PM IST
Next Story