రెండో ఇన్నింగ్స్‌లో 400 దాటిన ఇండియా స్కోర్
విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ.. 468 పరుగుల ఆదిక్యంలో భారత్
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లో జరుగుతోన్న మొదటి టెస్ట్ మూడో రోజు (ఆదివారం) టీమిండియా ఆదిపత్యం కొనసాగుతోంది. ఓవర్‌నైట్ స్కోర్ 172 వద్ద బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు మరో 29 పరుగులు జోడించిన తర్వాత మొదటి వికెట్ కోల్పోయింది. టీమ్ స్కోర్ 201 పరుగుల వద్ద ఓపెనర్ కేఎల్ రాహుల్ స్టార్క్ బౌలింగ్ లో క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన దేవదత్ పడిక్కల్ 25 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. 297 బంతుల్లో మూడు సిక్సర్లు, 15 ఫోర్లతో 161 పరుగులు చేసిన యశస్వీ జైస్వాల్ మార్ష్ బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్ వికెట్లు వెంటవెంటనే పడిపోయాయి. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. టెస్టుల్లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతోన్న కోహ్లీ పెర్త్ టెస్ట్ లో టచ్ లోకి వచ్చాడు. 117 బంతుల్లో సిక్స్, నాలుగు ఫోర్లతో 68 పరుగులతో అజేయంగా ఉన్నాడు. క్రీజ్ లో కుదురుకున్నట్టు కనిపించిన వాషింగ్టన్ సుందర్ ను నాథన్ లయన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. సుందర్ 29 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. నితీశ్ కుమార్ రెడ్డి ఏడు బంతుల్లో సిక్స్ సాయంతో పది పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో లయన్ రెండు, స్టార్క్, హాజెల్‌వుడ్, కమిన్స్, మార్ష్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. టీమిండియా 127 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 422 పరుగులు చేసింది. ఓవరాల్ గా ఆసీస్ పై 468 పరుగుల ఆదిక్యంలో ఉంది. ఆస్ట్రేలియా 1948 జూలై 27న నాలుగో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ పై మూడు వికెట్లు నష్టపోయి 404 పరుగులు చేసి ఆ మ్యాచ్ గెలుచుకుంది. నాలుగో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా హయ్యెస్ట్ చేజ్ చేసిన స్కోర్ ఇదే. ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ లో 2016 డిసెంబర్ 19న పాకిస్థాన్ జట్టు నాలుగో ఇన్నింగ్స్ లో 450 పరుగులు చేసింది. అయినా ఆ టెస్ట్ మ్యాచ్ ను పాకిస్థాన్ 39 పరుగుల తేడాతో ఓడిపోయింది.