Telugu Global
Sports

అండర్ -19 ప్రపంచకప్ లో భారత్ రికార్డు!

2024- జూనియర్ ( అండర్ -19 ) ప్రపంచకప్ ఫైనల్స్ కు డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుసగా ఐదోసారి చేరడం ద్వారా తన రికార్డును తానే అధిగమించింది.

అండర్ -19 ప్రపంచకప్ లో భారత్ రికార్డు!
X

2024- జూనియర్ ( అండర్ -19 ) ప్రపంచకప్ ఫైనల్స్ కు డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుసగా ఐదోసారి చేరడం ద్వారా తన రికార్డును తానే అధిగమించింది.

ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన తొలిసెమీఫైనల్లో భారత్ గట్టిపోటీ ఎదుర్కొని 2 వికెట్ల విజయంతో టైటిల్ సమరానికి అర్హత సాధించింది.

హోరాహోరీగా సెమీస్ సమరం...

గ్రూప్ లీగ్ దశ నుంచి సూపర్ -6 రౌండ్ వరకూ తిరుగులేని విజయాలు సాధిస్తూ సెమీస్ చేరిన హాట్ ఫేవరెట్ భారత్ కు దక్షిణాఫ్రికా అడుగడుగునా పోటీ ఇవ్వడంతో పోరు రసవత్తరంగా సాగింది.

బెనోని లోని విల్లోమూర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ సెమీస్ సమరంలో టాస్ నెగ్గిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోడానికి బదులుగా ఫీల్డింగ్ ఎంచుకొని గొప్పసాహసమే చేసింది.

ప్రస్తుత ప్రపంచకప్ లో సెమీస్ కు ముందు వరకూ ఆడిన మ్యాచ్ ల్లో ముందుగా బ్యాటింగ్ ఎంచుకోడం, భారీస్కోర్లు సాధించడం ద్వారా ప్రత్యర్థిజట్లను చిత్తు చేస్తూ వచ్చిన భారత్ సెమీస్ లో మాత్రం ఫీల్డింగ్ కు దిగడం ద్వారా తన బౌలర్ల సత్తాకు పరీక్ష పెట్టింది.

రాణించిన రాజ్ లింబానీ....

పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ తో ముందుగా బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది. సఫారీ బ్యాటర్లలో ప్రిటోరియస్ 102 బంతుల్లో 76 పరుగులు, రిచర్డ్ సెల్ట్స్ వానే 100 బంతుల్లో 64 పరుగులు, జేమ్స్ 19 బంతుల్లో 24, లూస్ 12 బంతుల్లో 23 పరుగుల స్కోర్లతో అజేయంగా నిలిచారు. దీంతో సఫారీజట్టు భారత ఎదుట 245 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. ప్రస్తుత ప్రపంచకప్ లో భారత్ ప్రత్యర్థిగా 200కు పైగా స్కోరు సాధించిన తొలిజట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది.

ఆఖరి 10 ఓవర్లలో సఫారీ బ్యాటర్లు 81 పరుగులు మాత్రమే చేయగలిగారు. భారత బౌలర్లలో స్వింగ్ బౌలర్ రాజ్ లింబానీ 3 వికెట్లు ముషీర్ ఖాన్ 2 వికెట్లు,

సచిన్- సహ్రాన్ ల పోరాటం...

మ్యాచ్ నెగ్గాలంటే 50 ఓవర్లలో 245 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్ కు ప్రారంభ ఓవర్లలోనే దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలిబంతికే భారత ఓపెనర్ ఆదర్శ్ సింగ్ ను సఫారీ స్టార్ ఫాస్ట్ బౌలర్ క్వెనా మపాకా పెవీలియన్ దారి పట్టించాడు.

ఆ వెంటనే వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన ముషీర్ ఖాన్ ను మరో ఫాస్ట్ బౌలర్ లూస్ పడగొట్టాడు. మొదటి 12 ఓవర్లు ముగిసే సమయానికే భారత్ 32 పరుగులకే 4 వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలుపెట్టింది.

అయితే..కెప్టెన్ ఉదయ్ సహ్రాన్- మిడిలార్డర్ బ్యాటర్ సచిన్ దాస్ 5వ వికెట్ కు 171 పరుగుల కీలక భాగస్వామ్యంతో భారత్ ను మరోసారి ఆదుకొన్నారు. నేపాల్ తో జరిగిన సూపర్ -6 ఆఖరి రౌండ్ మ్యాచ్ లో సెంచరీలు బాదిన సచిన్, సహ్రాన్ జోడీ సెమీస్ లో మాత్రం హాఫ్ సెంచరీలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సచిన్ దాస్ 47 బంతుల్లో తన అర్ధశతకాన్ని పూర్తి చేస్తే..సహ్రాన్ 88 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగలిగాడు.

సచిన్ దాస్ 95 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్ తో 96 పరుగులు , ఉదయ్ సహ్రాన్ 124 బంతుల్లో 6 ఫోర్లతో 81 పరుగులు సాధించడంతో భారత్ మరో 7 బంతులు మిగిలిఉండగానే విజయలక్ష్యాన్ని చేరుకోగలిగింది. వరుసగా ఐదోసారి ప్రపంచకప్ ఫైనల్స్ చేరుకోడం ద్వారా వారేవ్వా అనిపించుకొంది.

వరుసగా ఐదోసారి.....

అండర్ -19 ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా ఇప్పటికే ఐదు టైటిల్స్ సాధించిన భారత్..వరుసగా ఐదోసారి ఫైనల్స్ చేరడం ద్వారా తన రికార్డును తానే అధిగమించగలిగింది. భారత కెప్టెన్ ఉదయ్ సహ్రాన్ 389 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా నిలిచాడు.

ఆస్ట్ర్రేలియా- పాకిస్థాన్ జట్ల రెండో సెమీఫైనల్లో నెగ్గినజట్టుతో టైటిల్ పోరులో భారత్ తలపడనుంది. టైటిల్ పోరును ఫిబ్రవరి 11న నిర్వహిస్తారు.

First Published:  7 Feb 2024 12:00 PM IST
Next Story