Telugu Global
Sports

పేసర్ల అడ్డాలో భారతపేసర్ల గడబిడ!

ఫాస్ట్ బౌలర్ల అడ్డా సెంచూరియన్ పార్క్ లో భారత పేస్ బౌలర్లు తేలిపోయారు. దక్షిణాఫ్రికాతో తొలిటెస్టు రెండోరోజుఆటలో భారీగా పరుగులు సమర్పించుకొన్నారు.

పేసర్ల అడ్డాలో భారతపేసర్ల గడబిడ!
X

ఫాస్ట్ బౌలర్ల అడ్డా సెంచూరియన్ పార్క్ లో భారత పేస్ బౌలర్లు తేలిపోయారు. దక్షిణాఫ్రికాతో తొలిటెస్టు రెండోరోజుఆటలో భారీగా పరుగులు సమర్పించుకొన్నారు...

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో సఫారీగడ్డపై ప్రారంభమైన రెండుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టు మొదటి రెండురోజుల ఆటలో భారతజట్టు స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయింది.

జోహెన్స్ బర్గ్ లోని సెంచూరియన్ పార్క్ వేదికగా ప్రారంభమైన ఐదురోజుల టెస్టు తొలిరోజుఆటలో బ్యాటర్లు, రెండోరోజుఆటలో బౌలర్లు తేలిపోడంతో...ఆతిథ్య సఫారీజట్టు పట్టు బిగించడానికి రంగం సిద్ధం చేసుకొంది.

భారత్ ను తొలిఇన్నింగ్స్ లో 245 పరుగులకే పరిమితం చేసిన దక్షిణాఫ్రికా రెండోరోజుఆట ముగిసే సమయానికి తన తొలిఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 256 పరుగుల స్కోరు నమోదు చేసింది.

ఓపెనర్ డీన్ ఎల్గర్ 140, ఆల్ రౌండర్ మార్కో జెన్సన్ 3 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.

రాహుల్ అరుదైన శతకం!

అంతకుముందు..ఓవర్ నైట్ స్కోరుతో 8 వికెట్లకు 208 పరుగుల స్కోరుతో రెండోరోజుఆటను కొనసాగించిన భారత్ 245 పరుగుల స్కోరుకు ఆలౌటయ్యింది.

వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ 137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 101 పరుగులతో సెంచరీ సాధించాడు. కేవలం రాహుల్ బ్యాటింగ్ కారణంగానే భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.

సెంచూరియన్ పార్క్ వేదికగా బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదిన అరుదైన బ్యాటర్ గా రాహుల్ నిలిచాడు. 2021 సిరీస్ లో భాగంగా జరిగిన టెస్టులో భారత ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగిన సమయంలో సెంచరీ బాదిన రాహుల్..ప్రస్తుత సిరీస్ లో 6వ నంబర్ స్థానంలో బ్యాటింగ్ కు దిగడం ద్వారా శతకం నమోదు చేయగలిగాడు.

31 సంవత్సరాల రాహుల్ కెరియర్ లో ఇది 8వ శతకంగా నమోదయ్యింది. తొమ్మిదేళ్ల క్రితం మెల్బోర్న్ వేదికగా టెస్టు అరంగేట్రం చేసిన రాహుల్ తన 48వ టెస్టులో 8వ శతకం సాధించగలిగాడు.

వికెట్ కీపర్ గా 6వ నంబర్ స్థానంలో సెంచరీ సాధించిన భారత మూడో ప్లేయర్ గా రాహుల్ నిలిచాడు. గతంలో రిషభ్ పంత్ సాధించిన రికార్డును రాహుల్ సమం చేయగలిగాడు.

దక్షిణాఫ్రికాపై రెండు శతకాలు బాదిన ఐదుగురు బ్యాటర్లలో రాహుల్ ఒకడిగా నిలిచాడు. దక్షిణాఫ్రికాపై అత్యధికంగా 5 సెంచరీలు సాధించిన రికార్డు మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉంది. విరాట్ కొహ్లీకి సైతం రెండు సెంచరీలు మాత్రమే ఉన్నాయి.

రిటైర్మెంట్ సిరీస్ లో ఎల్గర్ షో...

భారత్ ను 245 పరుగులకే ఆలౌట్ చేసిన సఫారీజట్టు తన తొలిఇన్నింగ్స్ ను వెటరన్ ఓపెనర్ డీన్ ఎల్గర్- ఎడెన్ మర్కరమ్ లతో మొదలు పెట్టింది. మర్కరమ్ ను 5 పరుగుల స్కోరుకే సిరాజ్ పడగొట్టినా..రెండో వికెట్ కు ఎల్గర్- టోనీ డీ జోర్జ్ కీలక భాగస్వామ్యంతో తమజట్టుకు గట్టి పునాది వేశారు.

తన కెరియర్ లో ఇదే ఆఖరి సిరీస్ గా రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ ఓపెనర్ డీన్ ఎల్గర్ అలవోకగా భారత పేసర్లను ఎదుర్కొంటూ పరుగుల మోత మోగించాడు.

గత తప్పిన భారత బౌలర్లను చీల్చిచెండాడు. ప్రధానంగా ఓపెనింగ్ బౌలర్ సిరాజ్, యువ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ లు చేతికి ఎముకలేదన్నట్లుగా పరుగులు సమర్పించుకొన్నారు.

యువఆటగాడు టోనీ 28, కీగాన్ పీటర్సన్ 2 పరుగుల స్కోర్లకే వెనుదిరిగినా మిడిలార్డర్ ఆటగాడు డేవిడ్ బేడింగ్ హామ్ 56 పరుగులతో భారత బౌలర్లను నిలువరించాడు.

టెస్టు అరంగేట్రం మ్యాచ్ లోనే బేడింగ్ హామ్ 87 బంతుల్లో 8 బౌండ్రీలు, 2 సిక్సర్లతో అర్ధశతకం బాదాడు. మరోవైపు..డీన్ ఎల్గర్ 19 బౌండ్రీలతో తన 14 టెస్టు శతకం పూర్తి చేయగలిగాడు.

రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఎల్గర్ 211 బంతుల్లో 23 ఫోర్లతో 140 పరుగుల అజేయ స్కోరు సాధించాడు. దీంతో సఫారీజట్టు 5 వికెట్లకు 256 పరుగులు చేయడం ద్వారా 11 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆధిక్యంతో నిలిచింది.

భారత బౌలర్లలో బుమ్రా ఒక్కడే కుదురుగా బౌలింగ్ చేయగలిగాడు. మిగిలిన ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు విఫలమయ్యారు. స్పిన్నర్ అశ్విన్ పొదుపుగా బౌల్ చేసినా వికెట్ పడగొట్టలేకపోయాడు.

సిరాజ్, బుమ్రా చెరో 2 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ ఒక వికెట్ పడగొట్టారు.

రెండుజట్లకూ ఈరోజు జరిగే మూడోరోజు ఆట కీలకం కానుంది. భారత్ టెస్టు మ్యాచ్ నెగ్గాలంటే దక్షిణాఫ్రికా చివరి 5 వికెట్లను సాధ్యమైనంత తక్కువ స్కోరుకే పడగొట్టి తీరాలి.

ఆతిథ్య దక్షిణాఫ్రికా తన స్కోరుకు మరో 150కి పైగా పరుగులు చేర్చుకోగలిగితే..మ్యాచ్ పై పట్టు బిగించే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ బౌలింగ్ కు అత్యంత అనువుగా ఉన్న సెంచూరియన్ పార్క్ బౌన్సీ పిచ్ ను భారత పేసర్లు సద్వినియోగం చేసుకోలేకపోడంతో దారుణంగా విఫలం కావడం రెండోరోజుఆటలో విశేషం.

First Published:  28 Dec 2023 8:30 AM IST
Next Story