ఒలింపిక్స్ హాకీలో భారత్ కు కాంస్యం!
పారిస్ ఒలింపిక్స్ హాకీలో భారత్ కాంస్య పతకం గెలుచుకొంది. స్పెయిన్ తో జరిగిన పోరులో భారత్ విజేతగా నిలిచింది.
పారిస్ ఒలింపిక్స్ హాకీలో భారత్ కాంస్య పతకం గెలుచుకొంది. స్పెయిన్ తో జరిగిన పోరులో భారత్ విజేతగా నిలిచింది.
ఒలింపిక్స్ చరిత్రలోనే ఎనిమిదిసార్లు బంగారు పతకాలు సాధించిన భారత్..ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో సైతం కాంస్య పతకంతో సరిపెట్టుకొంది. 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం నెగ్గిన భారత్..వరుసగా రెండోసారి కంచు మోత మోగిచింది.
వీడ్కోలు పోరులో శ్రీజేశ్ షో...
సెమీఫైనల్లో జర్మనీచేతిలో ఎదురైన 3-2 గోల్స్ ఓటమి నుంచి తేరుకొన్న భారత్ ..కాంస్య పతకం కోసం స్పెయిన్ తో జరిగిన పోరులో 2-1 గోల్స్ తో విజేతగా నిలిచింది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్'ఇండియన్ హాకీ వాల్' శ్రీజేశ్ అద్భుతంగా రాణించడం ద్వారా తమజట్టు విజయంలో ప్రధాన పాత్ర వహించారు.
52 సంవత్సరాల విరామం తరువాత తొలి కాంస్య పతకం నెగ్గిన భారత్..ఆ తరువాత మూడేళ్లలోనే మరో కాంస్య పతకం సాధించడం ఓ అరుదైన రికార్డుగా నిలిచిపోతుంది.
గ్రూప్ లీగ్ నుంచి బ్రాంజ్ మెడల్ మ్యాచ్ వరకూ భారత జయాపజయాలలో గోల్ కీపర్ శ్రీజేశ్ ప్రధానపాత్ర వహించాడు. 36 సంవత్సరాల శ్రీజేశ్ ప్రస్తుత ఒలింపిక్స్ తో రిటైర్ కానున్నట్లు గతంలోనే ప్రకటించాడు.
స్పెయిన్ తో కాంస్య పతకం కోసం జరిగిన పోరు ఆఖరి క్వార్టర్ లో మూడు పెనాల్టీ కార్నర్ లను అడ్డుకోడం ద్వారా శ్రీజేశ్ భారత విజయంలో ప్రధానపాత్ర వహించాడు.
స్పానిష్ కెప్టెన్ మార్క్ మిరాలెస్ పెనాల్టీ కార్నర్ల ద్వారా గోల్స్ సాధించడానికి చేసిన విశ్వప్రయత్నాలను భారత ఆల్ టైమ్ గ్రేట్ గోల్ కీపర్ వమ్ము చేశాడు.
భారత్ తరపున కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ల ద్వారా గోల్స్ సాధించడం ద్వారా తనవంతు పాత్ర నిర్వర్తించాడు.
వరుసగా 2 ఒలింపిక్స్ లో పతకాలు రెండోసారి...
1928 ఆమ్ స్టర్ డామ్ ఒలింపిక్స్ నుంచి 2020 టోక్యో ఒలింపిక్స్ వరకూ ఎనిమిది స్వర్ణాలతో సహా డజనుకు పైగా పతకాలు సాధించిన భారత్ కు..వరుసగా రెండు ఒలింపిక్స్ లో పతకాలు గెలుచుకోడం ఇది రెండోసారి.
1968, 1972 ఒలింపిక్స్ లో బ్యాక్ టు బ్యాక్ పతకాలు సాధించిన తరువాత..2020, 2024 ఒలింపిక్స్ లో సైతం భారత్ పతకాలు గెలుచుకోడం ద్వారా తనకు తానే సాటిగా నిలిచింది.
2024 పారిస్ ఒలింపిక్స్ గ్రూప్- బీ లీగ్ లో బెల్జియం చేతిలోనూ, సెమీస్ లో జర్మనీ చేతిలోనూ పరాజయాలు పొందినా..చివరకు భారత్ కాంస్య పతకంతో ఊపిరిపీల్చుకోగలిగింది.
హాకీ కాంస్యంతో భారత్ పతకాల సంఖ్య ప్రస్తుత ఒలింపిక్స్ లో 4కు చేరింది.
షూటింగ్ లో మూడు, హాకీలో ఒకటి కాంస్యాలతో భారత పతకాల పట్టిక 67వ స్థానంలో కొనసాగుతోంది.