టీ-20 ప్రపంచకప్ మార్కెట్లో భారత బ్రాండ్లు!
ఐసీసీ నిర్వహించే టీ-20 ప్రపంచకప్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా తొలిసారిగా భారత దేశవాళీ బ్రాండ్లు దర్శన మివ్వనున్నాయి.
ఐసీసీ నిర్వహించే టీ-20 ప్రపంచకప్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా తొలిసారిగా భారత దేశవాళీ బ్రాండ్లు దర్శన మివ్వనున్నాయి.
అంతర్జాతీయ క్రికెట్ మండలి ( ఐసీసీ ) ప్రతి రెండుసంవత్సరాలకు నిర్వహించే ప్రపంచకప్ క్రికెట్ పోటీల ప్రత్యక్ష ప్రసారాల సమయంలో బహుళజాతి సంస్థల ప్రకటనల హడావిడి అంతాఇంతా కాదు. మ్యాచ్ ప్రారంభానికి ముందు..బంతి బంతికీ, ఓవర్ ఓవర్ కూ నడుమ, మ్యాచ్ ముగిసిన తరువాత గ్లోబల్ బ్రాండ్ల హంగామా కనిపిస్తుంది.
అయితే..జూన్ 2 నుంచి 29 వరకూ జరిగే 2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో మాత్రం సీన్ మారనుంది.
850 మిలియన్ల వీక్షకుల ప్రపంచకప్..
అమెరికా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో నాలుగువారాలపాటు 55 మ్యాచ్ లుగా సాగే టీ-20 ప్రపంచకప్ ను ప్రపంచ వ్యాప్తంగా 204 దేశాలకు చెందిన 850 మిలియన్ల మంది ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించనున్నట్లు ప్రపంచకప్ బ్రాడ్ కాస్టర్లు అంచనా వేశారు.
ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోడానికి భారత దేశవాళీ బ్రాండ్లు అమూల్, నందిని సైతం ముందుకు వచ్చాయి. గత ప్రపంచకప్ టోర్నీలతో పోల్చుకొంటే ప్రకటనల రుసుము భారీగా తగ్గటం, కారుచౌకగా మారిపోడంతో అంతర్జాతీయ విపణిలోకి ప్రవేశించాలని భారత ప్రముఖ సంస్థలు ఉబలాట పడుతున్నాయి.
తొలిసారిగా 20 జట్లతో పోటీ....
ఐసీసీ టీ-20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా 20 దేశాలజట్లతో గ్రూపులీగ్ కమ్ సూపర్-8 రౌండ్లుగా ప్రస్తుత ప్రపంచకప్ ను ఐసీసీ నిర్వహిస్తోంది. దీంతో భారత్ లాంటి ప్రపంచ మేటి జట్లతో పాటు కెనడా, అమెరికా, ఉగాండా లాంటి జట్లు సైతం ముందుకు వచ్చాయి.
మొత్తం 20 జట్లలో అధికభాగం జట్ల కు అమూల్, నందిని నుంచి డ్రీమ్ 11 వరకూ టీమ్ స్పాన్సర్లుగా నిలిచాయి. భారత ప్రముఖ డైరీ బ్రాండ్ అమూల్ లోగో..అమెరికా, దక్షిణాఫ్రికాజట్ల జెర్సీల( ఆటగాళ్ల టీ-షర్టుల)పైన కనిపించనున్నాయి.
ఇక..కర్నాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని బ్రాండ్ ..ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్ల ఆటగాళ్ల దుస్తుల ద్వారా దర్శనమివ్వనున్నాయి.
2019 నుంచి హెచ్ సీఎల్ టెక్ ..క్రికెట్ ఆస్ట్ర్రేలియా డిజిటల్ టెక్నాలజీ అధికారిక స్పాన్సర్ గా ఉంటూ వస్తోంది.
భారత జెర్సీకి 358 కోట్లు...
బీసీసీఐ టీమ్ జెర్సీల స్పాన్సర్షిప్ ద్వారా 2023 నుంచి డ్రీమ్ 11 బోర్డుకు 358 కోట్ల రూపాయలు చొప్పున చెల్లిస్తూ వస్తోంది. ప్రస్తుత ప్రపంచకప్ లో సైతం భారతజట్టు జెర్సీ స్పాన్సర్ గా డ్రీమ్ 11 వ్యవహరించనుంది.
స్కాట్లాండ్, ఐర్లాండ్ జట్ల జెర్సీ స్పాన్సర్ గా నందినీ బ్రాండ్ జట్టుకు 2 కోట్ల 50 లక్షల రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది. నందినీ బ్రాండ్ కంటే భారత జెర్సీ స్పాన్సర్ డ్రీమ్ 11 196 శాతం అదనంగా చెల్లిస్తోంది.
టీ-20ల్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టుగా ఉన్న భారత్ గ్రూప్ - ఏ లీగ్ లో పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా జట్లతో తలపడనుంది.
ప్రపంచ వ్యాప్తంగా 850 మిలియన్ల మంది వీక్షకుల దృష్టిలో భారత బ్రాండ్లు నందిని, అమూల్ తొలిసారిగా పడనున్నాయి. అమెరికా మార్కెట్ ను ఆకర్షించడమే లక్ష్యంగా అమూల్, నందినీ బ్రాండ్ సంస్థలు బరిలో నిలిచాయి.