Telugu Global
Sports

భారత క్రికెట్ నయాకోచ్ పని ప్రారంభం...!

భారత క్రికెట్ సరికొత్త ప్రధాన శిక్షకుడు గౌతం గంభీర్ పని ప్రారంభమయ్యింది. శ్రీలంకతో సిరీస్ ద్వారా చీఫ్ కోచ్ గా తన ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు.

భారత క్రికెట్ నయాకోచ్ పని ప్రారంభం...!
X

భారత క్రికెట్ సరికొత్త ప్రధాన శిక్షకుడు గౌతం గంభీర్ పని ప్రారంభమయ్యింది. శ్రీలంకతో సిరీస్ ద్వారా చీఫ్ కోచ్ గా తన ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు.

భారత క్రికెట్ కు భారత సంతతి శిక్షకులే సేవలు అందించే పరంపర విజయవంతంగా కొనసాగుతోంది. విదేశీ కోచ్ లను కాదని స్వదేశీ శిక్షకుల వైపే మొగ్గుచూపుతున్న బీసీసీఐ వ్యూహం ఆశించిన ఫలితాలనే ఇస్తోంది.

విదేశీ కోచ్ ల నుంచి స్వదేశీ శిక్షకుల వరకూ...

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డుగా పేరుపొందిన బీసీసీఐ ( భారత క్రికెట్ నియంత్రణ మండలి) తన వ్యవహారాలను పక్కా ప్రొఫెషనలిజమ్ పద్దతిలో నిర్వహిస్తూ వస్తోంది.

1990 దశకంలో గ్యారీ కిర్ స్టెన్, జాన్ రైట్, డంకన్ ఫ్లెచర్, గ్రెగ్ చాపెల్ లాంటి విదేశీ క్రికెట్ శిక్షకుల నేతృత్వంలో తన ప్రస్థానం కొనసాగించిన భారత్ కు గత దశాబ్దకాలంగా స్వదేశీ శిక్షకులు మాత్రమే సేవలు అందిస్తూ వస్తున్నారు.

అనీల్ కుంబ్లే, రవి శాస్త్రి, రాహుల్ ద్రావిడ్, తాత్కాలిక శిక్షకుడిగా వీవీఎస్ లక్ష్మణ్ భారత్ ను క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ పటిష్టమైన జట్టుగా తీర్చిదిద్దటమే కాదు..

అత్యంత విజయవంతమైన జట్టుగా నిలుపుతూ వచ్చారు.

రాహుల్ ద్రావిడ్ స్థానంలో గౌతం గంభీర్..

2021లో రవిశాస్త్రి నుంచి భారతజట్టు ప్రధానశిక్షకుడిగా పగ్గాలు అందుకొన్న రాహుల్ ద్రావిడ్ అనుకొన్న లక్ష్యాలను సాధించగలిగాడు. నెలకు కోటి రూపాయల వేతనంతో చీఫ్ కోచ్ గా వ్యవహరించిన ద్రావిడ్..కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి భారతజట్టును క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టుగా నిలుపగలిగాడు.

భారతజట్టును ఐసీసీ టెస్టు లీగ్, ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ చేర్చినా రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే..అమెరికా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో కొద్దివారాల క్రితమే ముగిసిన 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో భారత్ ను 17 సంవత్సరాల విరామం తరువాత విజేతగా నిలపడంలో సఫలమయ్యాడు.

అరుదైన రికార్డుల గౌతం గంభీర్....

టీ-20 ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలవడంతోనే భారతజట్టు ప్రధాన శిక్షకుడిగా రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టు ముగిసిపోడంతో...ఆ స్థానంలో గౌతం గంభీర్ ను బీసీసీఐ ఎంపిక చేసింది.

ఐపీఎల్ 17వ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ను విజేతగా నిలపడంలో గౌతం గంభీర్ ప్రధానపాత్ర పోషించాడు. ఫ్రాంచైజీ మెంటార్ గా జట్టుకు ట్రోఫీ అందించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా, మెంటార్ గా ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన ఘనత 41 సంవత్సరాల గౌతం గంభీర్ కు మాత్రమే దక్కుతుంది.

అంతేకాదు..భారతజట్టులో సభ్యుడిగా 2007 టీ-20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ ట్రోఫీలను సైతం సాధించిన అసాధారణ రికార్డు గౌతం గంభీర్ కు ఉంది.

2007 టీ-20 ప్రపంచకప్ టైటిల్ సమరంలో పాకిస్థాన్ పై 75 పరుగులు, 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపైన 97 పరుగులు సాధించడం ద్వారా గౌతం గంభీర్ టాప్ స్కోరర్ గా, మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.

భారత ప్రధాన శిక్షకుడి బాధ్యత గొప్ప గౌరవం...

అతిచిన్న వయసులోనే భారతజట్టు ప్రధాన శిక్షకుడి బాధ్యతలు అందుకోడం తనకు లభించిన గొప్పగౌరవం, బాధ్యత మాత్రమే కాదు..అదృష్టం కూడా అంటూ గంభీర్ మురిసిపోయాడు.

ఓ ఆటగాడిగా భారతజట్టుకు ఎంత అంకితభావంతో సేవలు అందించానో ప్రధాన శిక్షకుడిగా అదేస్థాయిలో రాణించగలనన్న ఆత్మవిశ్వాసాన్నిగంభీర్ వ్యక్తం చేశాడు.

శ్రీలంకతో జులై 27 నుంచి పల్లెకెలీ, కొలంబో వేదికలుగా జరుగనున్న తీన్మార్ టీ-20, మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లతో చీఫ్ కోచ్ గా గౌతం గంభీర్ ప్రస్థానం అధికారికంగా ప్రారంభంకానుంది.

First Published:  24 July 2024 4:59 PM IST
Next Story