న్యూజిలాండ్‌పై భారత్ విజయం
సెమీస్ లో ఆసీస్ ను ఢీకొట్టనున్న భారత్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 44 రన్స్ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లు 249/9 స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో భారత స్పిన్నర్ల ధాటికి న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 రన్స్‌కే కుప్పకూలింది. కేన్ విలియమ్సన్ (81) ఒక్కడే పోరాడాడు. మిచెల్ శాంటర్న్ (28), విల్ యంగ్ (22), డారిల్ మిచెల్ (17), టామ్ లేథమ్ (14), గ్లెన్ ఫిలిప్స్ (12) రన్స్ చేశారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (5/42) అదరగొట్టాడు. కుల్‌దీప్ యాదవ్ 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.ఐదు వికెట్లు పడగొట్టి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.మంగళవారం (మార్చి 4న) జరిగే తొలి సెమీ ఫైనల్‌లో భారత్ ఆసీస్‌తో తలపడనున్నది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్ (79) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ పటేల్ (42) రాణించాడు. చివర్లో హార్దిక్ పాండ్య (45) ఫోర్లు, సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు. కేఎల్ రాహుల్ (23), రవీంద్ర జడేజా (16) రన్స్ చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (15), శుభ్‌మన్ గిల్ (2), విరాట్ కోహ్లీ (11) నిరాశపరిచారు. దీంతో భారత్ 30 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్, అక్షర్ పటేల్ టీమ్‌ఇండియాను ఆదుకున్నారు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 98 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. చివర్లో హార్దిక్ మెరుపులు మెరిపించడంతో భారత్ పోరాడే స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5, జేమీసన్, విలియం ఓరూర్క్, శాంట్నర్, రచిన్ రవీంద్ర ఒక్కో వికెట్ తీశారు.