Telugu Global
Sports

ఆసియాకప్ ఫైనల్లో నేడు శ్రీలంకతో భారత్ టైటిల్ పోరు!

2024- మహిళా ఆసియాకప్ క్రికెట్ ఫైనల్స్ కు శ్రీలంకలోని డంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. ఏడుసార్లు విజేత భారత్ 8వ టైటిల్ కు గురి పెట్టింది.

ఆసియాకప్ ఫైనల్లో నేడు శ్రీలంకతో భారత్ టైటిల్ పోరు!
X

2024- మహిళా ఆసియాకప్ క్రికెట్ ఫైనల్స్ కు శ్రీలంకలోని డంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. ఏడుసార్లు విజేత భారత్ 8వ టైటిల్ కు గురి పెట్టింది.

ప్రపంచ మహిళా క్రికెట్ చిన్నజట్లలో పెద్దజట్టుగా, పెద్దజట్లలో చిన్నజట్టుగా పేరున్న భారత్ ఆసియాకప్ లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. రికార్డుస్థాయిలో 8వసారి ఆసియాకప్ టైటిల్ సాధించడానికి హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు ఉరకలేస్తోంది. డంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగే టైటిల్ పోరులో ఆతిథ్య శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

అలవోక విజయాలతో ఫైనల్లో...

గ్రూపులీగ్ దశ నుంచి సెమీఫైనల్స్ నాకౌట్ వరకూ భారత్ అలవోక విజయాలు సాధిస్తూ రికార్డుస్థాయిలో వరుసగా తొమ్మిదిసారి ఆసియాకప్ ఫైనల్స్ చేరడం ద్వారా తన రికార్డును తానే అధిగమించుకోగలిగింది.

గ్రూపు దశ పోటీలలో పాకిస్థాన్ పై 7 వికెట్లు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన 78 పరుగులు, నేపాల్ పైన 82 పరుగులతో విజయాలు సాధించిన భారత్ తొలిసెమీఫైనల్లో మాజీ చాంపియన్ బంగ్లాదేశ్ ను ఊదిపారేసింది.

ఫైనల్లో చోటు కోసం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 10 వికెట్లతో మాజీ చాంపియన్ బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాను 80 పరుగుల స్కోరుకే భారత్ కుప్పకూల్చింది.

విజయానికి అవసరమైన 81 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్ నష్టపోకుండా సాధించింది. ఓపెనర్లు షెఫాలీ 26, స్మృతి మంధన 55 పరుగుల స్కోర్లతో అజేయంగా నిలవడంతో హాట్ ఫేవరెట్ భారత్..తొమ్మిదికి తొమ్మిదిసార్లు ఆసియాకప్ ఫైనల్స్ చేరినట్లయ్యింది.

3 వికెట్లతో పాక్ ను అధిగమించిన శ్రీలంక..

మరో గ్రూపులో బంగ్లాదేశ్, మలేసియా, థాయ్ లాండ్ జట్లను ఓడించడం ద్వారా సెమీస్ చేరిన శ్రీలంక..ఫైనల్లో చోటు కోసం పాకిస్థాన్ తో జరిగిన పోరులో తుదివరకూ పోరాడాల్సి వచ్చింది.

సూపర్ హిట్టర్ చమరీ అటపట్టు నాయకత్వంలోని శ్రీలంక 141 పరుగుల విజయలక్ష్యాన్ని 7 వికెట్ల నష్టానికి సాధించడం ద్వారా ఫైనల్స్ చేరుకోగలిగింది. టైటి్ల్ సమరంలో హాట్ ఫేవరెట్ భారత్ కు శ్రీలంక సవాలు విసురుతోంది.

సమతూకంతో కూడిన పవర్ ఫుల్ భారత్ ను అధిగమించాలంటే శ్రీలంక ఆట అన్ని విభాగాలలోనూ అత్యుత్తమంగా రాణించక తప్పదు. ప్రధానంగా శ్రీలంక విజయం..కెప్టెన్ కమ్ స్టార్ ఓపెనర్ చమరీ అటపట్టుపైనే ఆధారపడి ఉన్నాయి.

8 టోర్నీలలో 7 టైటిల్స్ తో భారత్ రికార్డు...

ఆసియాకప్ చరిత్రలో భారత్ కు తిరుగులేని రికార్డే ఉంది. గత 8 టోర్నీలలో 7 సార్లు విజేతగా నిలిచిన భారత్ 2018 ఫైనల్స్ లో మాత్రమే బంగ్లాదేశ్ చేతిలో అనూహ్య పరాజయం చవిచూసింది.

ఇప్పటి వరకూ జరిగిన ఆసియాకప్ టోర్నీలలో భారత్ 7సార్లు, బంగ్లాదేశ్ ఓసారి చాంపియన్లుగా నిలిచాయి. ఈ రోజు జరిగే ఫైనల్లో భారత్ 8వ టైటిల్ సాధించాలన్న పట్టుదలతో ఉంటే..ఆతిథ్య శ్రీలంక తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తోంది.

ఫైనల్లో శ్రీలంక ఆట కట్టించాలంటే వీరబాదుడు ఓపెనర్ చమరీ అటపట్టు ను భారత బౌలర్లు సాధ్యమైనంత త్వరగా అవుట్ చేయక తప్పదు. లేదంటే కోరికష్టాలు కొని తెచ్చుకొన్నట్లే.

First Published:  28 July 2024 3:35 PM IST
Next Story