Telugu Global
Sports

జింబాబ్వే గడ్డపై భారత కుర్రాళ్ల రికార్డుల మోత!

జింబాబ్వే గడ్డపై భారత కుర్రాళ్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. పాంచా పటాకా టీ-20 సిరీస్ లో చెలరేగిపోయారు.

జింబాబ్వే గడ్డపై భారత కుర్రాళ్ల రికార్డుల మోత!
X

జింబాబ్వే గడ్డపై భారత కుర్రాళ్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. పాంచా పటాకా టీ-20 సిరీస్ లో చెలరేగిపోయారు.

జింబాబ్వేతో ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ రసపట్టుగా సాగుతోంది. శుభ్ మన్ గిల్ నాయకత్వంలోని భారత యువజట్టు రెండో మ్యాచ్ ను 100 పరుగుల తో నెగ్గడం ద్వారా 1-1తో సమఉజ్జీగా నిలిచింది.

అభిషేక్ అరుదైన రికార్డు...

హరారే స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న ఈ సిరీస్ లోని మొదటి మ్యాచ్ లో 13 పరుగుల పరాజయం చవిచూసిన భారత యువజట్టు..రెండోమ్యాచ్ లో మాత్రం రికార్డులతో మోతతో పాటు 100 పరుగుల భారీవిజయం సాధించింది.

టీ-20 ప్రపంచకప్ విజేత భారతజట్టులోని సీనియర్లందరికీ విశ్రాంతి ఇవ్వడంతో..జింబాబ్వే సిరీస్ లో భారత్ యువఆటగాళ్లతో కూడిన జట్టుతో బరిలోకి దిగింది.

ఓపెనర్ శుభ్ మన్ గిల్ నాయకత్వంలోని భారతజట్టు..కీలక రెండో టీ-20 మ్యాచ్ లో చెలరేగిపోయింది. ఆతిథ్య జింబాబ్వేను ఓ ఆటాడుకొంది.

తన అరంగేట్రం అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లో డకౌట్ గా వెనుదిరిగిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ..కేవలం 24 గంటల వ్యవధిలో జరిగిన రెండోమ్యాచ్ లో విశ్వరూపం ప్రదర్శించాడు.

46 బంతుల్లోనే మెరుపు శతకం..

కెప్టెన్ శుభ్ మన్ గిల్ తో కలసి భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన అభిషేక్..రెండో వికెట్ కు రుతురాజ్ గయక్వాడ్ తో కలసి భారీభాగస్వామ్యం నమోదు చేశాడు. 23 సంవత్సరాల అభిషేక్ తన తొలి హాఫ్ సెంచరీని 33 బంతుల్లో సాధించినా..రెండో హాఫ్ సెంచరీని మాత్రం కేవలం 13 బంతుల్లోనే పూర్తి చేయడం ద్వారా 46 బంతుల్లో సెంచరీ సాధించగలిగాడు. 7 ఫోర్లు, 8 సిక్సర్లతో సునామీ శతకం బాదడంతో పాటు..రెండో వికెట్ కు 145 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంలో ప్రధానపాత్ర పోషించాడు.

తన టీ-20 కెరియర్ 2వ మ్యాచ్ లోనే శతకం బాదిన భారత తొలి క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ దీపక్ హుడా పేరుతో ఉన్న 3మ్యాచ్ ల సెంచరీ రికార్డును అభిషేక్ సాధించాడు.

భారత క్రికెటర్లలో కెఎల్ రాహుల్ తన 4వ టీ-20 మ్యాచ్ లోనూ, యశస్వి జైశ్వాల్ 6వ మ్యాచ్ లోనూ, శుభ్ మన్ గిల్ సైతం 6వ మ్యాచ్ లోనూ తమ తొలి అంతర్జాతీయ శతకాలు సాధించిన మొనగాళ్లుగా ఉన్నారు.

రుతురాజ్ గయక్వాడ్ 47 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్ తో 77 పరుగులు, రింకూ సింగ్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 48 పరుగుల స్కోర్లతో నాటౌట్ గా నిలవడంతో భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 234 పరుగుల భారీస్కోరు సాధించింది.

రింకూసింగ్ సిక్సర్లబాదుడు రికార్డు...

జింబాబ్వే పై రింకూ సింగ్ 5 సిక్సర్లు బాదడం ద్వారా డెత్ ఓవర్లలో అత్యధిక సిక్సర్లు సాధించిన భారత బ్యాటర్లలో ఒకరుగా నిలిచాడు. టీ-20 ఆఖరి రెండు ఓవర్లలో 17 సిక్సర్లు సాధించిన మొనగాడిగా రికార్డుల్లో చేరాడు.

ఆఖరి రెండు ఓవర్లలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లలో హార్థిక్ పాండ్యా, విరాట్ కొహ్లీ, ధోనీ మొదటి మూడుస్థానాలలో కొనసాగుతున్నారు. డెత్ ఓవర్లలో బ్యాటింగ్ కు దిగిన సమయంలో ధోనీ మొత్తం 258 బంతులు ఎదుర్కొని 19 సిక్సర్లు బాదితే..విరాట్ కేవలం 158 బంతుల్లోనే 24 సిక్సర్లు సాధించాడు. హార్దిక్ పాండ్యా 193 బంతుల్లో 32 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతితక్కువ బంతుల్లో ఎక్కువ సిక్సర్లు బాదిన ఘనతను రింకూ సింగ్ సొంతం చేసుకోగలిగాడు.

ఖలీల్ అహ్మద్ ప్రపంచ రికార్డు...

భారత ఓపెనింగ్ బౌలర్ ఖలీల్ అహ్మద్ సైతం తన పేరుతో ఓ అరుదైన రికార్డు నమోదు చేసుకోగలిగాడు. ప్రస్తుత సిరీస్ లోని తొలిమ్యాచ్ ద్వారా బరిలోకి దిగడం ద్వారా

104 మ్యాచ్ ల విరామం తరువాత మరో అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ఆడిన క్రికెటర్ గా నిలిచాడు.

26 సంవత్సరాల ఖలీల్ 5 సంవత్సరాల తరువాత తిరిగి భారత టీ-20 జట్టులో చోటు సాధించడంతో పాటు తొలిమ్యాచ్ ను ప్రస్తుత జింబాబ్వే సిరీస్ ద్వారా ఆడగలిగాడు.

2019 నవంబర్ లో నాగపూర్ వేదికగా బంగ్లాదేశ్ తో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఖలీల్ ..మరో మ్యాచ్ కోసం 104 మ్యాచ్ ల పాటు వేచిచూడాల్సి వచ్చింది.

టీ-20 క్రికెట్ చరిత్రలో తన 15వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడటానికి 104 మ్యాచ్ ల పాటు నిరీక్షించిన క్రికెటర్ గా ఖలీల్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

ఖలీల్ కు భారత్ తరపున 15 టీ-20లు ఆడి 13 వికెట్లు, 11 వన్డేలు ఆడి 15 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది.

First Published:  8 July 2024 11:48 AM IST
Next Story