Telugu Global
Sports

భారత్ కు డూ ఆర్ డై...నేడే ఆఖరి వన్డే!

ప్రపంచ నంబర్ వన్ భారత్, 7వ ర్యాంకర్ శ్రీలంకజట్ల తీన్మార్ వన్డే సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. ఈరోజు జరిగే ఆఖరిపోరు భారత్ కు చావోబతుకో అన్నట్లుగా మారింది.

భారత్ కు డూ ఆర్ డై...నేడే ఆఖరి వన్డే!
X

ప్రపంచ నంబర్ వన్ భారత్, 7వ ర్యాంకర్ శ్రీలంకజట్ల తీన్మార్ వన్డే సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. ఈరోజు జరిగే ఆఖరిపోరు భారత్ కు చావోబతుకో అన్నట్లుగా మారింది.

ప్రపంచ మాజీ చాంపియన్ శ్రీలంకతో ద్వైపాక్షిక వన్డే సిరీస్ ల్లో గత 27 సంవత్సరాలుగా ఓటమి ఎరుగని భారత్ కు తొలిసారిగా గడ్డు పరిస్థితి ఎదురయ్యింది. 2024 శ్రీలంక పర్యటనను భారత్ అజేయంగా ముగించాలంటే..కొలంబో వేదికగా ఈరోజు జరిగే ఆఖరి వన్డేలో ఆరునూరైనా నెగ్గితీరాల్సి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే..ఈ మ్యాచ్ ఆతిథ్య శ్రీలంకకు చెలగాటం..ప్రపంచకప్ రన్నరప్ భారత్ కు సిరీస్ సంకటంగా మారింది.

స్పిన్నర్ల అడ్డాలో భారత్ దడదడ...

స్పిన్ బౌలింగ్ ను అలవోకగా ఎదుర్కొనగలదని పేరున్న భారత్ ప్రస్తుత శ్రీలంక సిరీస్ లో అదే స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కొనడంలో తడబడుతోంది. ప్రస్తుత సిరీస్ లోని తొలివన్డేలో విజయం సాధించే అవకాశాన్ని చేజార్చుకొని టైతో సరిపెట్టుకొన్న భారత్ ..కీలక రెండోవన్డేలో 32 పరుగుల పరాజయంతో డీలా పడిపోయింది. శుభ్ మన్ గిల్, విరాట్ కొహ్లీ, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి మేటి బ్యాటర్లున్నా భారత్ చేజింగ్ లో విఫలమవుతూనే వస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ మినహా జట్టులోని మిగిలిన ఆటగాళ్లంతా స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతున్నారు.

మిడిల్ ఓవర్ల సంకటం...

ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండువన్డేలలోనూ చేజింగ్ కు దిగిన భారత్ తొలివన్డేలో 231, రెండోవన్డేలో 241 పరుగుల లక్ష్యాలను అధిగమించలేకపోయింది. ఓపెనర్లు చక్కటి భాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చినా..మిడిల్ ఓవర్లలో శ్రీలంక స్పిన్నర్లకు భారత బ్యాటర్లు దీటైన జవాబు చెప్పలేకపోతున్నారు.

రెండోవన్డేలో లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే ఒక్కడే ఆరు వికెట్లు పడగొట్టి మ్యాచ్ విన్నర్ గా నిలిచాడంటే భారత స్టార్ బ్యాటర్లు ఎంతగా విఫలమవుతుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

రన్ మెషీన్ విరాట్ కొహ్లీ, నిలకడకు మరోపేరైనా కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తక్కువ స్కోర్లకే అవుట్ కావడం, వికెట్ల ముందే దొరికిపోడం టీమ్ మేనేజ్ మెంట్ సహనానికి పరీక్షగా మారింది.

రోహిత్ శర్మకు ఫిట్ నెస్ సమస్య...

మొదటి రెండువన్డేలలోనూ మెరుపు హాఫ్ సెంచరీలతో సూపర్ ఫామ్ లో ఉన్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎడమకాలి కండరం పట్టేయటం ఆందోళన కలిగిస్తోంది. రోహిత్ శర్మ ఎడమకాలి తొండరం పట్టేసిందని, విశ్రాంతి తీసుకోవాలని టీమ్ ఫిజియో సలహా ఇచ్చినట్లువార్తలు వస్తున్నా...ఈ కీలక వన్డేకి కెప్టెన్ కమ్ ఓపెనర్ గా రోహిత్ అందుబాటులో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.

రియాన్ పరాగ్, రిషభ్ లకు చోటు దక్కేనా?

భారత తుదిజట్టులో ఒకటి లేదా రెండుమార్పులు చేసే అవకాశం లేకపోలేదు. మొదటి రెండువన్డేలలో విఫలమైన రాహుల్, అయ్యర్ లకు బదులుగా రిషభ్ పంత్ , రియాన్ పరాగ్ లను జట్టులో చేర్చుకోవాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. రెండోవన్డే ఓటమితో నిరాశకు గురైన కోచ్ గంభీర్ గట్టి నిర్ణయాలు తీసుకొన్నా ఆశ్చర్యంలేదు.

మొదటి రెండువన్డేలలోనూ టాస్ ఓడి చేజింగ్ కు దిగాల్సి వచ్చిన భారత్ ..కనీసం ఆఖరివన్డేలోలైనా టాస్ నెగ్గితే ఫలితం అనుకూలం కానుంది.

ప్రధానంగా శ్రీలంక లెగ్ స్పిన్నర్ వాండర్సేను భారత బ్యాటర్లు ఎంత దీటుగా ఎదుర్కొనగలరన్న అంశం సైతం మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించనుంది.

స్పిన్ బౌలర్ల స్వర్గం ప్రేమదాస స్టేడియం పిచ్ పైన 240కి పైగా పరుగులు సాధించినజట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని గత రికార్డులే చెబుతున్నాయి.

గెలుపుగుర్రాలతోనే శ్రీలంకజోరు..

మరోవైపు ఆతిథ్య శ్రీలంకజట్టు మాత్రం ఎలాంటి మార్పులులేని జట్టుతోనే పోటీకి దిగనుంది. అదనపు స్పిన్నర్, అదనపు బ్యాటర్ వ్యూహం శ్రీలంకకు బాగానే కలసి వచ్చింది.

అదేమంత్రంతో టాప్ ర్యాంకర్ భారత్ ను కంగుతినిపించాలన్న పట్టుదలతో ఉంది. పైగా..గత 27 ఏళ్లుగా భారత్ తో జరుగుతున్న ద్వైపాక్షిక వన్డే సిరీస్ ల్లో ఓడితూ వచ్చిన శ్రీలంక ప్రస్తుత సిరీస్ ద్వారా దొరికిన సువర్ణఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఆఖరి వన్డేలో సైతం నెగ్గడం ద్వారా 2-0తో సిరీస్ కైవసం చేసుకొంటే..శ్రీలంకకు అది గొప్పఘనతే అవుతుంది.

ఇవీ ఫేస్ టు ఫేస్ రికార్డులు....

ప్రస్తుత సిరీస్ లోని రెండోవన్డే వరకూ రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే శ్రీలంకపై భారత్ ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ రెండుజట్లూ 170 వన్డేలలో తలపడితే..ప్రపంచకప్ రన్నరప్ భారత్ 99 విజయాలు, శ్రీలంక 58 విజయాలు సాధించాయి. 12 మ్యాచ్ లు మాత్రమే ఫలితం తేలకుండా ముగిశాయి.

ఈ రెండుజట్లూ తలపడిన గత 7 వన్డేలలో భారత్ 5 విజయాలు, ఓ టై, ఓ ఓటమి రికార్డుతో ఉంది. అంతేకాదు..ఈ రెండుజట్లూ ఆడిన గత 7 వన్డే మ్యాచ్ ల్లో భారత్ 3 విజయాలు, 2 పరాజయాలు, ఓ టై రికార్డుతో ఉంటే...శ్రీలంక మాత్రం 3 విజయాలు, 3 పరాజయాలు, ఓ టై రికార్డుతో నిలిచింది.

గత రెండువన్డేలలో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న శ్రీలంకజట్టే అజేయంగా నిలవడం చూస్తే..ప్రస్తుత ఆఖరివన్డేలో సైతం టాస్ నెగ్గిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయని చెప్పక తప్పదు. భారత కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఈ కీలకపోరుకు తెరలేవనుంది.

First Published:  7 Aug 2024 5:22 AM GMT
Next Story