టీ-20 సిరీస్ లో నేడే ఆఖరాట!
ఏకపక్షంగా సాగుతున్న భారత్- శ్రీలంకజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ ముగింపు దశకు చేరింది. వరుసగా మూడో విజయానికి సూర్యసేన గురిపెట్టింది.
ఏకపక్షంగా సాగుతున్న భారత్- శ్రీలంకజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ ముగింపు దశకు చేరింది. వరుసగా మూడో విజయానికి సూర్యసేన గురిపెట్టింది.
ప్రపంచ చాంపియన్ భారత్, 8వ ర్యాంకర్ శ్రీలంకజట్ల మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లోని ఆఖరాటకు పల్లెకెలీలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు.. అంతగా ప్రాధాన్యంలేని ఈ పోరు ప్రారంభంకానుంది.
భారతజోరుకు శ్రీలంక బేజారు...
టీ-20 ప్రపంచ మాజీ చాంపియన్ శ్రీలంక ప్రస్తుత తీన్మార్ సిరీస్ లో టాప్ ర్యాంకర్ భారత్ జోరుకు బేజారెత్తిపోతోంది. సిరీస్ లోని తొలిపోరులో 43 పరుగుల తేడాతో ఓటమి పొందిన శ్రీలంక..వర్షంతో అంతరాయం నడుమ డక్ వర్త్ లూయిస్ విధానం ద్వారా ముగిసిన రెండోమ్యాచ్ లో సైతం 7 వికెట్ల ఓటమితో సిరీస్ చేజార్చుకొంది.
మిడిలార్డర్ వైఫల్యంతో సిరీస్ ఓటమి పొందిన శ్రీలంక..మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఆఖరి టీ-20లో నెగ్గడం ద్వారా పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. ఆఖరాట సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత్ కు చెలగాటం..చరిత అసలంకా కెప్టెన్సీలోని శ్రీలంకకు పరువుకు సంకటంగా మారింది.
సిరీస్ స్వీప్ కు భారత్ తహతహ...
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా, గౌతం గంభీర్ చీఫ్ కోచ్ గా శ్రీలంకతో తొలి సిరీస్ ఆడుతున్న భారతజట్టు వరుసగా మూడో గెలుపుతో సిరీస్ స్వీప్ సాధించాలన్న పట్టుదలతో ఉంది. శ్రీలంక నుంచి నామమాత్రం పోటీ మాత్రమే ఎదురవుతూ ఉండటంతో భారతజోరు నల్లెరుమీద బండి నడకలా సాగిపోతోంది.
మెడనొప్పితో రెండో టీ-20కి దూరమైన వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ తిరిగి జట్టులో చేరనుండడంతో స్టాప్ గ్యాప్ ఓపెనర్ సంజు శాంసన్ తుదిజట్టులో చోటు కోల్పోనున్నాడు.
ఇప్పటికే భారతజట్టు 2-0తో సిరీస్ ఖాయం చేసుకోడంతో..పేసర్ ఖలీల్ మహ్మద్, స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ లను తుదిజట్టులో చేర్చుకోవాలని భారత టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది.
వికెట్ కీపర్ స్థానం కోసం రిషభ్ పంత్ తో సంజు శాంసన్ పోటీపడుతున్నాడు. సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లోనూ రాణించిన లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్, అక్షర్ పటేల్, పేస్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి కీలకపాత్ర పోషించనున్నారు.
శ్రీలంకజట్టులోనూ తప్పని మార్పులు...
సైకిల్ స్టాండ్ లా కూలిపోతున్న తన మిడిలార్డర్ ను పటిష్టం చేసుకోడానికి శ్రీలంక టీమ్ మేనేజ్ మెంట్ నడుం బిగించింది. భారత్ కు గట్టిపోటీ ఇవ్వాలంటే ..మిడిలార్డర్ ను బలపరచుకోడంతో పాటు..డెత్ ఓవర్లలో పరుగులు సాధించడం కీలకమని భావించి తగ్గట్టుగా వ్యూహంతో ఆఖరిపోరాటానికి లంక సిద్ధమయ్యింది.
మిడిలార్డర్లో దసున్ షనక స్థానంలో దినేశ్ చండిమాల్, అవిష్క ఫెర్నాండోలను చేర్చుకోనుంది. బౌలింగ్ తో పోల్చుకొంటే శ్రీలంక బ్యాటింగ్ నిలకడలేమితో కొట్టిమిట్టాడుతోంది.
పొంచిఉన్న వానముప్పు...
ప్రస్తుత సిరీస్ లోని రెండో టీ-20 మ్యాచ్ వానదెబ్బతో 28 ఓవర్ల పోరుగా ముగిసింది. శ్రీలంక 20 ఓవర్లూ బ్యాటింగ్ చేసినా..వానదెబ్బతో భారత ఇన్నింగ్స్ కేవలం 8 ఓవర్లకే పరిమితమైనా..డక్ వర్త్ లూయిస్ విధానం ద్వారా 7 వికెట్ల విజయం సాధించగలిగింది.
ప్రస్తుత ఆఖరి టీ-20కి సైతం వానముప్పు పొంచిఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రెండుజట్లు..కురవబోయే వానపరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తుదిజట్టు కూర్పును చేపట్టనున్నాయి. ముందుగా బ్యాటింగ్ కు దిగే జట్టు 180కి పైగా పరుగులు సాధించగలిగితేనే విజయావకాశాలు ఉంటాయి.
పటిష్టమైన శ్రీలంక బౌలింగ్ ఎటాక్ కు..పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ కలిగిన భారతజట్ల ఈ ఆఖరిపోరు సైతం పట్టుగా సాగే అవకాశం లేకపోలేదు.