వన్డే సిరీస్ లో నేడు కీలకపోరు!
భారత్- శ్రీలంకజట్ల వన్డే సిరీస్ లో కీలక రెండోపోరుకు కొలంబో ప్రేమదాస ఇంటర్నేషనల్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. తొలిగెలుపుతో సిరీస్ పై పట్టు బిగించాలని రెండుజట్లూ పట్టుదలతో ఉన్నాయి.
భారత్- శ్రీలంకజట్ల వన్డే సిరీస్ లో కీలక రెండోపోరుకు కొలంబో ప్రేమదాస ఇంటర్నేషనల్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. తొలిగెలుపుతో సిరీస్ పై పట్టు బిగించాలని రెండుజట్లూ పట్టుదలతో ఉన్నాయి.
శ్రీలంకను శ్రీలంక స్లో పిచ్ లపై ఓడించడం అంతతేలిక కాదని నయాకోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలోని భారత టీమ్ మేనేజ్ మెంట్ ..తొలివన్డే మ్యాచ్ టై కావడం ద్వారా తెలిసి వచ్చింది. అయితే..ఈ రోజు జరిగే కీలక రెండోవన్డేలో మాత్రం పొరపాట్లకు తావులేకుండా ఆడాలని, తొలివిజయంతో సిరీస్ పై పట్టు బిగించాలన్న పట్టుదల కెప్టెన్ రోహిత్ శర్మలో కనిపిస్తోంది.
మరో లోస్కోరింగ్ వార్.....
స్పిన్ బౌలింగ్ కు అత్యంత అనువుగా ఉండే ప్రేమదాస్ స్టేడియం అంటేనే లోస్కోరింగ్ మ్యాచ్ లు. ప్రధానంగా బ్యాట్ ఝళిపించే బ్యాటర్ల సహనానికి పరీక్ష అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ప్రస్తుత సిరీస్ లో భాగంగా ముగిసిన తొలి వన్డేలో రెండుజట్లూ 230 పరుగుల స్కోర్లు మాత్రమే చేయటం, మ్యాచ్ 'టై'గా ముగియటంతో ఇక్కడి మందకొడి పిచ్ పైన ధాటిగా పరుగులు సాధించడం కష్టమని బ్యాటర్లకు తెలిసివచ్చింది. ప్రధానంగా శ్రీలంక స్పిన్నర్లను ఎదుర్కొనడంలో భారత స్టార్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ, అక్షర్ పటేల్, రాహుల్ మినహా మిగిలిన ప్రధాన బ్యాటర్లు స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయారు. ఇదే గ్రౌండ్లో నాలుగు శతకాలు బాదిన ఘనమైన రికార్డు కలిగిన రన్ మెషీన్ విరాట్ కొహ్లీ సైతం తక్కువ స్కోరుకే వెనుదిరగడం భారత విజయావకాశాలను దెబ్బతీసింది. ప్రేమదాస స్టేడియం వేదికగా ఆడిన గత ఆరు వన్డేలలో 450కి పైగా పరుగులు సాధించిన విరాట్..ఈరోజు భారీస్కోరు సాధించే అవకాశం లేకపోలేదు.
శ్రీలంక స్పిన్ జోడీ దునిత వెల్లాలగే, వనింద హసరంగ కలసి 6 వికెట్లు పడగొట్టడం ద్వారా భారత్ ను సమర్థవంతంగా కట్టడి చేయగలిగారు. అయితే..గాయంతో హసరంగ సిరీస్ లోని మిగిలిన రెండు వన్డేలకు అందుబాటులో లేకపోడం భారత్ కు అనుకూలం కానుంది.
కొసరు బౌలర్లవైపే భారత్ చూపు...
భారత టీమ్ కొత్త మేనేజ్ మెంట్ స్పెషలిస్ట్ బౌలర్లతో పాటు పార్ట్ టైమ్ బౌలర్లకూ తగిన ప్రాధాన్యమిస్తున్నట్లు బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే స్పష్టం చేశాడు. తొలివన్డేలో కొసరుబౌలర్లు శుభ్ మన్ గిల్, శివం దుబేకు బౌలింగ్ చేసే అవకాశం దక్కింది. ప్రస్తుత రెండోవన్డేలో సైతం భారత్..కొసరు బౌలర్లను ప్రయోగించే అవకాశం ఎక్కువగా ఉంది.
భారత తుదిజట్టులోకి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను చేర్చుకోడం ద్వారా లంక ఆటకట్టించాలని కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నాడు.
ఆ ముగ్గురి పైనే శ్రీలంక భారం..
నిలకడలేమితో ఉక్కిరిబిక్కిరవుతున్న శ్రీలంక ప్రధానంగా కుశల్ మెండిస్, ప్రితుమ్ నిస్సంక, సదీర సమరవిక్రమలతో పాటు స్పిన్ ఆల్ రౌండర్ దునిత్ వెల్లాలగేలపైనే పూర్తిగా ఆధారపడి ఉంది. తొలివన్డేలో వెంట్రుకవాసిలో ఓటమి తప్పించుకొని మ్యాచ్ ను టైగా ముగించిన శ్రీలంకు ప్రస్తుత రెండోవన్డేలో మాత్రం టాప్ ర్యాంకర్ భారత్ నుంచి గట్టి దెబ్బ అవకాశం ఉంది. 7వ ర్యాంకర్ శ్రీలంక స్థానబలంతో పాటు..పూర్తిస్థాయిలో రాణించగలిగితేనే భారత్ జోరును అడ్డుకోగలుగుతుంది.
శ్రీలంక ప్రత్యర్థిగా భారత్ దే పైచేయి...
రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే శ్రీలంకపై భారత్ ఆధిపత్యమే కనిపిస్తోంది. ప్రస్తుత సిరీస్ లోని తొలివన్డే వరకూ ఈ రెండుజట్లూ 169 వన్డేలలో తలపడితే..ప్రపంచకప్ రన్నరప్ భారత్ 99 విజయాలు, శ్రీలంక 57 విజయాలు సాధించాయి. 12 మ్యాచ్ లు మాత్రమే ఫలితం తేలకుండా ముగిశాయి.
ఈ రెండుజట్లూ తలపడిన గత 6 వన్డేలలో భారత్ 5 విజయాలు, ఓ టై రికార్డుతో ఉంది. అంతేకాదు..ఈ రెండుజట్లూ ఆడిన గత ఆరు వన్డే మ్యాచ్ ల్లో 3 విజయాలు, 2 పరాజయాలు, ఓ టై రికార్డుతో సైతం ఉన్నాయి.
240 పరుగుల స్కోరు సాధిస్తేనే...
ప్రేమదాస స్టేడియం గత ఐదేళ్ల రికార్డులను చూస్తే..19 వన్డేలలో ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్లు 9 విజయాలు 10 పరాజయాలు చవిచూశాయి, చేజింగ్ కు దిగిన జట్లు 8 విజయాలు మాత్రమే సాధించాయి. గత వన్డేలో ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టూ, చేజింగ్ కు దిగిన జట్టూ 230 పరుగుల స్కోర్లే సాధించడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
ఈరోజు జరిగే ఈ కీలక మ్యాచ్ లో సైతం టాస్ నెగ్గినజట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోడం ఖాయంగా కనిపిస్తోంది. 250కి పైగా స్కోరు సాధించిన జట్టునే విజయం వరించే అవకాశం ఉంది.
కొలంబో స్టేడియం పిచ్ పైన ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్ల సగటు స్కోరు 244 కాగా...చేజింగ్ సగటు లక్ష్యం 206 పరుగులుగా ఉంది.
రిషభ్ పంత్ కు చాన్స్ దక్కేనా?
భారత తుదిజట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కు చోటు దక్కే అవకాశం లేకపోలేదు. అయితే ..తొలివన్డేలో వికెట్ కీపర్ బ్యాటర్ గా ఉన్న రాహుల్ తో పాటు పంత్ ను తుదిజట్టులోకి తీసుకొనే అవకాశం ఉంది.
వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ స్థానంలో పంత్ ను తీసుకొనే అవకాశం లేకపోలేదు. మరోవైపు..ఆతిథ్య శ్రీలంక తుదిజట్టులో ఒకటి లేదా రెండుమార్పులతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
ఈరోజు మధ్యాహ్నం 2-30 గంటలకు ప్రారంభమయ్యే ఈమ్యాచ్ లో నెగ్గినజట్టే సిరీస్ ను గెలుచుకొనే అవకాశం ఉండడంతో రెండుజట్లూ విజయమే లక్ష్యంగా పోటీకి దిగుతున్నాయి.
ఈ సూపర్ సండే ఫైట్ లో భారత్ కు 60శాతం, శ్రీలంకకు 40 శాతం మాత్రమే విజయావకాశాలున్నాయి. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అయితే..మ్యాచ్ మాత్రం సజావుగా సాగుతుందని నిర్వాహక శ్రీలంక క్రికెట్ సంఘం భావిస్తోంది.