Telugu Global
Sports

నేటినుంచే భారత్- శ్రీలంక తీన్మార్ టీ-20 సిరీస్!

ప్రపంచ చాంపియన్ భారత్..కొత్త కెప్టెన్, సరికొత్త చీఫ్ కోచ్ లతో తీన్మార్ టీ-20 సిరీస్ లో మాజీ చాంపియన్ శ్రీలంకకు సవాలు విసురుతోంది.

నేటినుంచే భారత్- శ్రీలంక తీన్మార్ టీ-20 సిరీస్!
X

ప్రపంచ చాంపియన్ భారత్..కొత్త కెప్టెన్, సరికొత్త చీఫ్ కోచ్ లతో తీన్మార్ టీ-20 సిరీస్ లో మాజీ చాంపియన్ శ్రీలంకకు సవాలు విసురుతోంది.

టీ-20 ప్రపంచ చాంపియన్ భారత్, మాజీ చాంపియన్ శ్రీలంక జట్ల తీన్మార్ సిరీస్ కు పల్లెకెలీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రంగం సిద్ధమయ్యింది.

ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే టాప్ ర్యాంకర్ భారత్ కు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తుంటే..8వ ర్యాంకర్ శ్రీలంక జట్టుకు చరిత అసలంకా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

ఇటు సూర్యకుమార్...అటు గౌతం గంభీర్..

2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ను రోహిత్ శర్మ నాయకత్వంలో గెలుచుకొన్న భారత్ ప్రస్తుత సిరీస్ లో నవతరం ఆటగాళ్లు, కొత్త కెప్టెన్, సరికొత్త చీఫ్ కోచ్ ల నేతృత్వంలో పాల్గొనబోతోంది.

ప్రపంచకప్ ముగిసిన వెంటనే ముగ్గురు సీనియర్ దిగ్గజాలు (రోహిత్, విరాట్, రవీంద్ర జడేజా ) టీ-20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో వారిస్థానాలలో పలువురు యువఆటగాళ్లకు భారతజట్టులో చోటు కల్పించారు.

యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్ జోడీగా భారత్ ఇన్నింగ్స్ ప్రారంభంకానుంది. మిస్టర్ టీ-20 హిట్టర్ సూర్యకుమార్ నాయకత్వంలో శ్రీలంకను శ్రీలంక గడ్డపై చిత్తు చేయాలని భారత్ భావిస్తోంది.

రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్నోయ్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ లతో భారతజట్టు సరికొత్తగా తయారయ్యింది. భారత బ్యాటింగ్ ఆర్డర్ లోని మొదటి ఎనిమిదిమందికీ 140కి పైగా స్ట్ర్రయిక్ రేట్ ఉండడం భారత బ్యాటింగ్ పవర్ ఏంటో చెప్పకనే చెబుతోంది.

పైగా ..ద్రావిడ్ నుంచి చీఫ్ కోచ్ పగ్గాలు అందుకొన్న గౌతం గంభీర్ సైతం భారత ప్రధాన శిక్షకుడిగా తన ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.

పదునైన బౌలింగ్ తో శ్రీలంక సవాల్....

టీ-20 ప్రపంచకప్ లో ఘోరవైఫల్యం చవిచూసిన శ్రీలంక చరిత అసలంక నాయకత్వంలో..భారత్ సిరీస్ ద్వారా పుంజుకోవాలని భావిస్తోంది. పదునైన బౌలింగ్ ఎటాక్ తో..భారత పవర్ ఫుల్ బ్యాటింగ్ కు చెక్ చెప్పాలన్న పట్టుదలతో ఉంది.

జాదు స్పిన్నర్ వనిందు హసరంగ, మహీశ్ తీక్షణ, పేసర్ల త్రయం దిల్షాన్ మదుశంక, మహీషా పతిరనస బినురా ఫెర్నాండోలతో శ్రీలంక బౌలింగ్ కూర్పు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్ తో పోల్చుకొంటే శ్రీలంక బ్యాటింగ్ అంతంత మాత్రంగానే ఉంది.

బ్యాటర్ల స్వర్గంగా పేరుపొందిన పల్లెకెలీ వేదికగా ఈరోజు జరిగే మ్యాచ్ లో సైతం భారీస్కోర్లు నమోదు కానున్నాయి. రెండుజట్లలోని వీరబాదుడు బ్యాటర్లకు చేతినిండా పనేనని చెప్పక తప్పదు.

పవర్ ప్లే ఓవర్లలో అధిక వికెట్లు, పవర్ ప్లే ఓవర్లలో అధిక పరుగులు సాధించిన జట్టుకే విజయావకాశం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలువురు సీనియర్ స్టార్లు లేకున్నా ప్రతిభావంతులైన యువఆటగాళ్లతో కూడిన భారత్ నేలవిడిచి సాము చేస్తున్నా...స్థాయికి తగ్గట్టుగా రాణించగలిగితే..శ్రీలంకను లంకగడ్డపై చిత్తు చేయడం ఏమంత కష్టంకాబోదు.

భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభంకానుంది.

First Published:  27 July 2024 4:39 PM IST
Next Story