Telugu Global
Sports

భారత్ - శ్రీలంక తొలివన్డేకి వానగండం!

ప్రపంచ నంబర్ వన్, ప్రపంచ రన్నరప్ భారత్ గత ఎనిమిదిమాసాలలో తొలివన్డే మ్యాచ్ కు సిద్ధమయ్యింది. శ్రీలంకతో ఈరోజు తొలివన్డేలో తలపడనుంది.

భారత్ - శ్రీలంక తొలివన్డేకి వానగండం!
X

ప్రపంచ నంబర్ వన్, ప్రపంచ రన్నరప్ భారత్ గత ఎనిమిదిమాసాలలో తొలివన్డే మ్యాచ్ కు సిద్ధమయ్యింది. శ్రీలంకతో ఈరోజు తొలివన్డేలో తలపడనుంది.

ప్రపంచ చాంపియన్ భారత్..తన శ్రీలంక పర్యటనలో రెండో అంచె వన్డే సిరీస్ కు రోహిత్ శర్మ నాయకత్వంలో సిద్ధమయ్యింది. తీన్మార్ టీ-20 సిరీస్ ను సూర్యకుమార్ నాయకత్వంలో క్లీన్ స్వీప్ చేసిన భారత్..వన్డే సిరీస్ లోనూ అదేజోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది.

2023 ప్రపంచకప్ ఫైనల్ తరువాత ఇదే తొలివన్డే...

టీ-20 మ్యాచ్ లు, సిరీస్ లు, ఐసీసీ టీ-20 ప్రపంచకప్ మ్యాచ్ లలో మునిగితేలిన భారత్ ..7 మాసాల తరువాత 50 ఓవర్ల వన్డే మ్యాచ్ ల వైపు దృష్టి మళ్లించింది.

త్వరలో జరిగే చాంపియన్స్ ట్రోఫీ ( ఐసీసీ మినీ ప్రపంచకప్ ) పోటీలకు సన్నాహాకంగా శ్రీలంకతో మూడుమ్యాచ్ ల సిరీస్ లో పాల్గోనుంది.

సరికొత్త కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలో భారత్ మొట్టమొదటి వన్డే సిరీస్ కు సిద్ధమయ్యింది.

భారత్ వేదికగా ముగిసిన 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్ర్రేలియా చేతిలో ఓటమి తరువాత నుంచి భారతజట్టు టీ-20 మ్యాచ్ లు మాత్రమే ఆడుతూ వచ్చింది.

2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ గెలుచుకోడంతోనే భారత్ ఇక వన్డే సిరీస్ లవైపు దృష్టి మళ్లించింది.

టాప్ ర్యాంకర్ భారత్..7వ ర్యాంకులో శ్రీలంక..

ఐసీసీ వన్డే తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచకప్ రన్నరప్ భారత్ టాప్ ర్యాంకర్ గా ఉంటే..మాజీ చాంపియన్ శ్రీలంక 7వ ర్యాంకులో కొనసాగుతోంది. వచ్చే ఏడాది జరిగే ఐసీసీ మినీ ప్రపంచకప్ ( చాంపియన్స్ ట్రోఫీ) ప్రారంభానికి ముందు భారత్ కేవలం ఆరు అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ల్లో మాత్రమే పాల్గోనుంది. ప్రస్తుత సిరీస్ లోని మూడు మ్యాచ్ లతో పాటు..మరో మూడు అంతర్జాతీయ మ్యాచ్ ల్లో మాత్రమే భారత్ తలపడాల్సి ఉంది.

శ్రీలంకతో ఈరోజు నుంచి జరిగే మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ను తాము ఏమాత్రం తక్కువగా అంచనావేయడం లేదని, అత్యుత్తమస్థాయి క్రికెట్ ఆడటానికి మాత్రమే తాము లంక పర్యటనకు వచ్చినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. ఈ మూడుమ్యాచ్ ల ద్వారా పలువురు యువఆటగాళ్లకు తగిన అవకాశాలు కల్పించడం ద్వారా ప్రయోగాలు చేయటానికి కూడా వెనుకాడబోమని భారత కెప్టెన్ ప్రకటించాడు.

ఇటు రాహుల్...అటు రిషభ్...

భారత టీమ్ మేనేజ్ మెంట్ కు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చిపడింది. కారుప్రమాదంలో తీవ్రగాయాల కారణంగా గత రెండేళ్లుగా వన్డే మ్యాచ్ లకు రిషభ్ పంత్ దూరంకావడంతో..ఆ లోటును వికెట్ కీపర్ బ్యాటర్ రాహుల్ తో పూడ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రిషభ్ పంత్ పూర్తిస్థాయి ఫిట్ నెస్ తో జట్టుకు అందుబాటులోకి రావడంతో..తుదిజట్టులోకి ఎవరిని తీసుకోవాలో తేల్చుకోలేక భారత టీమ్ మేనేజ్ మెంట్ సతమతమవుతోంది. అయితే..రిషభ్ తనవంతు కోసం ఒకటి రెండుమ్యాచ్ లు వేచిచూడక తప్పని పరిస్థితి నెలకొంది.

ఈ సిరీస్ లోని ప్రతిమ్యాచ్ తమ జట్టుకు మాత్రమే కాదు..జట్టు సభ్యుల్లో ప్రతి ఒక్కరికీ కీలకమేనని కెప్టెన్ రోహిత్ ప్రకటించడంతో ఆటగాళ్లంతా పూర్తిస్థాయిలో రాణించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

హార్థిక్ పాండ్యా, జస్ ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలకు ప్రస్తుత సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించడంతో యువఆటగాళ్లు ప్రస్తుత ఈ సిరీస్ లో కీలకం కానున్నారు.

భారత్ 99- శ్రీలంక 57 విజయాలు

ప్రపంచ వన్డే మాజీ చాంపియన్లు భారత్- శ్రీలంకజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే...భారతజట్టుదే పైచేయిగా ఉంది. రెండుజట్లూ ఇప్పటి వరకూ 168 వన్డేలలో తలపడితే..భారత్ 99 విజయాలు, శ్రీలంక 57 విజయాలు సాధించాయి. 11 మ్యాచ్ లు మాత్రమే ఫలితం తేలకుండా ముగిశాయి.

ఈ రెండుజట్లూ తలపడిన గత ఐదు వన్డేలలో భారత్ నూటికి నూరుశాతం విజయాలతో ఉంది. అంతేకాదు..ఈ రెండుజట్లూ ఆడిన గత ఐదు వన్డే మ్యాచ్ ల్లో 3 విజయాలు, 2 పరాజయాల రికార్డుతో ఉన్నాయి.

స్పిన్నర్ల స్వర్గం ప్రేమదాస్ స్టేడియం..

ప్రస్తుత సిరీస్ కు ఆతిథ్యమిస్తున్న కొలంబోలోని ప్రేమదాస స్టేడియం పిచ్ పైన స్లో బౌలర్లు, ప్రధానంగా స్పిన్నర్లు రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 2020 తరువాత నుంచి ఇదే స్టేడియం వేదికగా జరిగిన 19 వన్డేలలో ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టు 9 విజయాలు, చేజింగ్ కు దిగిన జట్టు 8 విజయాలు సాధించాయి.

అంతేకాదు..టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్నజట్లే అత్యధికంగా విజయాలు సాధించడం విశేషం.

టాస్ నెగ్గిన జట్లు 15సార్లు బ్యాటింగ్ ఎంచుకొని 5 మ్యాచ్ ల్లో మాత్రమే విజయాలు సాధిస్తే..చేజింగ్ కు దిగిన జట్లు 13 విజయాలు సాధించడం మరో విశేషం. ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్ల సగటు స్కోరు 244గా ఉంటే..చేజింగ్ సగటు లక్ష్యం 206 పరుగులుగా ఉంది.

ఇదే వేదికలో జరిగిన 2023 ఆసియాకప్ ఫైనల్లో భారత బౌలర్ల ధాటికి శ్రీలంక కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. వన్డేలలో అత్యల్పస్కోరు రికార్డు శ్రీలంక పేరుతోనే ఉంది.

భారీస్కోర్లకు రోహిత్, విరాట్ గురి...

టీ-20 ప్రపంచకప్ విజయం తరువాత టీ-20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన భారత దిగ్గజ బ్యాటర్ల జోడీ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ మరోసారి తమ బ్యాట్లకు పూర్తిస్థాయిలో పని చెప్పడానికి ప్రస్తుత సిరీస్ ను వేదికగా చేసుకోనున్నారు. ఇద్దరూ భారీస్కోర్లు సాధించడం ద్వారా గాడిలో పడాలని భావిస్తున్నారు.

ప్రేమదాస స్టేడియం వేదికగా ఆడిన 10 ఇన్నింగ్స్ లో విరాట్ కొహ్లీకి 644 పరుగులు సాధించిన తిరుగులేని రికార్డు ఉంది. 107.33 సగటుతో నాలుగు శతకాలు సాధించాడు.

మరోవైపు..ఆతిథ్య శ్రీలంక జట్టు మాత్రం పలువురు కీలక ఫాస్ట్ బౌలర్ల గాయాలతో బాగా బలహీన పడింది. సీనియర్ ప్లేయర్లు నిస్సంకా, అసలంకాలపైనే పూర్తిగా ఆధారపడి ఉంది.

ప్రస్తుత ఈ తొలివన్డే సజావుగా సాగితే భారత్ కు 70 శాతం విజయావకాశాలున్నాయని క్రికెట్ పండితులు చెబుతున్నారు. అయితే..ఉరుములు మెరుపులు కూడిన వర్షంతో మ్యాచ్ కు పలుమార్లు అంతరాయం కలిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

First Published:  2 Aug 2024 3:01 PM IST
Next Story