డర్బన్ చేరిన భారత క్రికెట్ జట్టు!
దక్షిణాఫ్రికాలో నెలరోజుల పర్యటన కోసం చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో భారతజట్టు సభ్యులు బెంగళూరు నుంచి డర్బన్ చేరుకొన్నారు.
దక్షిణాఫ్రికాలో నెలరోజుల పర్యటన కోసం చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో భారతజట్టు సభ్యులు బెంగళూరు నుంచి డర్బన్ చేరుకొన్నారు. తీన్మార్ టీ-20 సిరీస్ తో టాప్ ర్యాంకర్ భారత్ తన సఫారీ వేటను ప్రారంభించనుంది.....
వైట్ బాల్ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు భారత్ నెలరోజుల పర్యటన కోసం దక్షిణాఫ్రికా చేరుకొంది. క్రికెట్ మూడు ఫార్మాట్ల ముగ్గురు వేర్వేరు కెప్టెన్లతో భారత్..సఫారీజట్టుతో టీ-20, వన్డే, టెస్టు సిరీస్ ల్లో తలపడనుంది.
మూడంచెలుగా భారతజట్టు పర్యటన....
దక్షిణాఫ్రికా పర్యటన కాలంలో భారత టీ-20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్, వన్డే జట్టుకు కెఎల్ రాహుల్, టెస్టు జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నారు.
మూడంచెల సిరీస్ పరంపరలో భాగంగా డిసెంబర్ 10 నుంచి జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ లో రెండుజట్లూ తలపడనున్నాయి.
స్వదేశంలో తిరుగులేని జట్టుగా పేరుపొందిన దక్షిణాఫ్రికా టీ-20, వన్డే జట్లకు ఎడెన్ మర్కరమ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా...
మరో 7 మాసాలలో కరీబియన్ ద్వీపాలు, అమెరికా దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరుగనున్న 2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా..ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు భారత్ వరుసగా రెండో సిరీస్ విజయానికి గురిపెట్టింది.
4వ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాతో ముగిసిన 5 మ్యాచ్ ల సిరీస్ ను 4-1తో నెగ్గిన భారత యువజట్టు సఫారీగడ్డపై సఫారీజట్టును ఓడించాలన్న పట్టుదలతో ఉంది.
సిరీస్ లోని తొలి టీ-20 మ్యాచ్ డర్బన్ లోని కింగ్స్ మీడ్ స్టేడియం వేదికగా డిసెంబర్ 10న జరుగనుంది. డిసెంబర్ 14న జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగే మూడో టీ-20తో సిరీస్ ముగియనుంది.
డిసెంబర్ 17 నుంచి వన్డే సిరీస్..
టీ-20 సిరీస్ ముగిసిన మూడురోజుల తరువాత మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ కు తెరలేవనుంది. డిసెంబర్ 17 జోహెన్స్ బర్గ్ వేదికగా తొలివన్డే, పార్ల్ వేదికగా ఆఖరి వన్డే జరుగనున్నాయి.
ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా డిసెంబర్ 26 నుంచి రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ జరుగనుంది. భారతజట్టుకు రోహిత్ శర్మ, దక్షిణాఫ్రికాజట్టుకు బవుమా కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.
తొలిటెస్టుమ్యాచ్ పేస్ బౌలర్ల అడ్డా సెంచూరియన్ పార్క్ వేదికగాను, జనవరి 3 నుంచి స్పిన్నర్లకు అనవుగా ఉండే డర్బన్ పిచ్ పైన రెండో టెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తారు.
బెంగళూరు నుంచి డర్బన్ చేరుకొన్న భారతజట్టు సభ్యులకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సాంప్రదాయరీతిలో స్వాగత కార్యక్రమాలు నిర్వహించింది.
సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, హార్థిక్ పాండ్యా లేకుండా సూర్యకుమార్ నాయకత్వంలో ఎక్కువమంది యువఆటగాళ్లతో భారత్ టీ-20 సిరీస్ సమరానికి సిద్ధమయ్యింది.
భారత టీ-20 జట్టులోని ఇతర ఆటగాళ్లలో శుభ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గయక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, జితేశ్ శర్మ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, దీపక్ చహార్ ఉన్నారు.
వన్డే జట్టుకు యువరక్తం....
కెఎల్ రాహుల్ నాయకత్వంలోని భారత వన్డేజట్టులో తొలిసారిగా పలువురు యువక్రికెటర్లకు చోటు కల్పించారు. రుతురాజ్ గయక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహాల్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, దీపక్ చహార్.
టెస్టుజట్టులో చోటు దక్కని పూజారా...
రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పూజారా చోటు దక్కించుకోలేకపోయాడు. రోహిత్ శర్మ నాయకత్వంలోని జట్టులో శుభ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్, విరాట్ కొహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గయక్వాడ్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ ప్రీత్ బుమ్రా,ప్రసిద్ధ కృష్ణ, ముకేశ్ కుమార్ ఉన్నారు.
టీ-20 జట్టుకు రవీంద్ర జడేజా, టెస్టు జట్టుకు జస్ ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.