Telugu Global
Sports

సిరాజ్ ఆరు..55 పరుగులకే సఫారీల బేజారు!

కొత్త సంవత్సరాన్ని భారతజట్టు దూకుడుగా మొదలు పెట్టింది. కేప్ టౌన్ టెస్ట్ తొలిరోజు ఆట లంచ్ విరామానికి ముందే దక్షిణాఫ్రికాను 55 పరుగులకే కుప్పకూల్చింది.

సిరాజ్ ఆరు..55 పరుగులకే సఫారీల బేజారు!
X

కొత్త సంవత్సరాన్ని భారతజట్టు దూకుడుగా మొదలు పెట్టింది. కేప్ టౌన్ టెస్ట్ తొలిరోజు ఆట లంచ్ విరామానికి ముందే దక్షిణాఫ్రికాను 55 పరుగులకే కుప్పకూల్చింది...

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ వేదికగా ప్రారంభమైన కీలక ఆఖరి టెస్టు మొదటి రెండుగంటల ఆటలోనే భారత పేస్ బౌలర్లు శివమెత్తి పోయారు. ఆతిథ్య దక్షిణాఫ్రికాను కేవలం 23.2 ఓవర్లలోనే 55 పరుగులకే కుప్పకూల్చారు.

భారత్ టాస్ ఓడినా....

పేస్ బౌలింగ్ కు అనువుగా ఉన్న వికెట్ పై ముందుగా టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్న సఫారీటీమ్ భారీమూల్యమే చెల్లించుకొంది. సిరీస్ ను 1-1తో సమం చేయాలంటే నెగ్గితీరాల్సిన ఈ మ్యాచ్ లో భారత్ రెండుమార్పులతో బరిలో నిలిచింది.

పేస్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్, స్పిన్ ఆల్ రౌండర్ అశ్విన్ లకు బదులుగా ముకేశ్ కుమార్, రవీంద్ర జడేజాలను తుదిజట్టులోకి తీసుకొంది.

మరోవైపు తన కెరియర్ లో ఆఖరి టెస్టుమ్యాచ్ ఆడుతున్న దక్షిణాఫ్రికా స్టాప్ గ్యాప్ కెప్టెన్ డీన్ ఎల్గర్- మర్కరమ్ కలసి తమజట్టు బ్యాటింగ్ ను ప్రారంభించారు.

భారత పేస్ బౌలింగ్ జోడీ మహ్మద్ సిరాజ్, జస్ ప్రీత్ బుమ్రా సైతం ఓ వ్యూహం ప్రకారం కుదురుగా బౌల్ చేసి సఫారీ ఓపెనర్లను ఓత్తిడిలో పడవేశారు.

మర్కరమ్ ను 2 పరుగుల స్కోరుకే సిరాజ్ పడగొట్టాడు. ఆ తర్వాత కెప్టెన్ కమ్ ఓపెనర్ ఎల్గర్ సైతం 4 పరుగుల స్కోరుకే దొరికిపోయాడు.

నిరాశతో వెనుదిరిగిన ఎల్గర్...

సెంచూరియన్ పార్క్ వేదికగా జరిగిన తొలిటెస్టులో 185 పరుగుల స్కోరుతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన ఎల్గర్..కేప్ టౌన్ వేదికగా ప్రారంభమైన తన వీడ్కోలు టెస్టును గొప్పగా ముగించాలని, సిరీస్ విజయంతో నిలవాలని తహతహలాడాడు. అయితే 4 పరుగుల స్కోరుకే సిరాజ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

అయితే..భారత్ ప్రత్యర్థిగా టెస్టుమ్యాచ్ ల్లో ఎల్గర్ 1000 పరుగుల మైలురాయిని చేరుకోగలిగాడు. 15 టెస్టుల్లో భారత్ పై వెయ్యి పరుగులు సాధించగలిగాడు.

ఆ తరువాత వచ్చిన సఫారీ బ్యాటర్లలో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు సాధించగిలిగారు. మిగిలినవారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుటయ్యారు.

వన్ డౌన్ టోనీ 2, స్టబ్స్ 3 పరుగులకు అవుట్ కాగా..మిడిలార్డర్ బ్యాటర్లు బేడింగ్ హామ్ 12, వికెట్ కీపర్ వెరియానీ 15 పరుగుల స్కోర్లు సాధించారు.

మార్కో జెన్సన్ డకౌట్ కాగా..కేశవ్ మహారాజ్ 3, రబడ 5, బర్గర్ 4 పరుగులకు అవుటవ్వడంతో సఫారీటీమ్ 55 పరుగులకే కుప్పకూలింది.

గత 96 సంవత్సరాలలో...

టెస్ట్ క్రికెట్ గత 96 సంవత్సరాలలో టెస్ట్ తొలిరోజు ఆట మొదటి రెండున్నర గంటల్లోనే 55 పరుగులకే కుప్పకూలిన తొలిజట్టుగా దక్షిణాఫ్రికా చెత్త రికార్డును మూటగట్టుకొంది. 1927 తరువాత సఫారీ టాపార్డర్ లోని మొదటి నలుగురు బ్యాటర్లు 12 పరుగుల స్కోరుకే అవుట్ కావడం ఇదే మొదటిసారి.

భారత ఓపెనింగ్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తన మొదటి 8 ఓవర్లలోనే 9 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. చివరకు 9 ఓవర్లలో 16 పరుగులిచ్చి 6 వికెట్లు సాధించాడు. టెస్టు క్రికెట్లో 5 వికెట్లు పడగొట్టడం సిరాజ్ కెరియర్ లో ఇది మూడోసారి.

బుమ్రా 25 పరుగులిచ్చి 2 వికెట్లు, ముకేశ్ కుమార్ 2.2 ఓవర్లలో ఒక్క పరుగు ఇవ్వకుండా 2 వికెట్లు పడగొట్టారు. లంచ్ విరామం తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ తొలి వికెట్ కోల్పోయినా..కెప్టెన్ రోహిత్, వన్ డౌన్ శుభ్ మన్ గిల్ రెండో వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయడంతో భారత్ భారీస్కోరుకు పునాది వేసుకోగలిగింది.

First Published:  3 Jan 2024 5:43 PM IST
Next Story