Telugu Global
Sports

సెంచూరియన్ టెస్టులో భారత్ ను ఆదుకొన్న రాహుల్!

దక్షిణాఫ్రికాతో రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ను భారత్ తడబడుతూ ప్రారంభించింది. సెంచూరియన్ టెస్ట్ తొలిరోజు ఆటను 8 వికెట్లకు 208 పరుగుల స్కోరుతో ముగించింది.

సెంచూరియన్ టెస్టులో భారత్ ను ఆదుకొన్న రాహుల్!
X

దక్షిణాఫ్రికాతో రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ను భారత్ తడబడుతూ ప్రారంభించింది. సెంచూరియన్ టెస్ట్ తొలిరోజు ఆటను 8 వికెట్లకు 208 పరుగుల స్కోరుతో ముగించింది.

ఫాస్ట్ బౌలర్ల అడ్డా దక్షిణాఫ్రికాగడ్డపై గత మూడుదశాబ్దాల కాలంలో తొలిటెస్టు సిరీస్ నెగ్గాలన్న టాప్ ర్యాంకర్ భారత్ ..తొలిటెస్టు తొలిరోజుఆటలోనే ఎదురీత మొదలు పెట్టింది.

సఫారీ కంచుకోట సెంచూరియన్...

ఫాస్ట్- బౌన్సీ పిచ్ లకు చిరునామాగా నిలిచే దక్షిణాఫ్రికాకు టెస్టు క్రికెట్లో జోహెన్స్ బర్గ్ లోని సెంచూరియన్ పార్క్ కంచుకోట లాంటింది. సెంచూరియన్ లోని సూపర్ స్పోర్ట్స్ పార్క్ వేదికగా ఆడిన 28 టెస్టుల్లో 22 విజయాలు సాధించిన తిరుగులేని రికార్డు సఫారీజట్టుకు ఉంది. అదే వేదికగా ప్రస్తుత సిరీస్ లోని తొలిటెస్టులో భారత్ కు తొలిరోజుఆటలోనే సఫారీ ఫాస్ట్ బౌలర్ల త్రయం పగ్గాలు వేసింది.

ప్రపంచ టెస్టు లీగ్ లో భాగంగా జరుగుతున్న ఈ రెండుమ్యాచ్ ల సిరీస్ లో హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగిన భారతజట్టు తొలిరోజుఆటను ఆశించినస్థాయిలో ప్రారంభించలేకపోయింది.

ప్రసిద్ధకు టెస్ట్ క్యాప్, జడేజా స్థానంలో అశ్విన్...

ఈ కీలక టెస్టు సిరీస్ తొలిమ్యాచ్ లో భారత్ యువఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణతో టెస్టు అరంగేట్రం చేయించింది. స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వెన్నెముక గాయంతో అందుబాటులో లేకపోడంతో ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కు తుదిజట్టులో చోటు కల్పించారు.

మరోవైపు..ఆతిథ్య దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ల జోడీ నాంద్రే బర్గర్, కోయిట్జేలకు తొలిసారిగా టెస్టుమ్యాచ్ లు ఆడే అవకాశం కల్పించింది.

వాతావరణం మేఘావృతంగా ఉన్న నేపథ్యంలో సఫారీకెప్టెన్ బవుమా కీలక టాస్ నెగ్గి మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకొన్నాడు. రోహిత్ శర్మ- యశస్వి జైశ్వాల్ లతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ప్రారంభ ఓవర్ల నుంచే సఫారీ ఫాస్ట్ బౌలర్లు చుక్కలు చూపించారు.

నిప్పులు చెరిగిన రబడ, బర్గర్...

సెంచూరియన్ పార్క్ బౌన్సీ పిచ్ పైన సఫారీ ఫాస్ట్ బౌలర్లు బర్గర్, రబడ చెలరేగిపోయారు. మెరుపువేగంతో బంతులు విసురుతూ భారత టాపార్డర్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు.

24 పరుగులకే మూడు టాపార్టర్ వికెట్లు పడగొట్టడం ద్వారా భారత్ ను ఆత్మరక్షణలో పడేశారు.

కెప్టెన్ రోహిత్ 14 బంతుల్లో 5, యువఓపెనర్ యశస్వి జైశ్వాల్ 37 బంతుల్లో 4 బౌండ్రీలతో 17, వన్ డౌన్ శుభ్ మన్ గిల్ 12 బంతుల్లో 2 పరుగుల స్కోర్లకు అవుట్ కావడంతో భారత్ మరి తేరుకోలేకపోయింది.

యశస్వి, గిల్ లను అరంగేట్రం పేసర్ బర్గర్ అవుట్ చేస్తే...రోహిత్ శర్మను రబడ పెవీలియన్ దారి పట్టించాడు.

విరాట్- శ్రేయస్ పోరాటం...

24 పరుగులకే 3 టాపార్డర్ వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టిన తమజట్టును ఆదుకోడానికి విరాట్ కొహ్లీ- శ్రేయస్ అయ్యర్ జోడీ తమవంతుగా పోరాడారు. 4వ వికెట్ కు 68 పరుగుల భాగస్వామ్యంతో ఎదురొడ్డి నిలిచారు.

విరాట్ 64 బంతుల్లో 5 బౌండ్రీలతో 38, శ్రేయస్ అయ్యర్ 50 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్ తో 31 పరుగులకు వెంట వెంటనే అవుట్ కావడంతో భారత్ కథ మళ్లీ మొదలుకొచ్చింది.

అయ్యర్ అవుట్ కావడంతోనే క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ రాహుల్ ఆచితూచి ఆడుతూ సఫారీ ఫాస్ట్ బౌలర్లను నిలువరించాడు. అశ్విన్ 11 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

అశ్విన్ స్థానంలో వచ్చిన ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ తో కలసి రాహుల్ మరో కీలక భాగస్వామ్యం నమోదు చేయడం ద్వారా భారత స్కోరు 200 దాటడంలో కీలకపాత్ర పోషించాడు.

శార్దూల్ 33 బంతుల్లో 3 ఫోర్లతో 24, జస్ ప్రీత్ బుమ్రా 19 బంతుల్లో ఒక్క పరుగు స్కోరుకు అవుట్ కావడంతో భారత్ 8 వికెట్లు నష్టపోయినా..మరోవైపు రాహుల్ ఒంటరి పోరాటం చేసి 106 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు.

తీవ్రఒత్తిడి నడుమ రాహుల్ షో...

గతంలో భారతజట్టుకు ఓపెనర్ గా సెంచరీలు సాధించిన రాహుల్ తన కెరియర్ లో తొలిసారిగా మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు దిగినా స్థాయికి తగ్గట్టుగా రాణించాడు.

సఫారీ పేసర్లను దీటుగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నాడు.

రాహుల్ సాధించిన 70 పరుగుల స్కోరు..సెంచరీతో సమానమంటూ భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కొనియాడారు. సెంచూరియన్ పార్క్ వికెట్ పై పరుగులు చేయటం అంతతేలికకాదని..అలాంటి పిచ్ పైన రాహుల్ ఆటతీరు అమోఘమంటూ ప్రశంసించారు.

అవుట్ ఫీల్డ్ తడి ఆరకపోడంతో ఆలస్యంగా ప్రారంభమైన ఈ టెస్టు తొలిరోజు ఆట 59 ఓవర్లతోనే ముగిసింది. రాహుల్ 70, సిరాజ్ పరుగులేవీ లేకుండా క్రీజులో ఉన్నారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడ 5 వికెట్లు, బర్గర్ 2, మార్కో జెన్సన్ 1 వికెట్ పడగొట్టారు. సఫారీ సీనియర్ ఫాస్ట్ బౌలర్ రబడకు టెస్టు క్రికెట్లో 5 వికెట్లు పడగొట్టడం ఇది 14వసారి.

ఈరోజు ప్రారంభమయ్యే ఆట 2వ రోజున భారత్ 250 పరుగుల స్కోరు సాధించగలిగితేనే సఫారీజట్టును దీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

రాహుల్ కు టెయిల్ ఎండర్ల జోడీ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ అండగా నిలబడగలిగితేనే గౌరవప్రదమైన స్కోరు సాధించే అవకాశం ఉంది.

First Published:  27 Dec 2023 8:00 AM IST
Next Story